అసలు వేదమనగానేమి ?
వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము.
వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము.
|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||
అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము.
వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది.
|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||
కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.
No comments:
Post a Comment