ముగ్ధ మందారం!
ఆహ్లాదాన్నిచ్చే అందం మందార పూల సొంతం. పూలే కాదు ఆకులూ, వేళ్లూ ...ఇలా అన్నింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ అధికమే.
మరి వాటిని ఉపయోగించుకుని ఎలా మెరిసిపోవచ్చో తెలుసుకుందామా?
వార్థక్య లక్షణాలను నిలువరించే శక్తిమంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్ ప్లాంట్ అనికూడా పిలుస్తారు. ఈ మొక్కలో చర్మానికి సాగే గుణాన్ని అందించి యవ్వనశోభతో మెరిసిపోయేలా చేసే లక్షణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని యాంటీ-యాక్సిడెంట్‌లు దుమ్మూధూళీ. అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మందార పువ్వు రేకల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే అలసిన చర్మానికి ఉపశమనం ఉంటుంది.
* మందార ఆకులు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. పొడిబారిన వెంట్రుకలకు తగిన పోషణనందించి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. మందార ఆకుల్ని మెత్తగా నూరి దానికి బాగా మగ్గిన అరటిపండునూ చేర్చి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుని చూడండి. జుట్టు పట్టులా మెరిసిపోతుంది.
* రెండు టేబుల్‌స్పూన్ల మందారపొడికి చెంచా తేనె, కాసిని పాలు కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తుంది. అలానే మందారంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. గాయాల తాలూకు మచ్చలు కూడా త్వరగా పోతాయి.
* పది నుంచి పదిహేను మందార ఆకుల్ని పావుకిలో కొబ్బరినూనెలో వేసి చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో మూడు నుంచి ఆరువారాల పాటు ఉంచాలి. ఆ తరవాత ఆకులు తీసేసి ఆ నూనెతో తలకు మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. మందార ఆకులతో పాటు కాసిని కరివేపాకు ఆకుల్నీ చేర్చి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి.
No comments:
Post a Comment