WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Telugu Childrens Stories Collection. Show all posts
Showing posts with label Telugu Childrens Stories Collection. Show all posts

Friday, 9 September 2016

TELUGU MORAL STORY ABOUT A BIG TREE


గర్వం విష తుల్యం. !
.
పూర్వం ఒక అడవిలో ఒక నదీ తీరాన చాలా వృక్షాలు ఉండేవి. వాటన్నింటిలోకీ చాలా పొడవైనది బూరుగు చెట్టు. నదీ తీరంలో పచ్చని పచ్చిక ఉండేది. నీటి అలలు వచ్చినప్పుడల్లా ఆ గడ్డి పోచలు తలలు వంచి అవి పోయాక లేస్తుండేవి. ఒక రోజున వర్షం పడటంతో నదికి ప్రవాహ వేగం పెరిగింది. దాంతో గడ్డి పోచలు తలలు వంచి నీటి ప్రవాహం వాలుకు ఉండి పోవలసి వచ్చిం ది. సాయం కాలానికి నదీ ప్రవాహం తగ్గింది.అప్పుడు పచ్చిక మొక్కలు హాయిగా తల లెత్తి నవ్వు కుంటూ చుట్టూ చూడ సాగాయి.

నది గట్టు పక్కనే ఉన్న బూరుగు చెట్టు వాటి వైపు చూసి ఫక్కున నవ్వింది. ఆ సవ్వడికి గడ్డి మొక్క లన్నీ తలలు తిప్పి ఆ సవ్వడి వచ్చిన వైపు చూశాయి. వాటిని చూసి బూరుగు చెట్టు తిరిగి పక పకా నవ్వింది.

పక్కనే ఉన్న మిగిలిన చెట్లు దాని వైపు చూసి , "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అడిగాయి.

దాని కి బూరుగు చెట్టు " గమనిస్తే మీరంతా కూడా ఫక్కున నవ్వు తారు.చూడండీ ఉదయం నుండీ ఈ గడ్డి పోచలు నీళ్ళకు భయ పడి తలలు వంచుకుని ఉన్నాయి . ఇప్పుడు నీరు తగ్గాక తల లెత్తాయి. వాటిని చూస్తే నవ్వు కాక మరే మొస్తుందీ! పాపం చిరుప్రాణులు! వాటి భయం చూసి నాకు ఆగని నవ్వు వస్తున్నది " అంటూ ఇంకా నవ్వ సాగింది బూరుగు చెట్టు.

మిగతా చెట్లు " తప్పుకాదూ ? ఇతరులను చూసి అలా నవ్వడం ! అవి వింటే ఏమను కుంటాయి. చెట్ల జాతి మన మంతా ఒక్కటే కదా!"అన్నాయి.

"ఏంటీ! ఆ గడ్డి పోచలూ మనమూ ఒక్కటేనా! ఆ గడ్డి పోచలు మన జాతా? మాట్లాడకండి , నాకు అసహ్య మే స్తుంది." అంది ఠీవిగా తలెత్తి.

"గడ్డిపోచలూ మన జాతే ! పెద్ద చిన్న అంతే తేడా! మనలో వట వృక్షం ఎంత పెద్దదీ! మనం కేవలం చెట్లమే, వృక్షాలం కాదు కదా! అలాగే ఆ గడ్డి పోచలూనూ, ఎవరి గొ ప్పవారిదే!" అంది వేప చెట్టు.

" గడ్డిపోచలన్నీకలిసి ఏనుగునే కట్టేస్తాయి అనే విషయం నీవు విన్నట్లు లేదు." అంది రాగిచెట్టు.

"చాలించండి ! మీ మాటలు మన వృక్ష జాతికే అవమానం . పసి పిల్లలు వేలితో తుంపితే తెగే ఈ గడ్డి పోచలూ మనమూ ఒక జాతా!" అంటూ అట్ట హాసంగా అరిచింది బూరుగు చెట్టు.

ఇంతలో గాలి వీచడం మొదలైంది. రాను రానూ క్షణాల్లో గాలి వేగం హెచ్చింది. చూస్తుండ గానే తీవ్రమైన గాలి గా మారింది .ఆ గాలి తాకిడికి చెట్ల తలలన్నీ ఊగసాగాయి .ఆకులు తెగి పడ సాగా యి. రెమ్మలు విరగ సాగాయి , కొన్ని చెట్ల కొమ్మలు సైతం తెగి క్రింద పడ సాగాయి. ఉన్నట్లుండి బూరుగు చెట్టు మధ్యకు విరిగి పడి మొండెం మాత్రమే మిగిలింది. మరి కాస్సేపటికి గాలి తగ్గింది. చెట్లన్నీ తెప్పరిల్లి చూట్టూ చూశాయి. అన్నిచెట్లకూ కేవలం కొన్నికొమ్మలూ రెమ్మలూ మాత్రమే పోగా బూరుగు చెట్టు సగానికి తెగి ఉండటం చూసి , సానుభూతిగా పలక రించాయి.

"బూరుగు వృక్షమా! క్షేమమేకదా! " .బూరుగు విచారంగా ,బలహీన స్వరంతో , " గర్వించిన దాని ఫలితం వెంటనే తగిలింది. చిన్న తనంలో మా అమ్మ 'గర్వం తీయనైన విషం.ఎవ్వడూ దేనికీ గర్వించకు, పెద్ద వారి ముందు, మన కన్నాశక్తి వంతుల ముందూ తలవంచడం మంచిది. డాంబికం చేటు చేస్తుంది, గొప్పలకు పోకు, వినయంగాఉండు ' అని చెప్పింది, నేనే మీ అందరి కంటే ఎత్తుగా ఉన్నానని గర్వించి , మిమ్మూ , ఆ గడ్డి పోచ లనూ తక్కువ చేసి మాట్లాడాను. నేను మధ్యకు విరిగాను కానీ,ఆ గడ్డి పోచ ల లాగే తలలు ఊపు కుంటూ ఉన్నాయి.అంతా నన్ను , నా గర్వాన్నీ మన్నించండి." అంది.
మిగతా చెట్లన్నీ' మిత్రమా! తెలీక జరిగిన పొరపాటు మర్చిపో. పశ్చాత్తాపమే దానికి విరిగిడు. కొద్ది రోజు ల్లోనే తిరిగి చిగురిస్తావులే ,కొమ్మలు తొడుగు తావులే దిగులుపడకు.. బాధపడకు." అంటూ బుజ్జ గించాయి.

