WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Karthika Pournami Articles. Show all posts
Showing posts with label Karthika Pournami Articles. Show all posts

Wednesday, 9 December 2015

CHAPTER 28 - KARTHIKHA PURANAM - VISHNU SUDHARSHANA CHAKRA MAHIMA


కార్తీక పురాణము

కార్తీక పురాణము 28వ అధ్యాయము-కార్తీక పురాణము


విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దూర్వాసుని అవస్థలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుకముందు లాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను.
అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వానించితివి, కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. గాని, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యావిష్ణు చక్రము వలన ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆపురాణ పురుషుడు నాకు జ్ఞానోదయముచేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడ నైనను నీ నిష్కళంక భక్తిముందవి యేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు" మని అనేక విధాల ప్రార్ధించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, "ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనఃపూర్వక వందనములు.ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యూతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు. ఒకవేళ నీకర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరిని చేతిలోనుండి అనేక యుద్ధములలో, అనేకమంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరు వారిని యింతవరకు చంపలేదు. అందువలననే యీ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుట లేదు. దేవా! సురాసురాది భూత కోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు. నీశక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్ధించుచున్నాను.
నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకొను చున్ననన్నును, శరణు వేడిన యీ దూర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్ధనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీభక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యేకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈలోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.
ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నాకంటె యెక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాస పతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటివాడు బలవంతుడై యునప్పుడు అతనితో సంధిచేసుకొనుట యుత్తమము. ఈనీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తులనుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, "నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖముగా నుండవలెననియే నా యభిలాష. కాన,శరణుగోరిన ఈ దూర్వాసునీ, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్లకొలది సూర్యమండలములు యేకమైననూ నీ శక్తికీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షి యుందున్న పధ్నాలుగు లోకములను కంటికిరెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నామనఃపూర్వక నమస్కృతులు." అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాధాలింగన మొనర్చి " అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుస్తోత్రము మూడుకాలముల యందు నెవరు పఠింతురో, యెవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, యెవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రతప్రభావము చాలా గొప్పది. నీపుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి అష్టావింశోధ్యాయము
ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.




