WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 17 December 2015

INFORMATION ABOUT ASIAN LORD SIVA TEMPLES


ఆగ్నేయాసియా దేశమైన ప్రస్తుత వియత్నాంలో ఒకప్పుడు భారతీయ హిందూ సాంస్కృతిక మూలాలు వేళ్లూనుకున్నాయని చెప్పొచ్చు. ఆ విషయాన్ని రూఢి చేయడానికి తగినన్ని చారిత్రక ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుతం శిథిలస్థితిలో ఉన్న మీసన్ (మై-సన్) శివాలయం ప్రాంగణమే అందుకు ఉదాహరణ. చంప రాజ్యంలో మీసన్ మత, రాజకీయ రాజధానిగా విరాజిల్లిందనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. క్రీ.శ. 4-14 శతాబ్దాల మధ్య ఈ విభిన్నమైన, మరెక్కడా లేని సంస్కృతిగా ఇది ఇక్కడ కొలువుదీరింది.
చంప రాజుల హయాంలో మీసన్ టెంపుల్ నిర్మితమైంది. అంటే 4వ శతాబ్దం మొదట్లోనన్నమాట. ‘టవర్ టెంపుల్స్’ శైలిలో వీటిని నిర్మించారు. దీనికి ‘చమ్-పా’ శైలిగా పేర్కొంటారు. నిలువెత్తుగా ఉండే ఈ నిర్మాణంలో పై గోపురం - మధ్య ఆలయం - దిగువ హాలు లాంటి విభాగాలు ఉంటాయి. ప్రస్తుతం అవి శిథిలమైపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిని మొండిగోడలతో మిగిలి ఆనాటి వైభవానికి శిథిల సాక్ష్యాలుగా మిగిలాయి. మీసన్‌లోని టవర్ టెంపుల్స్‌లో శివారాధనే జరిగేది. ఆ కాలంలో స్థానికులు ఈశ్వరుడిని రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ ‘్భద్రేశ్వర’ అని ఎక్కువమంది శివుడ్ని కొలిచేవారు.
ఎక్కడ ఉందంటే... సెంట్రల్ వియత్నాంలోని క్వాంగ్‌నమ్ ప్రావిన్స్ పరిథిలోకి వచ్చే డైఫు గ్రామంలో మీసన్ ఉంది. ద నంగ్ పట్టణానికి 69 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. చారిత్రక పట్టణం ‘ట్రకి’కి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. నిజానికి మీసన్ శివాలయం అని పిలిచినప్పటికీ ఇది కొన్ని ఆలయాల సమూహం. రెండు పర్వతశ్రేణుల నడుమ సహజంగా ఏర్పడ్డ లోయలో రెండు కిలోమీటర్ల వెడల్పున ఈ ఆలయాల సమూహం ఉంది. దాదాపు 70 ఆలయాలు అక్కడ ఉండేవి. క్రీస్తుశకం 4-14 శతాబ్దాల మధ్య మీసన్ ఆలయాలు మతసంబంధమైన ఉత్సవాలకు కేంద్రంగా ఉండేవి. చంప రాజుల కాలంలో దేదీప్యమానంగా ఈ ఆలయాలు విలసిల్లాయి. రాజవంశీకులు, దేశం ఔన్నత్యంకోసం పోరాడిన యోధుల అంత్యక్రియలుకూడా ఈ ప్రాంతంలో నిర్వహించేవారు. చామ్ నగరాలుగా ప్రసిద్ధిపొందిన ఇంద్రపుర (దోంగ్ దువాంగ్), సింహపుర (ట్రకి)కు సమీపంలో మీసన్ ఉంది. సంస్కృతం, చామ్ భాషలో రాసిన శిలాశాసనాల సమూహం మీసన్‌లో ఎటుచూసినా కన్పిస్తాయి. అలనాటి వైభవానికి నిలువెత్తు నిదర్శనాలుగా అవి ఉన్నాయి. ఇండోచైనా ప్రాంతాలకు చెందినవారు ఇక్కడ పెద్దసంఖ్యలో నివసించేవారని చెప్పొచ్చు. అయితే వియత్నాం యుద్ధంలో వారంరోజులపాటు అమెరికా కురిపించిన కార్పెట్ బాంబుల వర్షంలో ఈ పురావస్తు సంపద చాలావరకు ధ్వంసమైంది.
