ఒకటి రెండు రోజులు సరిగ్గా నిద్రలేకపోయినా, నిద్రలేమి ఏర్పడినా శరీరంలో చురుకుతనం, ఉత్సాహం తగ్గిపోతుంది. ఆవలింతలు వస్తూంటాయి. సోమరితనం ఏర్పడుతుంది. ఒకటి, రెండు రోజులు నిద్రా సమయం తగ్గితే ఆ తర్వాత ఎక్కువ సమయం నిద్రలో గడిపి, ఆ బద్ధకాన్ని తీర్చుకుంటారు చాలామంది. అయితే ఎక్కువ రోజులు నిద్రపట్టకుండా ఉండటం, అపరాత్రివేళ మెలకువవచ్చి తిరిగి నిద్రపట్టక పోవడమన్నది ఆరోగ్యరీత్యా మంచి విషయం కాదు. నిద్రలేమి వ్యాధి కానప్పటికీ దానివల్ల ఎన్నో అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్రెషన్, జ్ఞాపకశక్తి మందగించడం, మెదడు సరిగ్గా ఆలోచించలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంలాంటి లక్షణాలు ఏర్పడతాయి.
రక్తపోటు కూడా పెరిగే ప్రమాదముంది. శరీరానికి, మనస్సుకూ తగినంత విశ్రాంతి లభించనందువల్ల, మానసిక శారీరారోగ్యాలు కుంటుపడుతాయి. ఎక్కువకాలం నిద్రలేమి ఏర్పడటం వల్ల హార్ట్ అటాక్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎటువంటి శారీరక అనారోగ్యాలు లేకుండా నిద్రపట్టకుండా ఎక్కువరోజులు బాధపడుతున్నవారు ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సూచనలు, సలహాలు పాటిస్తూ నిద్రలేమిని తొలగించుకోవాలి. ఏ కారణాలవల్ల నిద్రలేమికి గురవుతున్నారో, నిద్రాభంగమవుతోందో తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం వెతికి హాయిగా నిద్రపోయే ప్రయత్నాలు చేయాలి. లేకపోతే నిద్రలేమి దీర్ఘకాల వ్యాధులకు గురిచేస్తుంది.
No comments:
Post a Comment