Saturday, 28 November 2015

HINDU PURANA STORY ABOUT KARTHIKA POURNAMI AND ITS TRADITIONAL AND CULTURAL IMPORTANCE


కార్తిక పున్నమికి సంబంధించి- సరస్వతీనదీ పరివాహక ప్రాతంలో కర్మనిష్ఠుడనే యోగిపుంగవుడు శివపూజలు చేస్తుండేవాడు. నిశ్చలంగా ధ్యానచేయడంకోసం అతను ఓసారి శిథిల శివాలయానికివెళ్లి అక్కడున్న ప్రమిదలలో దీపారాధన చేసి ధ్యానం ప్రారంభించాడు. అక్కడే ఆకలితో తిరుగాడుతున్న ఎలుకకు మరో ప్రమిదలో ఆరిపోయిన వత్తి కనిపించింది. దానిని తిందామనుకొని నోట కరుచుకుని పరుగెడుతున్న సమయంలో వెలుగుతున్న దీపం దానికి తగిలి ఆ ఎలుక నోటిలోని వత్తి వెలిగింది. దానితోపాటే ఆ దీపపు వేడికి ఎలుకకు మూతికాలి ప్రాణాలు కోల్పోయంది. ఆ ఎలుక శరీరంలోంచి ఓ దివ్యుడు రూపుదిద్దుకుని కనులు తెరిచాడు. ఎదురుగా ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠునిచూచి తను ఇక్కడికి ఎలా వచ్చాడో తానెవరో కాస్త చెప్పమని అడిగాడు. అపుడు దైవధ్యానంతో కర్మనిష్ఠుడు జరిగింది తెలుసుకొని కార్తిక పూర్ణిమనాడు దీపప్రజ్వలనంతో నీ గతజన్మపాపం భస్మం అయినందువల్ల నీకీజన్మ వచ్చిందని చెప్పాడు. సంకల్పం లేకుండానే వెలిగించిన దీపానికి ఇంత పుణ్యం వస్తే ఇక తెలిసి చేసినవారికి ఎంత పుణ్యమో గదా అనుకున్న ఆ ఎలుకనుంచి వచ్చిన మనిషి వెనువెంటనే శివధ్యాన తత్పరుడయ్యాడు. భక్తేశ్వర వ్రతకథలో తన ఇష్టదైవమైన శివుణ్ణి ప్రార్థించి కుముద్వతి అనే మహిళ అల్పాయుష్కుడైన తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. కనుక స్ర్తిలందరూ తమ మాంగల్య బలంకోసం పార్వతీ పరమేశ్వరాధన చేస్తారు. కోడెదూడను పితృదేవతాప్రీత్యర్థం కార్తిక పున్నమినాడు వదులుతారు. పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో నదులలో అరటిదొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. పరాశక్తికి, శివకేశవులకు పంచభక్ష్యాదులను నివేదన చేస్తారు. కార్తిక పురాణం, వెండి, బంగారం, సాలగ్రామం, భూ, గోదానాలతో పాటు అన్నదానం చేస్తే అధికమైన పుణ్యఫలం లభిస్తుంది. తిరువణ్ణామలైలోని అరుణాచలస్వామి దేవాలయంలో కార్తిక దీపోత్సవాలను ఘనంగా చేస్తారు. కార్తిక పూర్ణిమనాడు బౌద్ధులకు చాతుర్మాస వ్రతసమాప్తి దినం. నేడు బుద్ధుడు తన తల్లి చెంత ఉంటాడని బౌద్ధులు నమ్ముతారు. కార్తిక పున్నమినాడు టపాసులు, మతాబులు కాల్చడం కూడా సంప్రదాయమే.
త్రిపురాసుర సంహారం జరిగిన ఘటనను పురస్కరించుకొని ఈ పున్నమిని త్రిపుర పూర్ణిమగా భావించి త్రిపురాసుర సంహారి అంటూ శివనామస్మరణ చేస్తారు. పార్వతీ మాంగల్యాన్ని కాపాడిన రోజు అని జ్వాలాతోరణాలు నిర్వహిస్తారు. యోగనిద్రనుంచి మేల్కొని తులసీవనానికి విచ్చేసి భక్తులను అలరిస్తున్న మహా విష్ణువును చూచి వైష్ణవాలయాల్లో కార్తికదామోదరుని అర్చనలూ, ఉసిరికను చేర్చి తులసి పూజలు, చేస్తారు. దంపతులు ఈ రోజున సరిగంగ స్నానాలు చేస్తారు. దత్తాత్రేయ జన్మదినంగా కూడా కార్తిక పూర్ణిమను కొన్ని ప్రాంతాలవారు సంభావిస్తారు.
కార్తీక చలిమిళ్ల నోము, కృత్తికా దీపాల నోము, లక్షవత్తుల నోము, లక్ష రుద్రం, వృషవ్రతం, మహీఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరధ పూర్ణిమా వ్రతం లాంటి ఎన్నో నోములను ఈ రోజున స్ర్తిలు నోచుకుంటారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. మున్నూట అరవై వత్తులను వెలిగించడం వల్ల సంవత్సరంలో ఏనాడైనా దీపారాధన చేయకపోవడం వల్ల వచ్చే పాపమేదైనా ఉంటే అది కూడా నశిస్తుంది. అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో దీపాలను వదలడం కార్తిక పున్నమి ప్రత్యేకతనే.
ఆఖరికి కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా దీపారాధన చేసినంత పుణ్యమూ వస్తుంది అంటారు శివభక్తులు. కాశీలో పున్నమినాటి రాత్రి గంగాహారతినిస్తారు. గంగానదిలో దీపాలను వదులుతారు. ఈ రోజు దీపావళిగా కాశీవాసులు సంభావిస్తారు. పల్నాటిసీమలో దీనిని వీరుల పండుగ అంటారు. పౌర్ణమి తిథినాడు జండా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తికమాసంలో నూతనగృహనిర్మాణం, కన్యాదానం చేస్తే ధనధాన్యాభివృద్ధి జరుగుతుందని మత్య్సపురాణం చెబుతుంది