నదీ తీరం లోని గడ్డి పోచలు మాత్రం ఎప్పటిలా అలాగే హాయిగా నవ్వుకుంటూ, నీరు వచ్చినపు డు తల లు వంచు కుంటూ ,తర్వాత ఎత్తుకుంటూ ఉన్నాయి. వినయం విజయానికి చిహ్నం కాదూ!

Friday, 27 May 2016

GOD AND THE FARMER - MORAL MESSAGE TELUGU STORY


పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.
"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు.
భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.
తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.
రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.
"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"
భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.
అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.
జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

Monday, 25 April 2016

CHANDAMAMA STORY ABOUT POWER IN TELUGU


చందమామ కధ.!
.
పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.
ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.

ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా 

ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ అన్నాడు.అందుకు వాడు 

ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మరీ మొదులు పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి
యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.అప్పుడు రాజు అతనికి 

జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.

అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.

Friday, 18 December 2015

CHOTE KID LAVANYA AND SAVING THE PLANTS - CHANDAMAMA CHILD STORIES COLLECTION


గుండువారిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది లావణ్య. ఆదివారం బడికి సెలవు కదా, దాంతో తల్లిదండ్రులతో పాటు పొలం పనికి పోయింది.

అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. "నేను కూడా ఏదైనా పని చేయాలి" అనుకున్నది లావణ్య. అక్కడ ఉన్న రకరకాల పనిముట్లలో తనకు నచ్చింది ఏంటి అని చూసింది. ఓ గొడ్డలిని చేతపట్టుకున్నది. ఆ తుప్పనీ, ఈ కంప చెట్టునీ కొట్టుకుంటూ పోయింది.

అట్లా అట్లా పొలం చుట్టూ తిరిగింది; మరింత పనికోసం వెతికింది. చూస్తే పొలం ప్రక్కన ఖాళీ భూమిలో ఎత్తైన వేప చెట్టు ఒకటి కనిపించింది. ఆ చెట్టు మీద చాలా గిజిగాళ్ళు- అందంగా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి.

కొంచెం సేపు ఆ గూళ్లను అందుకునేందుకు ప్రయత్నించింది లావణ్య. అవేమో దట్టమైన కొమ్మల్లో‌ ఎత్తుగా వ్రేలాడుతున్నాయి. కొంచెంసేపు ప్రయత్నించాక లావణ్యకు అలుపు వచ్చింది; కోపం‌ కూడా వచ్చింది.

"చెట్టును కొట్టేస్తే ఇంక మీరు ఎక్కడుంటారే?!" అన్నది. వెంటనే చెట్టును కొట్టేసేందుకు పూనుకున్నది. అనుకున్నదే తడవు గొడ్డలికి పని పెట్టింది. అయితే చెట్టు చాలా గట్టిగానే ఉన్నది. కొంచెం సేపు కొట్టాక ఆ పాపకు అలుపు వచ్చింది. అంతలోనే వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడికొచ్చారు. ఈ పాప చేస్తున్న పనిని చూశారు.

"పాప బలే పని చేస్తున్నది" అన్నారు అమ్మతో పాటు వచ్చిన పనివాళ్ళు, ముచ్చట పడుతూ.

అమ్మ మాత్రం పాప దగ్గరికి వచ్చి "పచ్చని చెట్టు కదమ్మా! కొట్టేస్తే పాపం, దానికి నొప్పి పుడుతుంది కదా? చెట్టును అట్లా కొట్టకూడదు తల్లీ. రా, ఇంటికి పోదాం" అని పిల్చుకుపోయింది.

బాగా పని చేసి అలసిపోయిన లావణ్య ఆరోజు సాయంత్రం అంతా బావిలో స్నానం చేస్తూ గడిపింది.

మరుసటి రోజున పాఠశాలలో పర్యావరణ దినోత్సవం జరిగింది. జిల్లా విద్యాధికారిగారు బడికి ముఖ్య అతిథిగా వచ్చారు. స్టేజీ మీద చాలా మంది పర్యావరణం గురించి మాట్లాడారు: "చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా మనుషుల్లాగే, మిగిలిన ప్రాణుల్లాగే బాధపడతాయి; ఆనందపడతాయి" అని వాళ్ళు చెబితే, వింటున్న లావణ్య ఆశ్చర్యపడింది. "అమ్మ కూడా ఇట్లాగే చెప్పిందే!" అనుకున్నది.

"ఈ విషయాన్ని మన భారతీయ శాస్త్రవేత్త 'జగదీష్ చంద్రబోస్' కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న యంత్రం మొక్కల సంవేదనలను కొలిచి, ప్రపంచానికంతటికీ తెలియజేసింది" చెప్పారు సైన్సు అయ్యవారు.

ఈ మాటలు వింటుంటే తను కొట్టబోయిన వేప చెట్టు గుర్తుకొచ్చింది లావణ్యకు. చాలా సిగ్గు వేసింది. ఆ రోజున పాఠశాలలో చాలా చురుకుగా పని చేసింది ఆ పాప. ఇరవై చెట్ల కోసం గుంతలు త్రవ్వింది; ఇరవై మొక్కలు నాటింది! అన్నిటికీ నీళ్ళు తెచ్చి పోసింది!

సాయంత్రం ప్రధానోపాధ్యాయుడిని అడిగి ఒక మొక్కను ఇంటికి తీసుకుపోయింది. మరుసటి రోజు పొద్దున్నే పొలానికి పోయి, తను నరికేద్దామనుకున్న వేప చెట్టుకు దగ్గరగా ఈ మొక్కను నాటింది. పాదు చేసి, నీరు పోసింది.

కొన్నాళ్లకు సంతోషంతో ఆ మొక్క చిగుర్లు వేస్తే, దాని కోసమే రోజూ వెళ్ళి చూస్తున్న లావణ్య అంతకంటే ఎక్కువ సంతోషపడింది.


