ధనుర్మాసం ముగ్గులు
ముగ్గులు తెలుగు ముంగిళ్ళలో వేయబడిన రంగవల్లికలు
ముగ్గులు తెలుగు ముంగిళ్ళలో వేయబడిన రంగవల్లికలు
ముగ్గుపిండి, బియ్యపురవ్వలతో చుక్కలు పెట్టి, తీగాలుగుగా, బొమ్మలను వేసే అలంకారం ముగ్గు. స్తీల సృజనాత్మకతకు అద్దం పట్టే అందమైన పొందికైన రూపకాలు. ముగ్గులు వాకిలికి అందాన్ని ఇచ్చి, ఇంటికి సౌభాగ్యాన్ని తెస్తాయని నమ్మకం. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమేకాదు.. ఆరోగ్యం, అందం, ఆనందం కోసం కూడా.
ధనుర్మాసం ముగ్గులు:
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తాడని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరుచుకుంటాయనేది మన పెద్దల నమ్మకం. అందుకే మహిళలంతా ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి, కల్లాపి చల్లి, ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు. ఈ ముగ్గులలో ప్రత్యేకంగా వైకుంఠ-వాకిళ్ళు వేస్తారు.
ముగ్గులలో గొబ్బిళ్లు…
ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూలను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు. చిన్న చిన్న పిల్లలు, పెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు. నెల చివర్లో సంక్రాంతిన, వేడుకల అనంతరం..రోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం (పాయసం) వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగిస్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా.
పోటీలు…
ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు. పత్రికలు, వార్తాపత్రికలు, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు.
ఆరోగ్యం…
ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం… నీటిని తెచ్చి అందులో పేడ కలపడం… చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి.సంక్రాంత
గ్రామీణ ప్రాంతాల్లో…
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయేవి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకుని ఇంట్లోకి రాకుండా పోయేవట.
రకాలు..
ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ. దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలా వరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసుకుంటున్నారు.
సాంప్రదాయ ముగ్గులు.
మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మి నడయాడుతుందన్న నమ్మకంతో వేసే ముగ్గులు.
రంగుల ముగ్గులు.
కొన్ని విశేష సంధర్భాలలో రంగులను ఉపయోగించి వేసే ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.
పండుగ ముగ్గులు.
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మలతోను అలంకరిస్తారు.
చుక్కల ముగ్గు.
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
అమావాస్య రోజున ముగ్గులు.
అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకు ముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం వంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేత అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు. పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
నగరాలలో ముగ్గులు.
గతంలో ఇంటి ముందు ముగ్గులు అందంగా వేసేవారు. చాలామందికి ఇప్పుడు ప్రతి రోజు యాంత్రికమైన జీవితంలో పడిపోయి రంగవల్లులను చిత్రీకరించే సమయమే దొరకడం లేదు. దీనికి ముందుగానే పెయింట్తో ముగ్గులు వేసేస్తున్నారు. గతంలో ముదురు రంగులతో ముగ్గులు వేసుకొనేందుకు ఇష్టపడేవారు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. కాని ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రధానంగా పట్టణాలు, నగరాలలోని ఫ్లాట్ల ముందు ముదురు రంగులతో ముగ్గులను వేస్తున్నారు. దీంతో ఇంటికి కొత్త అందం వస్తుంది. రంగులతో పెయింటింగ్లో షేడ్లు, టోన్లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. మీరు ఇంటి లోపల, అలాగే ఇంటి బయట ముగ్గులు పెయింట్తో వేయాలనుకుంటే పసుపు, ఎరుపు రంగులు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు కనపడే ఈ రంగులు మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. వీటితో మీకు నచ్చిన డిజైన్లలో ముగ్గులు వేసి ఆనందించండి
No comments:
Post a Comment