KARTHIKA POURNAMI ARTICLE ABOUT PUJA / VRATHAMS / DEEPA DHANAM / ETC


లక్షబిల్వార్చన, లక్షవత్తుల నోము, లక్ష రుద్రం, వృషవ్రతం,మహీఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరధ పూర్ణిమా వ్రతం, కృత్తికా వ్రతం, మున్నా ట అరవై వత్తులను, ఉసిరికలపై దీపాలు వెలిగిం చటం అనే వ్రతాలకు, నోములకు ఖ్యాతి గాంచిన కార్తికం దీపదానం వస్త్ర దానం, అన్నదానం ఇలా ఏ దానం చేసినా రెట్టింపు ఫలాన్ని స్తుందనే ప్రసిద్ధి పొందింది.
చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమిమిక్కిలి శ్రేష్ఠమైనది. ఈ రోజున రాత్రి అంతా వెనె్నలతో పొటీ నా అన్నట్టు శివాలయాలు, వైష్ణవాల యాలన్న తేడా లేకుండా ప్రతి ఆలయ ప్రాంగణం, జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా దీపాలంకరణ తో దేదీప్య మానంగా ప్రకాశిస్తుంటాయ. కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతారు. కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
మహోన్నతమైన కార్తికం శివకేశవులి ద్దరికీ అత్యంత ప్రియమైంది. కాసిని నీళ్లు ఇచ్చినా, ఆర్తిగా స్మరించినా, ప్రేమగా పండు ఇచ్చినా ఆఖరికి ఒక్క తులసీ దళం ఇచ్చినా నేను ఆ భక్తునకు వశుడిన వుతాను అని చెప్పిన కృష్ణ్భగవానుడికి మల్లె పరమశివుడు, శివాజ్ఞలేనిదే ఈ సృష్టిలో చీమైనా కుట్టదని కీర్తించే యోగీ శ్వరులకే యోగమూర్తి అయన పార్వతీ ప్రియుడు కాసిని నీళ్లు తనపై చిలకరించినా, గుడిలోనే కాదు ఎక్కడైనా కొడి గట్టబోయే దీపాన్ని కాస్త పైకి తోసి వెలిగేలా చేసినా, తెలయకుండా ఉపవాసం చేసినా, మారేడుపత్రం తనపై అనాలోచనంగా వేసినా సరే తన సాయుజ్యానికి రప్పించుకొనేవాడు పరమ దయాళుడైన పరమశివుడు. కార్తిక పున్నమినాడు శివకథలు విన్నా తరగని సంపదలను అను గ్రహించే భోళాశంకరుని స్మరించని వారు ఎవరూ ఉండరు. హింసాత్మకు లైన ఆ త్రిపురాసురులను సైతం పరమ శివుడు సంహరించిన రోజు కార్తిక పున్న మి. ముల్లోకాలను ఆ రాక్షసుల బాధ నుంచి విముక్తులను చేసిన పరమ శివుణ్ణి స్మరించు కుంటూ త్రిపుర పున్నమిగా కూడా ఈ రోజు శివపూజలు చేయడం పరిపాటి. కొన్ని చోట్ల పెళ్లికాని అమ్మాయిలు కార్త్తిక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. మరికొందరు లక్ష్మీస్వరూపంగా తులసి ని, విష్ణు స్వరూపంగా ఉసిరికను భావిం చి ఆ రెండు వృక్షాలను దగ్గరకు చేర్చి కార్తిక పున్నమినాడు తులసీ వివాహం చేస్తారు.
స్ర్తిలందరూ కార్తీక చలిమిళ్ల నోము నోస్తారు. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. కృత్తికా దీపాల నోముకు పున్నమినాటి రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణ వచనం. పౌర్ణమినాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహాలాన్ని లోకహితం కోరి పార్వతిదేవి అనుమతితో పరమేశ్వరుడు సేవించి గరళంలో బంధించి గరళకంఠునిగా కీర్తించబడింది ఈ పున్నమినాడే. తన భర్తకు ఏ ఆపద సంభవించనట్లయితే జ్వాలాతోరణం క్రింద నుంచి ముమ్మారు భర్తతో కూడి ప్రదక్షిణం చేస్తానని పార్వతి మ్రొక్కుతుంది. ఆనాటినుంచి ఈ పున్నమి రాత్రి ప్రతి శివాలయంలోనూ ‘జ్వాలాతోరణం’ కార్యక్రమం నిర్వహిస్తారు.
క్షీరసాగరమధనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కార్తిక పున్నమిగా భావించి ఈ రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపం గా భావించి ఇల్లువాకిలినంతా దీపాలతో అలంకరించి లక్ష్మీపూజలు, ధాత్రీ పూజలు చేస్తారు.