Wednesday, 16 December 2015

FISHERMEN AND THE GENIE - MORAL STORY FOR KIDS


సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపలకోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో రెండూ మూడు చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్‌మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి, దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొక్కటి ప్రత్యక్షం అయ్యింది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి..''కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరిని హడల కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్ర శక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతోకాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది'' అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది. ''నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయట పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా వుండాలంటే నువ్వు చావాలి'' అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి, జాలరి ధైర్యం తెచ్చుకొని ఒక్కక్షణం ఆగు. నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా?'' అన్నాడు. ''చివరి కోరికఏమిటోవెంటనే చెప్పు'' అంది భూతం కోపం గా.''నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా వున్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్ళావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని వుంది.చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం'' అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలాకాలం బంధింపబడి ఉండి, అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనా శక్తిని హరింప జేశాయి. ''అహ్హహ్హ అని పెద్దగా నవ్వుతూ మానవులకు అన్నీ సందేహాలే!'' అనుకొని ''చూడు మానవుడా..నేనెలా లోపలికి వెళ్ళానో..''అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది.వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు.

AKBAR AND DANGER IN GARDEN - AKBAR BIRBAL STORIES COLLECTION


అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, ''అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా?'' అన్నాడు. ''అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం'', అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప . అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. ''బీర్బల్‌, భూత లస్వర్గం అంటూఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. ''ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌. ''అంటే నువ్‌ నా అభిప్రాయంతో ఏకీభ వించడం లేదన్నమాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో. ''అందం ఉన్నచోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా'', అన్నాడు బీర్బల్‌. ''ప్రమాదమా! గులాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. ''ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు'', అన్నాడు బీర్బల్‌. మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. '' మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. '' మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు'' అన్నాడు అక్బర్‌. ''శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానే, అసూయ వల్లనో ఎలాగైనా పడగొ ట్టాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం'' అన్నాడు బీర్బల్‌.
ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, ''హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదుల నుద్దేశించి అడిగాడు. ''పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు. 'కత్తిపట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది', అన్నాడు బీర్బల్‌. దూరం నుంచే శత్రువుల మీదికి ప్రయోగించ వచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం?'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. ''ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌ ''ఫిరంగి''! అన్నాడు మరొక సభికుడు. '' దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు అక్బర్‌. ''ఖడ్గమూ కాదు. ఈటే కాదు,. ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏదీ బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. ''పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. ''ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా, ''సమయ స్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా సరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది ప్రభూ'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా. ''అసంబద్ధ!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవ్వుకున్నారు. ''సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, ''రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైపే వస్తున్నది. పారిపొండి''! అంటూ వాడు వెళ్లిపోయాడు. వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తిపిండి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదుపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు.
చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది. అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చేసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగువీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది.
ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందకి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంటబడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులవున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ''బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదుపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో.

Saturday, 12 December 2015

MONKEY INTELLIGENT


కోతి తెలివి

'జంతువులే కదా, వాటికేం తెలుసు' అనుకోకండి. ఈ కథలో కోతి సమయస్ఫూర్తితోటీ, మంచితనంతోటీ ఏమేం సాధించిందో చూడండి.. 

రచన: శ్రీరామనేని ఆర్య, 5వతరగతి, రిషివ్యాలీస్కూల్, మదనపల్లి, చిత్తూరు జిల్లా.

ఒక ఊరిలో చందు-బిందు అనే అన్నా చెల్లెళ్లు ఉండేవారు. చందు ఏడవతరగతి, బిందు నాలుగవ తరగతి చదువుతున్నారు.

ఒకరోజు ఇద్దరూ బడినుండి ఇంటికి వస్తుంటే, దారిలో ఓ చెట్టు కింద చిట్టి కోతి పిల్ల ఒకటి క్రింద పడి కనిపించింది. దానికి ఇంకా చెట్టుపైకి ఎక్కటం వస్తున్నట్లు లేదు. చందు బిందు ఇద్దరూ దాని తల్లి కోసం అటూ ఇటూ కలయ చూసారు- కానీ అది ఎక్కడా లేదు! కోతిపిల్లేమో ఆకలితో కిచకిచలాడుతోంది. "మనం దీనికి ఏమన్నా పెడదామా, తినేందుకు?" అడిగాడు చందు. "పెడదాం పెడదాం!" అని తన డబ్బాలో మిగిలిపోయిన

అరటిపండుని బయటకి తీసి, కోతికి పెట్టింది బిందు. కోతి దాన్ని తీసుకొని తిన్నది.

కొంచెంసేపు అట్లా నిలబడి దాన్ని చూసి, ఇంటికి బయలుదేరారు చందు-బిందు. కొంచెం సేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే కోతి వాళ్ళ వెంటే వస్తోంది!

"ఏయ్! వెనక్కి వెళ్ళు" అని ఎంత అరిచినా వింటేగా? ఆ కోతి వాళ్ళ వెనకాలనే ఇంటివరకూ వచ్చేసింది!

"అన్నయ్యా , మనం దీన్ని పెంచుకొందామా?" అన్నను అడిగింది బిందు.
"నాకూ ఇది చాలా నచ్చింది- కానీ అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో.. అడిగి చూద్దాం!" అన్నాడు చందు.

ఇద్దరూ సంతోషంగా కోతిని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళారు.
వాళ్ల చేతుల్లో ముడుచుకొని కూర్చున్న కోతిని చూడగానే అమ్మ ఒక్కసారి అదిరిపోయి "గయ్.."మని అరిచింది- "ఏయ్..ఏంటి, ఈ కోతిని నేరుగా ఇంట్లోకే తీసుకొచ్చారు? ఛీ..ఛీ.. ఇది చాలా మురికిగా ఉంది! బయట వదిలెయ్యండి!" అరిచింది అమ్మ.

"వద్దమ్మా, ప్లీజ్! ఈ కోతిపిల్ల చాలా బాగుంది.. ప్లీజ్! దీన్ని మనం పెంచుకుందాం!" అని పిల్లలిద్దరూ అమ్మను బ్రతిమాలారు.

చాలా సేపు వద్దన్నాక, చివరికి అమ్మ ఒప్పుకున్నది- "సరే కానివ్వండి.. కానీ ఇది ఇంట్లో ఉన్న వస్తువులు వేటినీ పాడు చేయకుండా మీరే చూసుకోవాలి. పనులు ఎక్కువౌతాయి.. దాని పనులన్నీ మీరే చేయాలి మరి!" అన్నది అమ్మ.

'ఒప్పుకున్నది- అంతే చాలు' అనుకొని,"సరే" అని ఎగిరి గంతేశారు ఇద్దరూ.

"ఆగండాగండి! ఇప్పుడంటే ఇది చిన్నగా ఉంది. పెద్దదయ్యాక దీన్ని భరించటం నా వల్ల కాదు. అప్పుడింక మీరు దీన్ని అడవిలో వదిలేయాలి..

