దక్షిణామూర్తి
దక్షిణామూర్తి పరమశివు ని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువు లు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
బ్రహ్మదేవుడు తన సృష్టి ని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.
ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.
పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.
శ్రీ దక్షిణా మూర్తి దీక్ష
ధనుర్మాసం లో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణా మూర్తి దీక్షను స్వీకరిస్తారు .దీనికే ‘’కోటప్ప దీక్ష ‘’అని పేరు .నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామ స్మరణ శివ పంచాక్షరీ జపాల తో అభిషేకాలతో సంత్సంఘాలతో ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది ‘’దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం –త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం ‘’అని శివ స్మరణ చేస్తూ ఆలయం అపర కైలాసాన్ని స్పురణ కు తెస్తుంది .మేధా దక్షిణా మూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో ‘’మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన’’,నిరతాన్న దానాలు ,గోస్టులు , సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా .కోరిన కోర్కేలనుతీర్చేకోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ని దర్శించి తరిద్దాం .
ఈ దీక్ష స్వీకరించే వారు ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చే ముందు 40 రోజుల ముందు సోమవారం లేదా గురువారం స్వీకరిస్తారు. ఇది కోటప్ప కొండ గుడిలో కానీ లేదా దగ్గరలో శివాలయంలో కానీ, శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కానీ లేదా ఒక మఱ్రి చెట్టు క్రింద కానీ ఎవరైనా స్వీకరించవచ్చు.
స్ఫటిక మాల-54 లేదా 108 పూసలు గలది శ్రీ దక్షిణామూర్తి లేదా శివుని రూపుతో ఉన్నది ధరించటం జరుగుతుంది.ఇరుముడి 3 టెంకాయలు,మూడు రకాల పండ్లు,విభూతి,గంధం,కర్పూరం,తేనె,పటికె బెల్లం,మూడు గుప్పెళ్లు బియ్యం తో కట్టుకుంటారు.
దీక్షలోని నియమాలు విధిగా ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండే నియమాలే:
1. తల్లి దండ్రుల,దేవ బ్రాహ్మణాది పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి యుండాలి.ప్రాత:కాలమున లేవగానే తల్లిదండ్రుల లేదా గృహ పెద్దల పాదములకు నమస్కరించాలి.
2. ప్రతి దినము ఉదయం,మధ్యాహ్నం,సాయం కాలం మూడు పూటలా చన్నీటి స్నానం శిరస్నానం విధిగా చేయాలి.
3. విభూతి రేఖలు దిద్దుకుని గంధము కుంకుమలతో గుండ్రని బొట్టు భ్రూస్థానం లో పెట్టుకోవాలి.
4. స్వామిని సర్వకాల సర్వావస్థలయందు ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ: అని జపిస్తూ ఉండాలి.
5. మద్య,మాంస,ధూమపానాదులను త్యజించాలి.సాత్వికాహారాన్ని భుజిస్తూ ఉల్లి, మసాలాలు, వేపుడులు మానివేయాలి.
6. త్రికరణ శుధ్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.స్త్రీలను పవిత్ర దృష్టితో చూడాలి.
7. మాల ధరించిన పిదప తన హృదయములో స్వామికి నివాసమేర్పడిందని భావించి శ్రధ్ధా భక్తులతో వినయ విధేయతలతో మెలగాలి.
8. క్షురకర్మ చేయించుకొనుట,చేతి గోళ్లు తీయుట చేయకూడదు.
9. భూశయనము చేయాలి.నేల మీద శుభ్రమైన వస్త్రాన్ని పరచుకొని విశ్రమించాలి.లేదా చాప వేసుకోవచ్చు.
10.ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.రాత్రి పూట పండ్లు భుజించి పాలు సేవించాలి.
11. మూత్ర విసర్జనానంతరం కాళ్లు, చేతులు కడుక్కొని నీటితో ఏడు సార్లు పుక్కిలించి ఉమిసివేయాలి.కాలకృత్యాల అనంతరం స్నానమాచరించి ఉతికి ఆరవేసిన వస్త్రాలను ధరించాలి.
12. ప్రతి సోమ,గురువారాలలో స్థానిక దేవాలయాన్ని సందర్శించాలి.
13. సాధ్యమైనంతవరకూ పురాణ కాలక్షేపం గానీ సత్సాంగత్యం లో గానీభజనలో పాల్గొనటం గానీ చేయాలి.
14. చెప్పులను వాడకూడదు. తప్పనిసరి అయినప్పుడు తోలు చెప్పులు కాని వాటిని ధరించాలి.
15. త్రికాలములందు శ్రీ దక్షిణామూర్తి పూజలు చేయాలి.
16. తెల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి.చేతి రుమాలు సైతం తెల్లనిదయి ఉండాలి.రంగు అంచు ఉండకూడదు.అవసరమైతే ఆకుపచ్చ అంచు ఉండవచ్చు.
17. ప్రతి రోజూ ఒక గంట మౌనం పాటించాలి (నిర్విరామంగా)
18. సినిమాలు చూడటం,అశ్లీల సాహిత్యం చదవటం చేయకూడదు.దీక్ష స్వీకరించిన వారు మానసిక శారీరిక స్థితులయందు సమతుల్యతతో మరియు మనోవాక్కాయకర్మలయందు పవిత్రతతో సమాజమునకు ఆదర్శప్రాయులుగా ఉండాలి.
పై నియమాలతో పాటు ప్రవర్తనా దోషాలను పరిహరించి సన్నియమాలను ఆచరించటం ద్వారా అందరూ శ్రీ మేధా దక్షిణామూర్తి అపార కరుణా కటాక్ష వీక్ష ణాలకు పాత్రులై సుఖ శాంతులని,అష్టైశ్వర్య విభూతిని పొందుదురు గాక!
ఓం తత్ సత్!
No comments:
Post a Comment