Friday, 27 November 2015

KARTHIKAPOURNAMI SPECIAL PUJA INFORMATION - STEP BY STEP IN TELUGU


కోటీ కాంతుల కార్తీక పున్నమి

కార్తీక మాసమంతటికి పౌర్ణమి తలమానికం వంటిది. పూర్ణ చంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుని దర్శనం, పూజలు అత్యంత శుభఫలాలను వేగవంతంగా ఇస్తాయి. జన్మ జన్మల పాపములను పటాపంచలు చేసి మానవుడికి మోక్షమును ప్రసాదించే పవిత్రమైన కార్తీకమాసంలో అత్యంత పుణ్యప్రదమైన శివ, కేశవులిద్దరకూ ప్రీతికరమైన రోజు. కార్తీక పూర్ణిమనాడు స్నాన, దాన, దీప దాన, జ్వాలాతోరణోత్సవం, భక్తేశ్వర్రవతం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

ఈ దినం కార్తీక స్నానం ఆచ రించి శివకేశవులను పూజిం చడంతో పాటూ సాయంత్రం శివాలయాల్లో జరిగే జ్వాలాతోరణోత్సవంను దర్శించాలని శాస్త్రవచనం. కార్తీక పూర్ణిమనాటి సాయంత్రం శివాలయాల్లోని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తయిన కర్రలను నాటి మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా వుంటుంది. దీనికి - జ్వాలాతోరణం అనే పేరు.

జ్వాలాతోరణోత్సవం
శివపార్వతులను పల్లకీలో వుంచి ఈ జ్వాలాతోరణం క్రింద తిప్పుతారు. ఈ ఉత్సవానికే 'జ్వాలాతోరణోత్సవం' అని పేరు. కార్తీక పూర్ణిమనాడు శివాల యాల్లో జరిగే ఉత్సవాన్ని దర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు అంతరించి పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ కార్తీక పూర్ణిమ నాడు దీపదానోత్సవం చేయవలెను. కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో శివాలయంలోగాని, వైష్ణవాలయంలో గాని దీపాలు వెలిగించాలి. అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిధిలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగించాలనీ...అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలు హరింపబడి ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇతరులు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూడడం కూడా విశేష ఫలితాలనిస్తుంది. కాగా ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం ఉత్తమం. అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్పనూనెతో గాని వెలిగించవచ్చు. ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు. ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం. అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే!

దీపదానం: అన్ని దానాలు ఒక యెత్తు అయితే దీపదానం ఒక్కటీ ఒక యెత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో
కీటాః పతాంగా: మశకాశ్చవృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిః భవంతి నిత్యాంశ్చ పబాహి విప్రాః
అనే శ్లోకంను పఠించవలెను.

త్రిపురి పూర్ణిమ
కార్తీక పూర్ణిమకు త్రిపురి పూర్ణిమ అనే పేరు వుంది . రాక్షసులైన త్రిపురాసురులను శివుడు ఈ దినం సంహరించడం వల్ల దీనికి ఆ పేరు ఏర్పడినట్లు కథనం. తారకాసురుడికి తారాకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే కుమారులు వుండేవారు. తండ్రి మరణానంతరం దేవతలపైన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించి మరణం లేకుండా వరం పొందేందుకు బ్రహ్మ దేవుడిని గూర్చి తపస్సు చేశారు. వారి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమనగా - మా ముగ్గురికి స్వేచ్ఛగా సంచారం చేయగల బంగారు, వెండి, ఇనుముతో నిర్మింపబడిన పురములను ప్రసాదించండి. అంతే కాకుండా రథం కాని రథమును ఎక్కి విల్లు కాని విల్లు చేత బూని, నారి కాని నారిని తొడిగి బాణము కాని ఒకే బాణంతో కొట్టబడే వరకూ మాకు చావు లేకుండా వరం ప్రసాదించండి అని త్రిపురాసులు వరం కోరారు. సృష్ఠి కర్త బ్రహ్మదేవుడు వరం ప్రసాదించాడు.

