మన్మధుని పునర్జీవితుని చేయుట-
శ్రీ శివ మహాపురాణము
మన్మధుని పునర్జీవితుని చేయుట
సరిగ్గా అదే సమయమని భావించిన దేవతలందరూ, శివుని పరిపరి విధముల కైవారము చేసి, రతీదేవిని అక్కడ ప్రవేశపెట్టారు. అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమైన రతీ మన్మధులు ప్రణయోద్దీపకులు కూడా గనుక, పరిణయానంతర ప్రణయానికీ - ప్రేమసామ్రాజ్య మథనానికీ మదనుని అవసరం అతి ముఖ్యమైనది కనుక - వారందరూ అదే సరైన అదనుగా భావించారు.
రతీదేవి, తన కొంగున కట్టిన మన్మధుని బూడిదను, శివదేవుని చరణసన్నిధిన ఉంచి "సదాశివా! ఇదేనా నీ కరుణ? పార్వతిని పెండ్లాడ్డానికి - దేవతా ప్రేరితుడై కదా...నా పతి నీకు పరోక్షంగా సహకరించాడు. అది తమ కోపావేశాలకు కారణభూతమై...ఇదిగో! నా పతిదేవుని ఇలా పిడికెడు బుగ్గిగా మిగిల్చింది! అమ్మా! పార్వతీ! కొత్త పెళ్లికూతురివి! భర్త లేనిదే భార్యకు ఎన్ని సంపదలున్నా వృధా అని తెలిసి - తపమాచరించి మరి భర్తను పొందిన దానివి! నా బాధ అర్ధం చేసుకోగలవు కద తల్లీ!" అంటూ ఇరువురినీ వినయ - భక్తి తత్పరతలతో వేడుకున్నది.
పతిదేవుని పట్ల రతీదేవికి ఉన్న అనురగానికి, ఆ నూతన దంపతులు ( సనాతన దంపతులైన ఆది దేవుడూ - అంబ ) అచ్చెరు వొందారు. ఆమె జీవితంపట్ల జాలిపడి అయినా సరే, మన్మధుని బ్రతికించాల్సిందిగా బ్రహ్మది దేవతలు సైతం అభ్యర్ధించారు.
కరుణాంతరంగుడైన కాలకంఠుడు, మదన కుమారుడి భస్మాన్ని తన అమృతమయ వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే! సమస్త చిహ్న, లాంచన, రూప, యవ్వన సంపత్సహితంగా పునరావిర్భావం చెందాడు మన్మధుడు. రతీదేవి పతి సమేతంగా శివదంపతులకు నమస్కరించింది. పెళ్ళికళకే కొత్త కళలు వచ్చి చేరినట్లయింది కందర్పాగమనం.
కైలాసవాసిగా గౌరీశుడు
తన ఎడమచేతి చిటికెను వ్రేలు పట్టుకొని నునులేతసిగ్గుతో, కొత్త పెళ్లుకూతురైన కొండరాచూలిని వెంట బెట్టుకొని తన నిజనివాసమైన కైలాసపురిని చేరుకున్నాడు కృత్తివాసుడు.
అనంతరం అంగజు కేళికి సమాయత్తమైనారా నూతన వధూవరులు.
"పుణ్యాతిపుణ్య విభవన్మునిశ్రేష్ఠులారా! సమస్త పాపహరణమూ అయిన పార్వతీఖండమందు ఈ కల్యాణ ఘట్టము మీకు గల ఆసక్తి చేత వినిపించితిని. మనమందరమూ ఈ కల్యాణ మననం ద్వారా ధన్యులమైతిమి" అని ఆనాటికి పురాణ శ్రవణం ముగించాడు రోమహర్షణుడు.
పార్వతీ ఖండము సంపూర్ణము.
No comments:
Post a Comment