అందుకు ఒప్పుకుంటేనే, మరి- చెప్పండి!" అంది అమ్మ.

"ఊఁ అట్లా ఏం వద్దు.." అన్నారు పిల్లలు. కానీ అమ్మ ఏమాత్రం తగ్గలేదు. చివరికి పిల్లలే దిగి వచ్చారు. "సరే" అని ఒప్పుకున్నారు. కొంచెం దిగులుగానే తలలు ఊపి, కోతిని ఎత్తుకొని తమ గదిలోకి తీసుకువెళ్ళారు. తన బట్టల బుట్టలో గబగబా ఒక పాత దుప్పటిని పరిచాడు చందు. కోతిని తీసుకెళ్ళి దానిలో పెట్టింది బిందు. పిల్లలిద్దరూ బడి బట్టలు మార్చుకొన్నాక, ఇక దానితో ఆటలు మొదలు పెట్టారు. రోజూ నిద్రలేవగానే వాళ్ళు పాలు తాగేవాళ్ళు. ఇప్పుడు తాము తాగేవి, తినేవన్నీ కోతికి కూడా ఇవ్వటం మొదలుపెట్టారు.

ఇలా రెండుసంవత్సరాలు గడిచాయి. పిల్లలిద్దరికీ కోతి చాలా మంచి ఫ్రెండు అయ్యింది. వాళ్లతోబాటే అది బడివరకూ వచ్చేది. వాళ్ళు బడిలోకి వెళ్ళగానే తను ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయేది.

అంతలోనే అమ్మ గుర్తుచేసింది: "కోతి చాలా పెద్దది అయింది. ఇప్పుడింక మీరిచ్చిన మాట ప్రకారం దీన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి" అంది. పిల్లలిద్దరికీ ఇప్పుడు బడిలో పాఠాల ఒత్తిడి ఎక్కువగానే ఉంది.. కోతితో ఆడేందుకు సమయమే దొరకటం లేదు.. కోతిని అడవిలో వదలటం వాళ్లకు ఇష్టం లేదు.. "అయినా ఇచ్చిన మాట ప్రకారం నడచుకోవాల్సిందే కదా?" అని ఇద్దరూ బాధ పడుతూనే దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చారు.

అడవిలో తిరుగుతూ కొన్నాళ్ళు కోతి ఒంటరిగానే ఉంది. ఒక్కోసారి దానికి చందు-బిందుల దగ్గరికి వెళ్ళిపోదామనిపించింది కూడా. అయితే కొన్నాళ్లకు దానికి ఒక ఏనుగుతో స్నేహం కుదిరింది. "ఇన్ని రోజులూ నువ్వు మనుషుల దగ్గరే ఉన్నావు. నిజానికి ఆ మనుషుల వల్లనే మన అడవి జంతువులకు ప్రమాదం! కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి!" అని దానికి చెబుతుండేది ఏనుగు. మెల్లగా కోతి అడవి జీవితానికి అలవాటు పడింది.

ఒకరోజు ఏనుగు భయపడినట్లే అయ్యింది. కొందరు మనుషులు చిన్న అడవి జంతువుల్ని పట్టుకునేందుకు ఉరులు తగిలించి పెట్టారు అడవిలో. ఎప్పటిలాగానే గంతులు వేస్తూ పోతున్న కోతి అనుకోకుండా ఒక ఉరిలో ఇరుక్కుపోయింది. పాపం, దానికి ప్రాణాలు పోయినంత పనైంది. అయితే సమయానికి దగ్గర్లోనే ఉన్న ఏనుగు గబుక్కున తన తొండాన్ని ఆ ఉరిలోకి దూర్చింది. కోతి ప్రాణాలు దక్కాయి. ఆ తర్వాత ఏనుగు ఆ ఉరిని బలంగా నేలకు కొట్టి తొండాన్ని బయటికి లాక్కున్నది. "చూశావా, ఈ మనుషులు? వీళ్ళే, అడవి జంతువులకు ప్రధాన శత్రువులు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పానుగా, నేను?" అని మందలించింది ఏనుగు. ఆనాటినుండి కోతికి అడవి జంతువుల కష్టాలు ఒక్కటొక్కటే అర్థం అవ్వసాగాయి.

అయితే ఈసారి ప్రమాదం ఏనుగుకి ఎదురైంది. వేటగాళ్ళు ఏనుగుల్ని పట్టుకోవటం కోసం త్రవ్విన గోతిలో పడిందది! అది చూసి కోతి చాలా కంగారు పడిపోయింది. దానికి ఏనుగుని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. తనేమో చిన్నదాయె! ఏనుగును ఎలా, పైకి లాగటం? ఆ సమయంలో దానికి చందు-బిందులు గుర్తుకు వచ్చారు. "ఎలాగైనా చందు-బిందులకు ఈ సంగతి తెలియజేస్తే చాలు- వాళ్ళు ఏనుగును కాపాడగలరు" అనుకుంటూ అది చందు-బిందుల ఇంటికి పరుగు పెట్టింది. నిద్రపోతున్న చందుని లేపింది, కిటికీలోంచి. మేలుకొన్న చందూ కోతిని చూసాడు- బిందుని నిద్ర లేపాడు. చూస్తే కోతి కిచకిచలాడుతున్నది; చేతులు ఊపుతున్నది; లోపలికి రమ్మంటే రావటం లేదు. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించారు పిల్లలిద్దరూ. ఏమైందోనని ఇద్దరూ దానివెంట అడవికి వెళ్ళి చూశారు. అక్కడ గుంటలో పడి అరుస్తున్న ఏనుగుని చూశాక వాళ్లకు సంగతి అర్థమైంది . 'మరి ఇప్పుడు ఏం చేయాలి?' -వెంటనే వాళ్ళిద్దరూ ఇంటికి పరుగెత్తి, అమ్మా-నాన్నలకు విషయం చెప్పారు.

చందువాళ్ల నాన్న పోలీసులకీ, అటవీశాఖాధికారికీ ఫోన్ చేసి, అడవిలో ప్రమాదంలోఉన్న ఏనుగు సంగతి తెలియజేశాడు. చందు-బిందులు దారి చూపారు కదా, కొద్ది గంటల్లోనే పోలీసులు, అటవీ శాఖ వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ముందుగా వాళ్లంతా కాపువేసి వేటగాళ్ళను పట్టుకున్నారు. అడవి జంతువులను పట్టుకోవటం, వేటాడటం నేరం కదా, అట్లా వాళ్లందరికీ తగిన శిక్షలు పడ్డాయి.