వరగర్వంతో వారు పట్టణాలతో సంచరిస్తూ ఎక్కడ పడితే అక్కడ దిగి గ్రామాలు, పట్టణాలు, ప్రజలను భూస్థాపితం చేయసాగారు. దేవతలను కూడా కష్టాలపాలు చేయసాగారు. దీనితో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయం చెప్పగా విష్ణువు అందరినీ వెంట బెట్టుకుని కైలాసం చేరి శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను అంతమొందించేందుకు సిద్ధమయ్యడు. దేవతలందరూ శివుడికి సహకరించేందుకు సన్నద్ధులయ్యాయి. భూమి రథంగా మారింది. సూర్యచంద్రులు రథ చక్రాలు అయ్యాయి. నాలుగు వేదములు రథానికి గూర్రాలయ్యాయి. ఆ రథానికి బ్రహ్మదేవుడు రథసారథి అయ్యాడు. మేరు పర్వతం విల్లుగా మారింది. ఆదిశేషుడు అల్లెత్రాడు అయ్యాడు. శ్రీమహావిష్ణువు బాణం అయ్యాడు. దీనితో - శివుడు త్రిపురాసురులతో యుద్ధం చేసి ఒకే బాణంతో వారి మూడు పురాలతో పాటూ త్రిపురాసురులను అంతమొందించిన రోజు కార్తీక పూర్ణిమ. ఈ దినం శివుడిని ఆరాధించి, శివుడిని అభిషేకించి మారేడు దళములతోనూ, జిల్లేడు పూలతోనూ పూజించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి.

భక్తేశ్వర వ్రతం 
కార్తీక పూర్ణిమనాడు ఆచరించాల్సిన మరో విధి - భక్తేశ్వర వ్రతం. పూర్వం మధుర ప్రాంతరాజు అయిన చంద్రపాండ్యుడికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి, ప్రత్యక్షమై -మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు గల కుమారుడు కావలెనో? లేక సంపూర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాలో కోరుకోమన్నాడు. అందుకు - చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతులు కుమారుడినే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి పెరిగి పదహారు సంవత్సరాల వయస్సు వాడు అయ్యాడు. అయితే రాజదంపతులు కుమారుడిని మృత్యువు నుంచి కాపాడే మార్గం తెలియక చింతించసాగాడు. అనేక ఆలోచనలు చేసి మహాశివభక్తురాలిగా పేరుపొందిన అలకాపురి రాకుమార్తెను యిచ్చి వివాహం చేశారు. 

ఆమె భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకుని తన భర్తను కాపాడమని శివుడిని పూజించింది. వ్రతాలు చేసింది. చివరకు ఆయుష్షు ముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమె భర్తను కాపాడమని కోరుతూ శివుడి వ్రతం చేసింది. శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడాడు. భక్తురాలి కోరికను తీర్చి భక్తేశ్వరుడైన శివుడి ప్రీత్యర్థం కార్తీక పూర్ణిమనాడు చేసే వ్రతమే భక్తేశ్వర వ్రతం. కార్తీక పూర్ణిమనాడు పగలంతా ఉపవాసం వుండి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళములతో పూజించి శక్తిమేరకు నైవేద్యము సమర్పించ వలెను. ఈ విధంగా వ్రతం చేసినట్ల యితే వైధవ్య బాధలుండవు. మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది. ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే దివ్యమైన రోజు కార్తీక పూర్ణిమ.

కార్తీక పౌర్ణమి విశిష్టత 
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు.

