WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 19 January 2015

TELUGU MAHABHARATA STORIES - STORY ABOUT LORD SRI KRISHNA AND NALAKUBARA MANIGRIVA CURSE STORY IN TELUGU


శ్రీమద్భాగవతము లోని కథ
.
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీదనుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది.

తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు! పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో ఱోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది. మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకుగానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!
యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా ఱోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఱోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాలముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకువెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యొన్ముఖులై వెళ్ళిపోయారు

No comments:

Post a Comment