అన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏదిలోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నిటిలోకీ అన్నదానం మిన్న అని,అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగాఇచ్చినా...ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది.
కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు. కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా చేయాలి. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్పారు. దీనికి సంబంధించి ఒక కధ కూడా చెప్తారు.
మహాభారత యుధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు.అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగతసత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏంలాభం....!కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు వుండటంలేదు. సంతృప్తి అనేది లేదు. ఎందుకు ఈవిధంగా ఉంటోందో అతనికి అర్ధం కావటంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి... ఎప్పుడైనా అన్నదానం చేశావా? అని అడిగాడు. నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు.
"పోనీ అన్నం పెట్టే ఇల్లయిన చూపించావా"? అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించి అన్నాడు కర్ణుడు. "ఓ బీద బ్రాహ్మణుడు నాదగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేనేదో ధ్యాసలో ఉండి నాకవకాశం లేదు కానీ...అక్కడ ఆ ఇంటికి వెళ్ళు " అని ఒక ఇల్లు చూపించాను. ఐతే అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలుని నువ్ నొట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. వెంటనే ఆ వేలు నోటిలో పెట్టుకున్నాడు కర్ణుడు.ఒక్క గుటక వేశాడు, ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపొయింది.
ఈ కధ ద్వారా అన్నదానం యొక్క మహత్య్మం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్లనుండి బయట పడటానికి చక్కని రెమెడిగా పనిచేస్తుంది అన్నదానం అని పండితులు చెప్తారు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమౌతాయని చెప్తారు. భోజనం చేసేముందు మొదటిముద్ద పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో పెడితే పక్షులను కుడా రక్షించిన ఫలితం వస్తుంది. అన్నాన్ని కాకులకు వేయటం వలన శని దోషాలు పోతాయని చెపుతారు.
No comments:
Post a Comment