Tuesday, 24 November 2015

KARTHIKA POURNAMI PUJA - TRADITIONAL IMPORTANCE ACCORDING HINDU PURANAS




Happy Karthika pournami 

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

విశిష్టత
కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి.
ఇందులో భాగంగా... మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది.
మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే......స్మిన్‌ సన్నిధింకురు||

KARTHIKA POURNAMI VISISTHATHA - TRADITIONAL IMPORTANCE OF KARTHIKA POURNAMI FESTIVAL IN INDIA


కార్తిక పౌర్ణమి విశిష్టత

పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసమంటారు. ఈ మాసం లో చేసే సమస్త పూజలు, జపాలు, దానాలు, తీర్థ యాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్యఫలితాలనిస్తాయి. ప్రత్యేకించి దీపారాధన సర్వ శ్రేష్ఠమైన విధుల్లో ఒకటి. జ్ఞానికి దీపం సంకేతం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి వివేకరూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం. దీపమున్న చోట జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయి. మన సంస్కృతి లో దీప రూపం లో భగవంతుడిని ఆరాదించడం అనాదిగా వస్తున్నది. చంద్రుడు మనసుకి ప్రతీక.పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీని వల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసం లో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా,గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగ గా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఈ విజయాన్ని సంస్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 వత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయం లో స్థంబదీపం పెట్టినవారు శ్రీమహవిష్ణువు కి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచాలవుతాయని విశ్వసిస్తారు. స్థంబ దీపం పెట్టని పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.

KARTHIKA POURNAMI FESTIVAL GREETINGS TO ALL


వెలుగు విభూతి రేఖలు ధరించి
తూరుపు సింధూరం కుంకుమ దిద్ది
తెల్లవారగ వచ్చింది నేటి ప్రభాతం!
దిక్కులలో ఢమరుక ధ్వనులు నిండగా..
పంచభూతాలు పంచాక్షరి వినిపిస్తుండగా..
పక్షులన్నీ నమక చమకములు వల్లిస్తుండగా..
శివమయమై ప్రకృతంతా పులకించెను!
నేటి కార్తిక పున్నమి కాంతులు
విశ్వనాథునికి పట్టే మంగళ హారతులు
తారలన్నీ కార్తీక దీపాలై వెలుగగా
జగమంతా శివ స్మరణతో పావనమయ్యెను!

కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు .

KARTHIKA POURNAMI ARTICLES IN TELUGU - INFORMATION AND STORY ABOUT BHAKTESWARA VRATHAM AND PUJA INFORMATION



కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
.
ఓం నమఃశివాయ

"బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం"

కార్తీక పూర్ణిమనాడు ఆచరించాల్సిన మరో విధి - "భక్తేశ్వర వ్రతం". 

పూర్వం మధుర ప్రాంతరాజు అయిన చంద్రపాండ్యుడికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి, ప్రత్యక్షమై -

"మీకు అతిమే
ధావి అయిన అల్పాయుష్షు గల కుమారుడు కావలెనో? లేక సంపుర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాల్నో కోరుకోమన్నాడు.

అందుకు - చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతులు కుమారుడినే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి పెరిగి పదహారు సంవత్సరాల వయస్సు వాడు అయ్యాడు. అయితే రాజదంపతులు కుమారుడిని మృత్యువు నుంచి కాపాడే మార్గం తెలియక చింతించసాగాడు. అనేక ఆలోచనలు చేసి మహాశివభక్తురాలిగా పేరుపొందిన అలకాపురి రాకుమార్తెను యిచ్చి వివాహం చేశారు. ఆమె భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకుని తన భర్తను కాపాడమని శివుడిని పూజించింది. వ్రతాలు చేసింది. చివరకు ఆయుష్షుముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమె భర్తను కాపాడమని కోరుతూ శివుడి వ్రతం చేసింది. శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడాడు. భక్తురాలి కోరికను తీర్చి భక్తేశ్వరుడైన శివుడి ప్రీత్యర్థం కార్తీక పూర్ణిమనాడు చేసే వ్రతమే "భక్తేశ్వర వ్రతం".

కార్తీక పూర్ణిమనాడు పగలంతా ఉపవాసం వుండి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళములతో పూజించి శక్తిమేరకు నైవేద్యము సమర్పించవలెను. ఈ విధంగా వ్రతం చేసినట్లయితే వైధవ్య బాధలుండవు. మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.

ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే దివ్యమైన రోజు "కార్తీక పూర్ణిమ"!