కార్తీక మాసం లో దర్శించవలసిన క్షేత్రం "కద్రి" కర్ణాటక
పరమశివుడికి పరమ ప్రీతికరమైన మాసం కార్తీకం. ఈ మాసంలో ఆయన దర్శనం .. పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి సదాశివుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా మంజునాథ క్షేత్రం కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతంలోని 'కద్రి'లో ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది.
ఇక్కడే ఆదిదేవుడు పరశురాముడికి మంజునాథుడిగా దర్శనమిచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఈ ప్రదేశాన్ని పరశురాముడికి సదాశివుడే చూపించాడని అంటారు. అప్పుడు ఈ ప్రదేశం వరకూ సముద్రం ఉండేదట. తనకి శివుడు చూపిన ప్రదేశం నుంచి వెనక్కి వెళ్లమని పరశురాముడు ఆదేశించినా సముద్రం అలాగే ఉందట. ఆయన ఆగ్రహంతో తన గొడ్డలిని విసిరితే, అప్పుడు సముద్రం వెనక్కి వెళ్లిందని చెబుతారు.
అలా ఏర్పడిన ప్రదేశంలో ఒక బావిలో శివలింగం కనిపించిందట. ఆ శివలింగాన్ని పరశురాముడు పూజిస్తూ అక్కడ ఉండిపోయాడని చెప్పబడుతోంది. ఆ తరువాత కాలంలో ఎంతోమంది మహర్షులు .. మహా భక్తులు .. మహా రాజులు మంజునాథుడిని దర్శించి తరించారు. కార్తీకమాసంలో ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, వెనుక జన్మలనాటి పాపాలన్నీ నశించి .. ముందు జన్మలకి అవసరమైన పుణ్యఫలాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.
No comments:
Post a Comment