సంతానలేమికి ఆయుర్వేదమే .....
సరైన వైద్యం .....!
సంతాన ప్రాప్తితోనే దాంపత్య జీవితం ధన్యవుతుందన్నది స్త్రీ పురుషుల్లో అనాదిగా ఉన్న భావన. అయితే ఇటీవలి కాలంలో పలు కారణాల వల్ల ఎక్కువ మంది సంతాన లేమి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో పిల్లలు పుట్టక పోవటానికి తల్లిదండ్రుల యొక్క శుక్ర, శోణితాలు అందులోని దోషాలే ముఖ్య కారణాలని ఆయుర్వేద పండితులు ఎప్పుడో చెప్పారు. అయినా, సంతానలేమికి ఇప్పటికీ చాలామంది స్త్రీలలోనే లోపం ఉందని చెపుతుంటారు. కారణాలు ఏవైనా ఏడాది పాటు ఆయుర్వేద చికిత్స తీసుకోవటం ద్వారా సంతానలేమి సమస్యను పరిష్కరించవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ మనోహర్.
పెళ్లయి ఏళ్లు గడిచిపోతున్నా, సంతానమే కలగకపోతే దంపతులకు అది పెద్ద ఆందోళనకర విషయమే. ఆరోగ్యవంతులుగా కనిపించే దంపతులు కూడా చాలా మంది నే డు సంతాన లేమి సమస్యకు గురవుతున్నారు. అయితే చాలా మంది దంపతులు పెళ్లయి ఎంత కాలమయ్యిందని? నిదానంగా అవుతారులే అప్పుడే ఏం తొందర? అంటూ చాలా మంది దంపతులు కాలయాపన చేస్తారు. ఆరోగ్యవంతులైన దంపతులు ఏ విధమైన గర్భనిరోధక మాత్రలు లేకుండా ఏడాది నుంచి ఏడాదిన్నర సంవత్సరాల జీవితం గడపినా, పుల్లలు పుట్టకపోతే వారిని సంతానలేమిగా పరిగణించవచ్చు. వివాహం అయ్యాక 50 శాతం మంది స్త్రీలలో మొదటి మూడు నెలల్లో గర్భధారణ అవకాశాలు ఎక్కువ. 25 శాతం మందిలో ఆరు నెలల తర్వాత నెలతప్పే అవకాశం ఉంది. 10 నుంచి 15 శాతం మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
కారణాలు అనేకం
సంతాన కాంక్ష ఎంత బలంగా ఉన్నా కొందరికి ఆ కోరికే తీరదు. దానికి పలు కారణాలు కనిపిస్తాయి. రుతుచక్రంలో మార్పులు, కొన్ని రకాల వ్యాధుల వల్ల అండం సరిగా విడుదల కాకపోవడం, ఉదాహరణకు నీటిబుడగలు, అండాశయం చిన్నదిగా ఉండటం, గర్భాశయం నిర్మాణంలో, ఆకృతిలో పుట్టుకతో వచ్చే లోపాలు, యోని పూర్తిగా లేకపోవడం, యోని మార్గం మూసుకొని పోవటం లేదా చిన్నదిగా ఉండటం, గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం, లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఏర్పడిన ఇన్ఫెక్షన్‌లు, గర్భాశయంలో గడ్డలు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్‌ల వల్ల ట్యూబ్స్ మూసుకొని పోవటం, ట్యూబ్స్‌లో వాపు ఏర్పడటం లాంటివి సంతానలేమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో రుతు, క్షేత్ర, అంబు, బీజం...అలాగే వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలు ముఖ్యమైన అంశాలుగా తీసుకుంటారు.
గర్భ ధారణలో కీలకాంశాలు
రుతువు : అండాశయం నుంచి అండం విడుదల అయ్యేందుకు అనువైన కాలాన్ని రుతుకాలం అంటారు. దాన్నే ఆయుర్వేదంలో వావ్యులేషన్ పిరియడ్‌గా చెపుతారు. సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుంచి 16వ రోజు వరకు రుతుకాలంగా పరిగణిస్తాం. 12 నుంచి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడు అయినా అండం విడుదల కావచ్చు. ఆ సమయంలో అండాశయం నుంచి అండం సక్రమంగా విడుదల అవ్వాలి అంటే అండాశయానికి సంబంధించి ఏ వ్యాధి ఉండకూడదు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా రుతుకాలంగా పరిగణిస్తాం. (సాధారణంగా 21 నుంచి 35 సంవత్సరాల వరకు)
క్షేత్రం
క్షేత్రం అంటే భూమికి పర్యాయపదం. గర్భం ధరించటానికి స్త్రీకి గర్భాశయం, గర్భాశయ మార్గం, గర్భాశయ సంబంధిత భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. ఒక వేళ అండాశయం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా అండం విడుదల అయినప్పటికీ వీర్యం కణంలో కలిసి ఫలదీకరణం చెందిన తర్వాత గర్భాశయ గోడలను ఆధారంగా చేసుకొని పిండం ఎదగాల్సి ఉంటుంది. కావున గర్భాశయం శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని సార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్రకణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి.
అంబు : గర్భ పోషణకు ఉపయోగపడే పోషకాంశాలు, గర్భధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేద నిపుణులు వర్ణించారు. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి. చివరిగా ఏర్పడే శుక్రధాతువును స్త్రీలలో అండంగాను, పురుషుల్లో వీర్యంగాను పరిగణిస్తారు.
బీజం : ఆయుర్వేదంలో స్త్రీలలో అండాశయం నుంచి విడుదల అయ్యే అండాన్ని పురుషుల్లోని వీర్యాన్ని బీజం అనే పదంతో సూచిస్తారు. అండం పరిమాణం, శక్తి, శక్ర కణంలోని కదలగలిగే సామర్థ్యం, శుక్ర కణం నాణ్యతపై గర్భధారణ ఆధారపడి ఉంటుంది.
సంతానలేమికి ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేద శాస్త్రంలో త్రిదోషాల ప్రాధాన్యాన్ని బట్టి ఔషధ సేవన చేయాల్సి ఉంటుంది. ఇందులో రసాయనాలకు ప్రాధాన్యం ఉంది. ఈ రసాయనాలు స్త్రీ యొక్క జననేంద్రియాలకు సరైన పోషణను కలిగిస్తాయి. పంచకర్మలు ముఖ్యంగా స్నేహ, స్వేద, విరేచన, వస్తికర్మలు అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణితలు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోనిపిచు, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధయుక్త కషాయాలతో) లాంటి శాస్త్రీయ చికిత్స విధానాలు చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్యనిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.