గరం మసాలా..రకరకాలుగా
• వంటల్లో గరం మసాలా వాడాల్సి వచ్చినప్పుడు ఇదివరకు బయట కొన్న పొడి వేసేదాన్ని. కానీ అది అన్ని కూరలకూ నప్పడంలేదు. దాంతో నేనే ఇంట్లో గరం మసాలా తయారుచేసి వాడా. అయినా కూరలకి రుచి రాలేదు. దీనికి కారణమేంటీ.. గరం మసాలా ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు? - కావ్యశోభ, అమలాపురం
* మనం సాధారణంగా లవంగాలూ, యాలకులూ, దాల్చినచెక్కతో పాటూ కొద్దిగా మిరియాలూ, జీలకర్రా, గసగసాలూ కలిపి మసాలా తయారుచేసుకుంటాం. బహుశా మీరూ అలాగే చేస్తుండొచ్చు. వాటికి ఈసారి అనాసపువ్వు పొడీ, ఒక చిటికెడు జాజికాయపొడి కూడా కలిపి చూడండి. కొంత ఘాటు వస్తుంది. రుచిలోనూ మార్పు ఉంటుంది. మీ సమస్యకు మరో పరిష్కారం.. వివిధ రకాల గరంమసాలాలూ వాడిచూడటమే. ముఖ్యంగా కేరళా, పంజాబీ, గుజరాత్‌లలో వాడే గరంమసాలా చాలా విభిన్నమైన రుచుల్ని అందిస్తాయి. వాటినోసారి ప్రయత్నించండి..!
• పంజాబ్ గరంమసాలా మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేక రుచితో ఉంటుంది. ఈ పొడిని కేవలం శాకాహార, మాంసాహార కూరల్లోనే కాదు, పప్పుల్లోనూ వేస్తుంటారు. దీనికోసం అరకప్పు ధనియాలకు, పావుకప్పు జీలకర్రా, తొమ్మిది పది దాల్చిన చెక్క ముక్కలూ, రెండు టేబుల్‌స్పూన్ల లవంగాలూ, పన్నెండు యాలకులూ, రెండు టేబుల్‌స్పూన్ల చిన్న యాలకులూ, ఒకటిన్నర టేబుల్‌స్పూను మిరియాలూ, అంగుళం పొడవున్న శొంఠి ముక్కా, ఒక జాజికాయను తీసుకోవాలి. అలాగే పది బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుని అన్నింటినీ దోరగా వేయించి పొడిలా చేసుకుంటే చాలు.
• కేరళ ప్రాంతంలో వాడే గరంమసాలా పొడి ఘాటు తక్కువగా, కమ్మగా ఉంటుంది. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కతోపాటూ చిన్న జాజి పువ్వు ముక్కా, కప్పు జీలకర్ర కూడా వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే గరంమసాలా పొడిలోనే చిటికెడు చొప్పున శొంఠిపొడీ, ఇంగువా, ఐదారు ఎండుమిర్చీ, చెంచా కసూరీమేథీ, తగింత ఉప్పు, కొద్దిగా పసుపూ కలిపి పొడికొడతారు. గుజరాతీ గరమంమసాలా రుచి కూడా భిన్నంగానే ఉంటుంది. ఇందులో లవంగాలూ, దాల్చినచెక్కకు బదులు మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరిపొడీ, ఒక టేబుల్‌స్పూను నువ్వులూ, రెండు టేబుల్‌స్పూన్లు ఆవాలూ, కొద్దిగా మిరియాలూ, అరకప్పు ఆకుపచ్చని యాలకులూ, ముప్పావు కప్పు జీలకర్రా, పావుకప్పు జాజికాయపొడీ కలిపి తయారు చేస్తారు.
• ఏ తరహా మసాలా చేసుకుంటున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలా తయారీలో ఉపయోగించే పదార్థాలను ఎండలో ఓ గంటసేపు ఉంచాలి. వేయించిన పదార్థాలన్నీ చల్లారాకే పొడి కొట్టాలి. తయారు చేసుకున్న పొడిని గాలితగలని డబ్బాలోకి తీసుకున్నప్పుడే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. గరంమసాలా మంచి సువాసనతో పాటూ కొద్దిగా తియ్యగా కూడా ఉండాలనుకుంటే అందులో ఓ టేబుల్‌స్పూను వేయించిన సోంపు కలుపుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి రంగూ, వాసన మసాలాకి వస్తాయి.
No comments:
Post a Comment