WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 6 July 2016

HEALTH AND BEAUTY BENEFITS WITH ROSEMARY


అందం.. ఆరోగ్యాల రోజ్‌ మేరీ!

రోజ్‌మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్నపొద. వంటల్లో కొత్తిమీరలాగ దీన్ని ఎక్కుగా విదేశీ వంటల్లో వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్‌లు, సూపుల తయారీలోనూ సలాడ్లలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్‌టీ కూడా తయారు చేస్తారు.

రోజ్‌మేరీ శాస్త్రీయనామం రోజ్‌మారినస్‌ అఫిషినాలిస్‌. బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటిసన్నని ఆకులతో, సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగుపూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ చిన్నపొద ఇది. నీరు నిలవని ఇసుకనేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండ పడనిచోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపీట్‌ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో... రోజ్‌మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండినదైనా కూడా వంటల్లో వాడతారు. ఆకు కోసేటప్పుడు గ్రీవంపైన తుంచుకుంటే చిగుళ్లు త్వరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు. ఒకసారి నాటిన మొక్క చాన్నాళ్లపాటు నిలిచి ఉంటుంది. రోజ్‌మేరీలోని రెండు రకాల్లో అఫిషినాలిస్‌ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్‌ కొద్దిగా తీగలాగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్‌ రకం రాక్‌ గార్డెన్లలోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవడానికి కూడా బాగుంటుంది. వంటలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలా ఉంటాయి.

* సేంద్రియ ఎరువులు వాడితే...

రోజ్‌మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికోసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకంపోస్టు, ఆముదం, వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువే. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్లు కూడా ఆశించవచ్చు. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను(మార్కెట్‌లలో దొరుకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.

* ఔషధ గుణాలెన్నో...

రోజ్‌మేరీకి ఔషధగుణాలు ఎక్కువే. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులకు నివారణంగా వాడతారు. ఈ నూనెను తలకు మర్దన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందట. రోజ్‌మేరీని కలపడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు(అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీన్ని రూమ్‌ఫ్రెష్‌నర్‌గానూ, పెర్‌ఫ్యూమ్‌ల్లోనూ వాడతారు. జ్ఞాపకానికీ, ప్రేమకూ సంకేతంగా భావిస్తారు కూడా. రోజ్‌మేరీని కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణె, బెంగళూరు వంటి నగరల్లోని నర్సరీల్లో సులువుగా దొరుకుతుంది.

No comments:

Post a Comment