హిందూసంస్కృతికి చిహ్నం.. వియత్నాంలోని మీసన్ శివాలయ సమూహం హిందు ఆలయాల సంస్కృతికి దీటైన చిహ్నంగా చెబుతారు. ఆగ్నేయాసియాలో ఇలాగే విలసిల్లిన బొరొబుడ్దర్ (జావా,ఇండోనేషియా), అంగ్‌కర్ వట్ (కంబోడియా), బగన్ (మయన్మార్), అయుత్తయ (్థయ్‌లాండ్)లలోని ఆలయాలతో మీసన్‌ను పోలుస్తారు. మీసన్‌కు అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1999లో మీసన్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. గుర్తింపువాజ్యంలో యునెస్కో పేర్కొన్న అంశాలు దాని ఘనతను చాటిచెబుతాయి. కాల పరిణామానికి, సాంస్కృతిక మార్పులకు, అంతరించిపోయిన ఆసియా నాగరికతకు ఇది సాక్ష్యమని యునెస్కో పేర్కొంది.
భద్రవర్మన్ హయాంలో... చంప రాజు భద్రవర్మన్ హయాంలో, అంటే క్రీస్తుశకం 380-413 సంవత్సరాల కాలంలో మీసన్ ఆలయాలు నిర్మించారని ఆధారాలున్నాయి. ఆయన చాలాకాలం పాటు ఉత్తర వియత్నాంలో చైనా ఆక్రమిత ప్రాంతాలపై యుద్ధం చేశాడు. మీసన్‌లో నిర్మించిన ఓ ఆలయంలోని హాలులో తనపేరు వచ్చేలా ‘్భద్రేశ్వర’ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు భద్మవర్మన్. ఆ ఆలయంవద్ద ఆయన ప్రతిష్ఠించిన ఓ శిలాశాసనం అతడి దృక్పథాన్ని చాటిచెబుతుంది. తన తదుపరి రాజులకు ఆయనేం చెప్పదలచుకున్నాడో ఆ శిలాఫలకాలపై పేర్కొన్నాడు. ‘నేను మీకిచ్చిన దానిని ధ్వంసం చేయకండి, కరుణతో వాటిని రక్షించండి’ అని పేర్కొన్నాడు. ఇక సంసార, కామ సిద్ధాంతాలను గుర్తుచేస్తూ ‘ఒకవేళ మీరు వాటిని ధ్వంసం చేస్తే మీరు వివిధ జన్మలలో చేసిన మంచి అంతా నాకు చెందుతుంది. నేను చేసిన చెడు అంతా మీకు చేరుతుంది’ అని హెచ్చరించాడు. ‘నేను అప్పగించిన దానిని సక్రమంగా నిర్వహిస్తే మంచి అంతా మీకు మాత్రమే దక్కుతుంది’ అని స్పష్టంగా రాయించాడు. అందువల్లే చంప రాజ్యంలో దశాబ్దాలపాటు మీసన్ ఆలయాలు వెలుగొందాయి.
ఆధునిక కాలంలో... 1937లో ఫ్రాన్స్‌కు చెందిన పండితులు మీసన్ శివాలయాలను పునరుద్ధరించడం ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదికి ప్రధాన ఆలయం పనులు పూర్తయ్యాయి. 1943కల్లా చిన్నచిన్న ఆలయాల పునరుద్ధరణ జరిగింది. 1969లో అమెరికా బాంబుల వర్షంలో చాలా చారిత్రక నిర్మాణాలు నేలకూలాయి. 2002-04లో వియత్నాం సాంస్కృతిక మంత్రిత్వశాఖ మీసన్ ఆలయ సమూహాన్ని సంరక్షించడానికి 440,000 యుఎస్ డాలర్లు కేటాయించింది. మీసన్ ఆలయాలు మరింత ధ్వంసంకాకుండా కాపాడేందుకు యునెస్కో రూపొందించిన ప్రణాళికను అమలుచేసేందుకు జపాన్, ఇటలీ ముందుకొచ్చాయి. వరల్డ్ మాన్యుమెంట్స ఫండ్‌కూడా నిధులు సమకూరుస్తోంది. చంప, సంస్కృత భాషలో ఉన్న శిలాశాసనాల్లోని అర్థాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసి అందరికీ అందుబాటులో ఉంచారు. ఒకప్పుడు, భరతభూమికి సుదూరంగా, శతాబ్దాలపాటు విరాజిల్లిన హిందూసంస్కృతీవైభవానికి మీసన్ ఓ చక్కటి ఉదాహరణ. అక్కడి శిథిల ఆలయాలను, ఆనాటి చంప నాగరికత చిహ్నాలను, యుద్ధం సృష్టించిన విధ్వంసాన్ని, సహజసిద్ధమైన వియత్నాం అందాలను తనివితీరా వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తూంటారు. వియత్నాం ప్రభుత్వంకూడా పర్యాటకంగా మీసన్ శివాలయాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది.

No comments:

Post a Comment