అటవీశాఖ వాళ్ళు గుంతలోంచి ఏనుగును బయటికి తీసి, అడవిలోకి వదిలేసారు. కోతి సంతోషానికి మేరలేదు. అది ఒకసారి ఏనుగు చుట్టూ, ఒకసారి ఇందు-బిందుల చుట్టూ తిరిగి మురిసిపోయింది!

అదంతా చూసిన చందు-బిందుల అమ్మకి కోతి తెలివి తేటల మీద నమ్మకం కుదిరింది. 'దీన్ని తమతో పాటు ఉంచుకుంటే నష్టం ఏమీ లేదు' అని కూడా అర్థమైంది. "సరే, కోతిని మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్దామా?" అంది.

కానీ కోతి ఇప్పుడు ఎక్కువ సేపు అడవిలోనే ఏనుగుతో గడుపుతున్నది. అప్పుడప్పుడూ, సెలవురోజుల్లో మాత్రం చందు-బిందులను చూడడానికి వస్తోంది.

Wednesday, 9 December 2015

CHANDAMAMA TELUGU STORIES - GOOD CHARACTER OF RAMAYYA



మంచితనాన్ని మించిన చదువు లేదు.

రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకొనేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు; అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవాళ్ళు. రామయ్య తనవంతుగా అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు.

రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశ భట్టు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆటపట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య, ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి, కారణం అడిగాడు. "నేను చదువుకోను సార్!" అన్నాడు తప్పిస్తే, సిద్ధయ్య భట్టుపై ఎలాంటి ఫిర్యాదూ చెయ్యలేదు.

ఇక చేసేదేమీ లేక, సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్ళేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో "నీకు చదువు రాలేదని బాధ పడకు. చదువు రాకున్నా పరవాలేదు-చదివే వాళ్ళను గౌరవించు. నీ‌ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో" అని చెప్పాడు.

ఇంటికి వెళ్ళిన తర్వాత, సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో‌ మెళకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నిటినీ తన పొలంలో అమలుపరచి, బంగారం‌ పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకొని, ఊళ్ళో వాళ్లందరిచేతా 'శభాష్' అనిపించుకున్నాడు. చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రతించేవాళ్ళు.

ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో‌ ప్రవచనాలు ఇస్తున్నాడనీ, చక్కగా మాట్లాడతాడనీ విని, సిద్ధయ్య వెళ్ళి, ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్ళేసరికి, ఆయన వేరెవరో కాదు- చిన్ననాడు బడిలో‌తనని ఆట పట్టించిన గణేశభట్టు! సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి, భట్టుకు ఆశ్చర్యం వేసింది. ఊళ్ళోవాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకు తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది.

"నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్నీ‌ , నీలో ఉన్న మంచితనాన్నీ గమనించని నన్ను క్షమించు సిద్ధయ్యా!" అన్నాడు అతను నీళ్ళు నిండిన కళ్ళతో.

"అలా అనకు మిత్రమా, పాండిత్యం‌ పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం, కాదూ?" అన్నాడు సిద్ధయ్య, అణకువతో.

Wednesday, 2 December 2015

CHANDAMAMA STORIES - ATMA KATHA


ఒక వ్యక్తికి నలుగురు భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి...
ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా
చూసుకునేవాడు...

మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి
మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.......

రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే
వెళ్ళేవాడు...ఆమెకూడా
అతని సమస్యను తీర్చి పంపేది.....

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే
ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే
వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు
గడిచిపోయాయి.

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను
బ్రతకను అని తెలిసిపోయి తనమీద
ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన
నాలుగవ భార్యను పిలిచాడు.

" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను
చాలా ప్రేమగా \చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్....
మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు.
నాలగవ భార్య అది విని అతనికి దూరంగా
జరిగిపోయింది,

ఆశ్చర్య చకితుడై
తన మూడవ భార్యను ఇదే కోరాడు........
మూడవ భార్య ఇలా అంది.
" ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే
ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి
వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే
అడిగాడు...... " నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపోతాను.....నిన్ను
అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా
అనేసరికి ఇక మొదటి భార్యను
బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా
అని భావిస్తుండగా.......

మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.

" మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను
మాత్రం మీ వెంట మీ చివరి పయనం
దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి "
అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే
ఉంది.....

కాబట్టి మనిషి దేన్నీ.....
ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన
దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.........పోయే ముందు తెలుసుకుని
ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు
భార్యల్తోనే ఉంటున్నాము.
అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా
ఉందా???????

నాలుగవ భార్య......... మన శరీరం......

మూడవ భార్య ...............సంపద,
ఆస్థిపాస్తులు......

రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు.......

మొదటి భార్య..............మన ఆత్మ..........

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని
ఆచరించండి....
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి.

Monday, 22 September 2014

STORY OF A TIGER FOX AND THE KING FROG IN TELUGU FOR KIDS


పులి-కప్ప 


ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది.

ఇక ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో, "ఒరే కుర్రవాడా! సంస్కారం ఉందా, నీకేమయినా? దున్నపోతులా ఉన్నావు! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!" అని అరిచింది.
ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. "అడవి రాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా" అంటూ గాండ్రించింది.
కప్ప గర్వంగా తల పైకెత్తి "నువ్వు నన్ను తినలేవు. నేను కప్పల రాజును. నీకంటే తెలివైన వాడిని!" అంటూ బెకబెకలాడింది.

"నిరూపించు చూద్దాం!" అంది పులి.

"అయితే, దుమకడంలో, తినటంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా" అన్నది కప్ప.
`సరే'నంది పులి.

ఇక దూకే పందెం మొదలయింది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది. అవతలి గట్టును దాటి మూడు మీటర్లు దూకిందది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే ఒక మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది! అయితే అది పులి తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియలేదు.
ఇక కప్ప విజయ గర్వంతో "నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను. మరి నువ్వేమి తిన్నావు?" అని అడిగింది.

ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు.

పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది.

పులి కొంచెం సేపు ఆలోచించి, ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలికి దూకి, ఆపకుండా అడవిలోకి పరుగుతీసింది. చాలా సేపు పరుగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురయింది.

