మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది. ఇంకా మహాలయ అమావాస్య రోజున పేదలకు తమకువీలైనంత దానము చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
సాధారణంగా ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలము. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు.
ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.
"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.
అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.
కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.
No comments:
Post a Comment