మహిళలు ముఖ్యంగా భారతీయ వనితలు కురులకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. శిరోజాలు అందంగా, ఆకర్షణీయంగా, వత్తుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడుగాటిదైనా, పొట్టిదైనా, ఉంగరాలదైనా, నల్లగా ఉన్నా, లేదా బూడిద రంగులో ఉన్నా, పట్టులా మెరుస్తూ వత్తుగా ఉన్నప్పుడే అది ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. అందంగా, ఆరోగ్యంగా అలంకరించుకున్న జుట్టు స్త్రీకి 'క్రౌనింగ్ గోరి' లాంటిది. అంటే శిరోజాల సౌందర్యం స్త్రీకి మకుటం లాంటిదని.
డ్రై హెయిర్ : పొడిగాఉండే జట్టును డ్రైహెయిర్ అంటారు. ఈ రకం జుట్టు మృదుత్వం, మెరుపు లేకుండా రఫ్‌గా ఉంటుంది. ఎక్కువ సమయం ఎండలో గడిపే వారిలోనూ, పదే పదే వేడి గాలిలో జుట్టు ఆరబెట్టుకునే వారిలో ఎండిపోయిన జుట్టు కన్పిస్తుంది. ఇలాంటి వారికి ఆయిల్ మసాజ్ ఉపయోగంగా వుంటుంది. మసాజ్‌కు కొబ్బరి - ఆల్మండ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌లను వాడవచ్చు. కొబ్బరినూనెను సన్నని సెగపైకాచి కొంచెం చల్లారనివ్వాలి. దూదిని గోరువెచ్చగా ఉన్న కొబ్బరినూనెలో ముంచి వెంట్రుకలను పాయలు పాయలుగా తీసి వెంట్రుకకు కుదుళ్ళకు అంటే విధంగా దూదితో ఈ వేడి నూనెను మాడుకు బాగా రుద్దాలి. ఆ తరువాత తలంతా మాలిష్ చేయాలి. తర్వాత వేడి నీటిలో ఒక టవల్‌ను ముంచి నీటిని పిండి అరగంటవరకు ఆ టవల్‌ను తలకి చుట్టుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై హెయిర్‌లోని డల్‌నెస్ తగ్గి మృదుత్వం చేకూరుతుంది.
ఆయిలీ హెయిర్ : ఆయిలీ హెయిర్ ఉన్నవారి బాధ అంతాయింతాకాదు. జిడ్డుకారుతున్నట్లు కనిపించే జుట్టు ఎవరికైనా చిరాకు కలిగిస్తుంది. తైలపదార్ధం అవసరాన్ని మించి తలలో ఉత్పత్తికావడంవల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. తరచుగా తలస్నానంచేస్తూ ఉండడంద్వారా కొంతవరకు జిడ్డును వదిలించు కోవచ్చు. ముల్తాని మట్టిలో నిమ్మరసంపోసి తలంటుకుని స్నానం చేస్తే తైలపదార్థం తొలగిపోయి జిడ్డుకారకుండా వెంట్రుకలు నిగనిగలాడతాయి. అయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు నూనెలు, మసాలా పదార్థాలు మానుకుని నెలకోసారి హెన్నాలో నిమ్మరసం చేర్చి తలకు పట్టించుకుని ఒక గంట తర్వాత స్నానం చేసినట్లయితే జిడ్డు వదిలిపోయి శుభ్రంగా ఆకర్షణీయంగా శిరోజాలు నిగ నిగలాడుతువుంటాయి.
బిరుసుగా వుండే జుట్టు : ఇలాంటి జుట్టు మృదుత్వం లేని కారణంగా ఎండిపోయి జీవం కోల్పోయినట్లు ఉంటుంది. ఎంతదువ్వినాజుట్టు ఉన్నచోట ఉండక నానా ఇబ్బందులు కలిగిస్తుంది. వేసవిలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగానే కన్పిస్తుంది. వీరు హెన్నా ఉపయోగించడం వల్ల మంచిఫలితం వుంటుంది. శిరోజాల పోషణకు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో దోహదంచేస్తుంది. జుత్తు ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విటమినులు పుష్కలంగా ఉండాలి. దోసకాయలు, తాజా ఆకు కూరలు, గుడ్లు, చేపలు, యాపిల్స్, ఉసిరిక, పాలకూర మొదలైనవి ఎక్కువగా వాడాలి.
No comments:
Post a Comment