రొప్పుతూ, భయపడుతూ ఉన్న పులిని చూసి, నక్క "సంగతేంటి పులిమామా?" అని అడిగింది.
జరిగినదంతా నక్కకు వివరించింది పులి.

"ఒక్క పూటకు రెండు పులులను తినే కప్ప ఎక్కడా ఉండద"ని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే తనవెంట కప్ప దగ్గరకు రమ్మని, అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా.

నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకుగాను, ఇద్దరి తోకల్నీ కలిపి కట్టేసుకునే షరతుమీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి.

ఇక రెండూ తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకొని, ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి " ఓ! తెలివైన నక్కా! నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను" అన్నది గట్టిగా.

ఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలెట్టింది. నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరుగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్లంతా హూనమయిపోయి, శరీరమంతా రక్తమోడుతూ ఉండింది. చాలా ఎముకలు విరిగిపోయాయి పాపం.

అప్పుడుగానీ తోక ముడిని విప్పలేదు పులి! విప్పి, అయాసపడుతూ, అది నక్కతో "ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు" అని చెప్తూ, అయినా కోపం ఆగక దాని చెంప ఛెళ్ళుమనిపించింది! ...

Tuesday, 29 July 2014

TELUGU CHILDREN'S STORY - HARIKATHA



హరికథ చేసిన మేలు

ఒక ఊరిలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. 

ఒకసారి వాళ్ళఊరి గుడిలో హరికథ చెబుతున్నారు.

ఆ సంగతి తెలుసుకొన్న రామయ్య, ఆ రాత్రికి గొర్రెల మందలోకి పనివాణ్ణి పంపి, తను హరికథ వినడానికి వెళ్ళాడు.


వెళ్ళేటప్పుడు, అతని భార్య అతనికి కొన్ని పప్పులు(పుట్నాలు) ఇచ్చి పంపింది. 

అయితే గొర్రెల్లో ఉండీ ఉండీ నోరాగకుండా తినటం అలవాటైంది రామయ్యకు. 
భార్య ఇచ్చిన పప్పులు కాసిన్నీ హరికథ చెప్పేచోటికి వెళ్ళేలోపే తినేసాడు అతను. 
తీరా గుడిని చేరుకొని చూస్తే, హరి కథ చెప్పే దాసుగారు ఇంకా రాలేదు. 
నోరాగని రామయ్య ఇక ఆగలేకపోయాడు. పప్పులకోసం తిరిగి ఇంటికి వెళ్లాడు. 
భార్య ఇంట్లో ఉన్న పప్పులన్నింటినీ బట్టలో కట్టి ఇచ్చింది రామయ్యకు. 
ఇక అతను సంతోషంగా వాటిని తినుకుంటూ హరికథకు వెళ్ళాడు. హరికథ మొదలయింది.


దాసుగారు "ఆఁ, అందరూ వచ్చారా? 
ఆఁ, అందరూ కూర్చోండి! సరే!! 

అయితే ఇక మొదలు పెడదామా?" అని అంటూండే లోపే, కడుపునిండా తిన్న రామయ్య నిద్రలోకి జారుకున్నాడు. హరికథంతా అయిపోయేసరికి అర్థ రాత్రయింది. అందరూ ఇళ్లకు వెళ్తుండగా మేలుకున్న రామయ్య, " ఆఁ, అందరూ వెళుతున్నారా?" అని హరికథ చెప్పే దాసుగారు అనటం మాత్రం విన్నాడు. ఇక తనూ లేచి, అందరితోపాటూ తీరికగా ఇంటికి చేరుకున్నాడు.


అప్పటికి సమయం ఒంటిగంటయ్యింది. సరిగ్గా అదే సమయానికి కొందరు దొంగలు రామయ్య ఇంటికి దొంగతనానికని వచ్చి ఉన్నారు.

ఇంటికెళ్ళిన రామయ్యను, హరి కథలో ఏమి చెప్పారని అడిగింది భార్య. అడగ్గానే, 
" ఆఁ, అందరూ వచ్చారా?" అనిగట్టిగా అన్నాడు రామయ్య.


అది విన్న పెరట్లోని దొంగలు తామొచ్చింది ఇంటిలోనివారికి తెలిసిపోయిందనుకొని, పొదలమాటున నక్కి కూర్చున్నారు.

ఈ సారి రామయ్య, " ఆఁ! అందరూ కూ
ర్చున్నారా?" అన్నాడు. తామొచ్చింది ఇంట్లోని వారికి ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్నారు బయటున్న దొంగలు!. 

ఈసారి రామయ్య "సరే! అయితే మొదలుపెడదామా! " అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇంట్లోని వారందరూ వస్తున్నట్టున్నారని దొంగలంతా పారిపోతుండగా, "ఆఁ! అందరూ వెళ్ళిపోతున్నారా?" అన్నాడు రామయ్య, దాసుగారు అన్నట్లుగా. దాంతో దొంగలు హడావిడిగా కాలికి బుద్ధి చెప్పారు. హరికథను వినకుండానే రామయ్యకు అంతమేలు జరిగింది,

Friday, 18 July 2014

COMPETITION BETWEEN A CROW AND THE SWAN - TELUGU MORAL CHILDRENS STORIES COLLECTION



కాకి - హంస

పూర్వం ఒకానోక రాజ్యాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక వర్తకుండేవాడు. భాగ్యవంతుడు.మంచివాడు. ఒక రోజు అతనొక కాకిని చేరదీసి రోజు దానికి ఎంగిలి మెతుకులు వేసి పెంచారు.అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది.

ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు. ఆ హంసల కంటే ఎత్తుగా ఎగరగలవా? "అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి."మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరితూగగలిగే కాకులు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నావా . చూసావా??" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం నాకు చేతనవును. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనలు వెళతాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం " అంది కాకి. "ఆ గతులు, గమనాలు మాకు తెలీదు.మామూలుగా సముద్రం మీద ఎగురుదాం. మేమంతా వద్దు కాని మాలో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

ఒక హంస, కాకి రెండూ సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి మాత్రం విన్యాసాలు చేయసాగింది.హంసను దాటిపోయి వెనక్కి తిరిగి హంసను వెక్కిరించడం,ముక్కు మీద ముక్కు పెట్టడం, జుట్టు రేపుకుని, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులు చేసింది. హంస అవన్ని పట్టించుకోక ఊరకుంది. కాసేపటికి కాకి అలిసిపోఉయింది. హంస పొడుగ్గా ఎగిసి పడమరకు పరుగెత్తింది. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమోహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. "అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి కాసేపు ఆగుదామంటే పర్వతాలు, చెట్లు కూడా లేవు. ఈ సముద్రంలో పడితే మరణమే గతి" అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది.

