WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 30 September 2016

CAPITAL CITY OF PANDAVAS - INDRAPRASTHAM - FULL INFORMATIVE STORY IN TELUGU



ఇంద్రప్రస్థం

ఇంద్రప్రస్థం కథ... ధర్మచింతనులైన పాండవులను దుర్యోధనాదులకు దూరంగా గెంటివేయాలన్న దురుద్దేశంతో చక్రవర్తి ధృతరాష్ట్రుడు వారిని పిలిచి `నాయనలారా, మీరు ఖాండవప్రస్థం అనే చోటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి… ‘ అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారంగా పాండవులు ఖాండవప్రస్థం చేరారు. అయితే, అది ఎలా ఉన్నదంటే- పూర్తిగా కొండలు గుట్టలు, చెట్లూచేమలూ… జనసంచారం చాలాతక్కువ. 

మహాసౌధాలతో కళకళలాడే హస్తినాపురి ఎక్కడ ? ఈ అటవీప్రాంతమైన ఖాండవప్రస్థం ఎక్కడ? కానీ, ధృతరాష్ట్రులవారు మాత్రం- `నాయనలారా, హస్తినాపురి ఎంతో ఈ ఖాండవప్రస్థం కూడా అంతే సుమీ… మీరక్కడ సుఖశాంతులతో వర్థిల్లండి’ అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేదన్నట్టుగా తేల్చి చెప్పాడు. పాండవులు హస్తినాపురి విడిచి ఖాండవప్రస్థం బయలుదేరారు. ఈ రాజ్యపంపకం హస్తినాపురవాసులకు నచ్చలేదు. ఇది అన్యాయమని వాపోయారు. కానీ మహారాజు నిర్ణయాన్ని ఎదిరించలేకపోయారు. పాండవులు ఖాండవప్రస్థం వెళ్ళిచూశారు. అక్కడ మెరక, పల్లపు భూములు చాలానేఉన్నాయి. చిన్నచిన్న గుట్టలు, భయంకరమైన అడవులు…అక్కడక్కడా పల్లెలు కనిపించాయి. ఇదీ ఖాండవప్రస్థ భౌగోళిక స్థితి. అయితే ఒకే ఒక్క సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పక్కనుంచే యమునానది ప్రవహిస్తోంది.

ఈలాంటి ఖాండవప్రస్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యుధిష్టిరుడు సంకల్పం చెప్పుకున్నాడు. అందుకు శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. స్థానికుల సాయంతో అటవీభూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. సకాలంలో వానలు పడటంతో నదులూ వాగులూ ఒప్పొంగాయి. పంటలు బాగా పండాయి. తినడానికి తిండి, త్రాగడానికి నీరు సంవృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అభివృద్ధికి బాటలుపడ్డాయి. అవసరమైన చోట్ల రహదారులు నిర్మించారు. నెమ్మదిగా వాణిజ్యానికి అనుకూలవాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వర్తక శ్రేణులు తమ వ్యాపారాలను ఈ ప్రాంతానికే తరలించారు. ధనధాన్యరాశులు వచ్చిపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

హస్తినాపురికి తీసిపోని విధంగా ఖాండవప్రస్థం రూపుదిద్దుకుంటోంది. ఖాండవప్రస్థం కాస్తా ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అంటే సాక్షాత్తు ఇంద్రుడు నివసించే ప్రాంతంలా విరాజిల్లింది. పాలనాపరమైన సౌకర్యాల కోసం ఒక రాజ్యసభ అవసరమైంది. దేవతలశిల్పి మయుడు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని అందమైన రాజ్యసభను నిర్మించారు. ఆసభకు మయసభ అన్న పేరు సార్థకమైంది. సామంతరాజులు ధర్మరాజుని కీర్తించారు.

అడవిలో పడిఉండమని చక్రవర్తి శాసించినా కారడవిని మహానగరంలా మార్చిన పాండవుల తెలివితేటలు చూసి దుర్యోధనాదులకు కన్నుకుట్టింది. పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంతో ఈర్ష పతాకస్థాయికి చేరుకుంది. వెళ్లకూడదనుకుంటూనే ధుర్యోధనాదులు రాజసూయయాగానికి వెళ్ళారు. అక్కడి మయసభను విభ్రాంతితో చూశారు. దుర్యోధనుడు చిత్తభ్రాంతికి గురై మడుగులో కాలుజారి పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న పాంచాలి నవ్వింది. దీంతో పరాభవాగ్నితో దహించుకుపోతున్న దుర్యోధనుడ్ని శాంతిపచేయడానికి శకుని మాయాజూదం అంకానికి తెరతీశారు. ఫలితంగా చివరకు మహాభారత యుద్ధం జరిగింది. ఇదీ నాటి ఇంద్రప్రస్థ కథ.

No comments:

Post a Comment