WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 18 December 2015

CHOTE KID LAVANYA AND SAVING THE PLANTS - CHANDAMAMA CHILD STORIES COLLECTION


గుండువారిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నది లావణ్య. ఆదివారం బడికి సెలవు కదా, దాంతో తల్లిదండ్రులతో పాటు పొలం పనికి పోయింది.

అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. "నేను కూడా ఏదైనా పని చేయాలి" అనుకున్నది లావణ్య. అక్కడ ఉన్న రకరకాల పనిముట్లలో తనకు నచ్చింది ఏంటి అని చూసింది. ఓ గొడ్డలిని చేతపట్టుకున్నది. ఆ తుప్పనీ, ఈ కంప చెట్టునీ కొట్టుకుంటూ పోయింది.

అట్లా అట్లా పొలం చుట్టూ తిరిగింది; మరింత పనికోసం వెతికింది. చూస్తే పొలం ప్రక్కన ఖాళీ భూమిలో ఎత్తైన వేప చెట్టు ఒకటి కనిపించింది. ఆ చెట్టు మీద చాలా గిజిగాళ్ళు- అందంగా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి.

కొంచెం సేపు ఆ గూళ్లను అందుకునేందుకు ప్రయత్నించింది లావణ్య. అవేమో దట్టమైన కొమ్మల్లో‌ ఎత్తుగా వ్రేలాడుతున్నాయి. కొంచెంసేపు ప్రయత్నించాక లావణ్యకు అలుపు వచ్చింది; కోపం‌ కూడా వచ్చింది.

"చెట్టును కొట్టేస్తే ఇంక మీరు ఎక్కడుంటారే?!" అన్నది. వెంటనే చెట్టును కొట్టేసేందుకు పూనుకున్నది. అనుకున్నదే తడవు గొడ్డలికి పని పెట్టింది. అయితే చెట్టు చాలా గట్టిగానే ఉన్నది. కొంచెం సేపు కొట్టాక ఆ పాపకు అలుపు వచ్చింది. అంతలోనే వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడికొచ్చారు. ఈ పాప చేస్తున్న పనిని చూశారు.

"పాప బలే పని చేస్తున్నది" అన్నారు అమ్మతో పాటు వచ్చిన పనివాళ్ళు, ముచ్చట పడుతూ.

అమ్మ మాత్రం పాప దగ్గరికి వచ్చి "పచ్చని చెట్టు కదమ్మా! కొట్టేస్తే పాపం, దానికి నొప్పి పుడుతుంది కదా? చెట్టును అట్లా కొట్టకూడదు తల్లీ. రా, ఇంటికి పోదాం" అని పిల్చుకుపోయింది.

బాగా పని చేసి అలసిపోయిన లావణ్య ఆరోజు సాయంత్రం అంతా బావిలో స్నానం చేస్తూ గడిపింది.

మరుసటి రోజున పాఠశాలలో పర్యావరణ దినోత్సవం జరిగింది. జిల్లా విద్యాధికారిగారు బడికి ముఖ్య అతిథిగా వచ్చారు. స్టేజీ మీద చాలా మంది పర్యావరణం గురించి మాట్లాడారు: "చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా మనుషుల్లాగే, మిగిలిన ప్రాణుల్లాగే బాధపడతాయి; ఆనందపడతాయి" అని వాళ్ళు చెబితే, వింటున్న లావణ్య ఆశ్చర్యపడింది. "అమ్మ కూడా ఇట్లాగే చెప్పిందే!" అనుకున్నది.

"ఈ విషయాన్ని మన భారతీయ శాస్త్రవేత్త 'జగదీష్ చంద్రబోస్' కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న యంత్రం మొక్కల సంవేదనలను కొలిచి, ప్రపంచానికంతటికీ తెలియజేసింది" చెప్పారు సైన్సు అయ్యవారు.

ఈ మాటలు వింటుంటే తను కొట్టబోయిన వేప చెట్టు గుర్తుకొచ్చింది లావణ్యకు. చాలా సిగ్గు వేసింది. ఆ రోజున పాఠశాలలో చాలా చురుకుగా పని చేసింది ఆ పాప. ఇరవై చెట్ల కోసం గుంతలు త్రవ్వింది; ఇరవై మొక్కలు నాటింది! అన్నిటికీ నీళ్ళు తెచ్చి పోసింది!

సాయంత్రం ప్రధానోపాధ్యాయుడిని అడిగి ఒక మొక్కను ఇంటికి తీసుకుపోయింది. మరుసటి రోజు పొద్దున్నే పొలానికి పోయి, తను నరికేద్దామనుకున్న వేప చెట్టుకు దగ్గరగా ఈ మొక్కను నాటింది. పాదు చేసి, నీరు పోసింది.

కొన్నాళ్లకు సంతోషంతో ఆ మొక్క చిగుర్లు వేస్తే, దాని కోసమే రోజూ వెళ్ళి చూస్తున్న లావణ్య అంతకంటే ఎక్కువ సంతోషపడింది.


No comments:

Post a Comment