అది చూసి "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేసావు. ఒక్కటీ చూపవేమి వాయసరాజమా?" అంది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా ఉంది. "ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నూ మిన్నూ గానక నాకెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతులనయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నాయందు దయ చూపి నను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది."ఇంకెప్పుడు గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస.
కాకి లెంపలేసుకుంది.

Wednesday, 29 January 2014

GENIE AND THE FISHERMEN - TELUGU COMICS STORY



సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపలకోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో రెండూ మూడు చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్‌మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి, దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొక్కటి ప్రత్యక్షం అయ్యింది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి..''కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరిని హడల కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్ర శక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతోకాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది'' అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది. ''నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయట పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా వుండాలంటే నువ్వు చావాలి'' అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి, జాలరి ధైర్యం తెచ్చుకొని ఒక్కక్షణం ఆగు. నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా?'' అన్నాడు. ''చివరి కోరికఏమిటోవెంటనే చెప్పు'' అంది భూతం కోపం గా.''నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా వున్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్ళావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని వుంది.చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం'' అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలాకాలం బంధింపబడి ఉండి, అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనా శక్తిని హరింప జేశాయి. ''అహ్హహ్హ అని పెద్దగా నవ్వుతూ మానవులకు అన్నీ సందేహాలే!'' అనుకొని ''చూడు మానవుడా..నేనెలా లోపలికి వెళ్ళానో..''అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది.వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు.

Wednesday, 11 December 2013

MOSQUITO LOOSER - CHIDRENS MORAL STORY



అదొక దోమ,దానికి ఎంత గర్వమో చెప్పటానికి వీలులేదు. అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఒక రోజు అది అడవికి వెళ్ళింది. ఆ అడవిలో ఒక గుర్రం మేతమేస్తూ నిలబడి వుంది. దానికి ఎదురుగా వెళ్ళింది దోమ.
''ఏరు ! ఏం చేస్తున్నా విక్కడ'' అంది దోమ. దోమ మర్యాద లేకుండా మాట్లాడటం చూసి గుర్రం కోపంగా చూసి ఊరుకుంది.
''ఏం- మాట్లాడవేం'' రెచ్చగొడుతూ అడిగింది దోమ.
అయినా గుర్రం'' మాటాడలేదు. నేను తలచుకుంటే నా మిత్రులతో వచ్చి నిన్ను పడెయ్యగలను'' అంది దోమ.
నువ్వు చేసినపుడు చూస్తాలే'' అంది గుర్రం తాపీగా,
గుర్రానికి తనంటే లక్ష్యం లేక పోవడం చూసి దోమకు కోపం వచ్చింది. వెంటనే తన మిత్రులయిన దోమల్ని తీసుకువచ్చింది. ''గుర్రాన్ని కుట్టండి'' అంది. దోమలు గుర్రం మీద ఒక పక్కన వాలాయి. పొగరుబోతు దోమ చూస్తూ అవతల ఉంది. వాటిని తోకతో పారద్రోలాలను కుంది. గుర్రం వీలుపడలేదు. బాధ ఎక్కువైంది.
ఇంక చేసేదిలేక గుర్రం దబ్బున బురదగుంటలో పడింది. దాని వీపు మీదున్న దోమలన్నీ నలిగి చచ్చిపోయాయి.
''చూశావా, నిన్ను పడేశాను'' అంది గర్వంగా.
''నీ బొంద'' నేను పడినందువల్ల నాకు వచ్చిన నష్టం లేదు. కానీ ఏ కారణం లేకుండా నీ మిత్రులు ఇంతమందిని పోగొట్టుకున్నందుకు నువ్వే ఏడవాలి'' అంది గుర్రం, అప్పటికిగాని దోమకి తనెంత నష్టపోయిందీ అర్థం కాలేదు. గర్వంతో మిడిసిపడినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తెలుసుకుని తన హద్దుల్లో తాను ఉండసాగింది.

WHERE IS THE BOSS ? AKBAR BIRBAL STORIES COLLECTION




అక్బర్‌ చక్రవర్తి కొలువుకు రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారంతా రకరకాల సమస్యలతో వస్తుం టారు. అందులో కొన్ని జటిలంగా ఉంటే, కొన్ని సరదాకా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా బీర్బల్‌ సమయస్పూర్తితో చాలా తేలికగా పరిష్కరిం చేవాడు. ఒకసారి పొరుగుదేశం నుండి ఇద్దరు వ్యక్తులు అక్బర్‌ కొలువుకు వచ్చారు. వారిద్దరూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉన్నారు.'' అక్బర్‌ పాదుషా వారికి వందనాలు. ప్రభూ! నా పేరు చిత్రసేనుడు. ఇతడు సుగ్రీవుడు మా పనివాడు'' అని చెప్పాడు ఒక వ్యక్తి.వెంటనే రెండోవ్యక్తి 'అబద్ధం నేను ఇతని పనివాణ్ని కాదు. ఇతనే నా పనివాడు' అన్నాడు. ''ఇంతకూ ఎవరు పనివారు? ఎవరు యజమాని? ''అయోమయంగా అడిగాడు అక్బర్‌. నేను యజమాని నంటే నేను యజమానినని -నువ్వు పనివాడివంటే నువ్వు పని వాడివని వారిద్దరూ వాదించుకోసాగారు. అక్బర్‌కు, అక్కడి సభలోని వారికి ఎవరు నిజం చెప్తున్నారో అర్ధం కాలేదు. చివరకు అక్బర్‌ బీర్బల్‌ సహాయాన్ని అర్థించాడు.''బీర్బల్‌! వీళ్ళద్దిరిలో పనివా డెవరో చెప్పగలవా? అని అడిగాడు అక్బర్‌. అంతవరకు జరుగుతున్న తంతును చిరునవ్వుతో చూస్తున్న బీర్బల్‌, ''తప్పకుండా ప్రభూ !నేను తేలికగా పనివాడిని గుర్తించగలను'' అన్నాడు. బీర్బల్‌ ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి కాసేపు వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు నటించి, ''మీరిద్దరు నేలమీద బోర్లా పడు కోండి ''అన్నాడు. బీర్బల్‌ సూచిం చిన ట్టు చిత్రసేనుడు. సుగ్రీవుడు నేలమీద పడుకు న్నారు.. అక్బర్‌తో సహా సభికు లందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొద్దిక్ష ణాలు గడిచాయి. బోర్లా పడుకున్న వ్యక్తు లకు ఏం జరుగుతుందో తెలియ ట్లేదు. ఇంతలో బీర్బల్‌ గట్టిగా ''భటులారా! వీడే పనివాడు . వెంటనే అతని తలను నరకండి'' అనడం వినిపించింది. అది విని చిత్రసేనుడనే వ్యక్తి పైకి లేచాడు'' ప్రభూ! నేను పని వాడిని . నన్ను చంపకండి.'' అంటూ కంగారుగా చుట్టూ చూశాడు. అక్కడ భటులు కనిపించలేదు. నవ్వు తూ నిలబడ్డ బీర్బల్‌ కనిపించాడు. ''వాV్‌ా బీర్బల్‌! నీ తెలివి అమోఘం. శభాష్‌!'' అంటూ అక్బర్‌ అభినందనగా చప్పట్లు చరిచాడు. మరుక్షణం అక్బర్‌ కొలువంతా చప్పట్లతో మారుమ్రోగింది. 

