WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 11 July 2014

IMPORTANCE OF INDIAN FESTIVAL - GURU POURNAMI - MEANING AND PRAYERS OF TELUGU FESTIVAL - GURU POURNAMI



గురు పౌర్ణమి.. వ్యాసపూర్ణిమ రోజున ఎవరిని పూజించాలి?

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :

గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట.


ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.

వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.

ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.

ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..

No comments:

Post a Comment