మేలెరిగిన మహా మనిషి
మనీ ఇచ్చిన వాళ్లనే మరిచిపోయేలోకంలో మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆయన, ఆగర్భశ్రీమంతుడు కాదు. ఆయన జీవితం బడి పంతులుగా మొదలైనా మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేశారు.
హాస్యనటుడైనా ఆయన కాల్షీట్లు ఖాళీ ఉండేవి కాదు.రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టాక తనకు సాయం చేసిన వారికే కాకుండా తనను అభిమానించిన వారికి కూడా ఎంతో మేలు చేశారు. తన జీవిత కాలంలో ఆయన 78 మందికి సొంతఖర్చులతో వివాహం జరిపించారు. 68 మందికి విద్యాదానం చేశారు. సేవా సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.
మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఆకలితో పడుకున్నపుడు మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ఓ వాచ్‌మెన్ (రాజసులోచన ఇంటి వాచ్‌మెన్)ను గుర్తుపెట్టుకుని ఆర్థిక సాయం కూడా చేశారు. అప్పట్లో తన నాటకాలను ఆదరించిన పేద పారిశుద్ధ్య కార్మికులకు, రిక్షా వాళ్లకు తన సొంత డబ్బుతో రాజమండ్రిలోని దానవాయిపేటలో భూమిని కొని ఉచితంగా పట్టాలిచ్చారు. కోరుకొండలో కళాశాల కూడా కట్టించారు. తన ప్రతి పుట్టిన రోజున పాతతరం నటుల్ని సత్కరించి కళారంగం రుణం తీర్చుకున్నారు.
No comments:
Post a Comment