Monday, 9 December 2013

COMMON SENSE IS THE BEST WEAPON - CHILDRENS STORIES IN TELUGU



అక్బర్‌ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్థుడై, ''అహా! భూతలస్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా?'' అన్నాడు. ''అవును, ప్రభూ! మీరన్నది అక్షర సత్యం'', అన్నారు వెనక నడుస్తూన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్‌ తప్ప . అక్బర్‌ బీర్బల్‌ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదేపనిగా వెతుకుతూ కనిపించాడు. ''బీర్బల్‌, భూత లస్వర్గం అంటూఉంటే అది ఇదేనని నేను అన్నాను. దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి,'' అన్నాడు అక్బర్‌. ''ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది. అందులో సందేహం లేదు. అయినా,'' అంటూ ఆగాడు బీర్బల్‌. ''అంటే నువ్‌ నా అభిప్రాయంతో ఏకీభ వించడం లేదన్నమాట! అయినా, ఏమిటి అయినా...'' అన్నాడు అక్బర్‌ తీవ్రస్వరంతో. ''అందం ఉన్నచోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా'', అన్నాడు బీర్బల్‌. ''ప్రమాదమా! గులాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. ''ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచాలు. నేను వాటిని గురించి చెప్పడం లేదు'', అన్నాడు బీర్బల్‌. మరి గడ్డిలో దాగి వుండే పాముల గురించి చెబుతున్నావా?'' అని అడిగాడు అక్బర్‌. '' మనుషుల అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి. ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి,'' అన్నాడు బీర్బల్‌. '' మరి ప్రమాదం దేనివల్లో కాస్త స్పష్టంగా చెప్పు'' అన్నాడు అక్బర్‌. ''శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయడానికి కాచుకుని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానే, అసూయ వల్లనో ఎలాగైనా పడగొ ట్టాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం'' అన్నాడు బీర్బల్‌.
ఆ మాటతో అక్బర్‌ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బర్‌, ''హఠాత్తుగా ఆపద ముంచుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది?'' అని సభాసదుల నుద్దేశించి అడిగాడు. ''పదునైన ఖడ్గం,'' అన్నాడు ఒక సభికుడు. 'కత్తిపట్టిన వాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది', అన్నాడు బీర్బల్‌. దూరం నుంచే శత్రువుల మీదికి ప్రయోగించ వచ్చుగనక, ఈటె ఉత్తమమైన ఆయుధం?'' అన్నాడు ఇంకొక ముఖ్యుడు. ''ఈటె తన మీదికి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా?'' అన్నాడు బీర్బల్‌ ''ఫిరంగి''! అన్నాడు మరొక సభికుడు. '' దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగని వెతుక్కోవడం సులభం కాదు కదా?'' అన్నాడు అక్బర్‌. ''ఖడ్గమూ కాదు. ఈటే కాదు,. ఫిరంగీ కాదు. మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏదీ బీర్బల్‌?'' అని అడిగాడు అక్బర్‌. ''పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం!'' అన్నాడు బీర్బల్‌. ''ఫలానా ఆయుధం అని చెప్పలేవు, అంతే కదా?'' అన్నాడు బీర్బల్‌ కాస్త కటువుగా, ''సమయ స్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా సరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది ప్రభూ'' అన్నాడు బీర్బల్‌ నెమ్మదిగా. ''అసంబద్ధ!'' అన్నాడు అక్బర్‌ ఆగ్రహంతో. సభికులు లోలోపల నవ్వుకున్నారు. ''సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభూ!'' అన్నాడు బీర్బల్‌ వినయంగా. మరునాడు ఉదయం అక్బర్‌ చక్రవర్తి బీర్బల్‌తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాళికి బయలుదేరాడు. వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తూండగా హాహాకారాలు చేస్తూ, కొందరు అటుకేసి రావడం కనిపించింది. వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకణ్ణి ఆపి కారణం అడిగితే, ''రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నది. అది ఇటువైపే వస్తున్నది. పారిపొండి''! అంటూ వాడు వెళ్లిపోయాడు. వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటలనాదం, ఘీంకారం వినిపించాయి. అక్బర్‌ చేయి, మొలలో వేలాడుతూన్న కత్తిపిండి మీదికి వెళ్ళింది. తక్కినవారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు. అయినా, మదుపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవడం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు.
చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్‌ కేసి చూశారు. అయితే, బీర్బల్‌ ఏనుగు వస్తూన్న దిక్కు కేసి కూడా చూడడం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకుని పడుకున్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్‌ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవడానికి పిల్లి ప్రయత్నించింది. అయినా, అంతలో ఏనుగు సమీపించడంతో, పిల్లిని ఏనుగు వీపుమీద పడేలా గురి చేసి విసిరాడు. పిల్లి తల్లకిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగువీపుపై నాలుగు కాళ్ళ మీద దభీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్ళతో గిచ్చసాగింది.
ఏనుగు అక్కడే నిలబడి, కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే కిందకి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంటబడి తరుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా, దాపులవున్న పొదలలోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ''బీర్బల్‌, నీ సమయస్ఫూర్తికి జోహార్లు! మదుపుటేనుగును తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం! ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అక్బర్‌ చక్రవర్తి మందహాసంతో.