WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 12 January 2015

MAHABHARATHA STORY IN TELUGU - ABOUT ARJUNA AND HIS PILIGRIM VISITS


అర్జునుడు... నారీ తీర్థాలు

ఒకసారి పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ సమద్రతీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సౌభద్రం, పౌలోమం, కారంధమం, ప్రసన్నం, భారద్వాజం అనే పంచతీర్థాలు ఉన్నట్టు తెలుసుకున్న అర్జునుడు అక్కడికి బయలుదేరుతూంటే ఒక సాధువు వారించి, ‘వాటిలో పెద్దపెద్ద మొసళ్ళున్నాయి. అవి స్నానం చెయ్యడానికి దిగిన వారిని పట్టి మ్రింగుతున్నాయి. ఇలా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది కనుక వాటి దరికి వెళ్ళవద్దు’అని హెచ్చరించాడు. అయినా లక్ష్యపెట్టకుండా అర్జునుడు ఆ తీర్థాలున్న ప్రదేశానికి చేరుకున్నాడు.

ముందుగా సౌభద్ర తీర్థంలో స్నానానికి దిగాడు. సాధువు చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లో ఒక బలిష్టమైన మొసలి అర్జునుని కాలు పట్టుకొని లోపలకు లాగసాగింది. అతి ప్రయాసతో అర్జునుడు దాన్ని ఒడ్డుకు ఈడ్చుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే ఆ మొసలి ఆశ్చర్యంగా ఓ త్రిలోక సుందరిగా మారిపోయింది. నిశే్చష్టుడైన అర్జునుడు కాస్సేపటికి తేరుకొని, మొసలి రూపంలో ఎందుకున్నావని ఆమెను అడిగాడు.

అప్పుడా సుందరి, ‘‘మహాశక్తిమంతా! నేను అప్సరసను. నా పేరు వర్గ. నేనంటే కుబేరుడికెంతో ఇష్టం. నాకు నలుగురు చెలికత్తెలున్నారు. వారికీ నాలాగే కామగమనం తెలుసు. మేము అప్పుడప్పుడూ భూలోకం వచ్చి ప్రకృతి అందాలను చూడ్డానికి అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటాం. ఒకరోజు మేమైదుగురం ఇక్కడికి సమీపంలో ఉన్న అరణ్యానికి వచ్చాం. పచ్చని చెట్లతో, పుష్పాలతో ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక యువకుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని తేజస్సుతో ఆ ప్రదేశమంతా సూర్యభగవానుని కన్నా మిన్నగా వెలిగిపోతోంది. అతని అద్భుతరూపం చూసి ఇంత అందగాడికి తపస్సేమిటి అనుకున్నాం.
‘‘వయస్సు పొంగులో ఒడలు తెలియలేదు. ఆ సుందరుడి తపస్సు భగ్నం చేసి మా వశం చేసుకోవాలని నేనూ, సౌరభేయి, సమీచి, బుద్భుద, లత అతని చెంత చేరాం. ఆటలతో పాటలతో అలరించాం. వెటకారం చేస్తూ పగలబడి నవ్వాం. అహంకారంతో ఎన్నోవిధాలుగా అవమానించాం. నెమ్మదిగా కనులు విప్పిన ఆ తాపసి మా ఆట పాటలకు అంద చందాలకు ఏమాత్రం చలించలేదు. అతడి మనోనిగ్రహం ముందు మా చేష్టలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మా దురుద్దేశాన్ని గ్రహించిన ఆ మునీశ్వరుడు, ఇక ఎవ్వరికీ మేమలా తపోభంగం చేయకూడదనుకున్నాడు కాబోలు- ‘మీరు మొసళ్ళుగామారి పంచతీర్థాల్లో పడి ఉండండి’అని శపించాడు.

‘‘మేము గడగడ వణకిపోయాం. ఏంచేయాలో తోచలేదు. కొన్ని క్షణాల అనంతరం తేరుకొని చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ ‘తాపసోత్తమా! వయస్సు, అందం, కోరిక, మాలో విచక్షణా జ్ఞానాన్ని నశింపజేసాయి. మీవంటి తపోధనుల పట్ల వెకిలిగా ప్రవర్తించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం తప్పని ఒప్పకుంటున్నాం. మీ శాప ప్రభావంతో మేము మొసళ్ళు కావడం అన్నమాట తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. దయచేసి మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించుకోండి’ అంటూ అతని కాళ్ళమీద పడ్డాం.

‘‘ఆ తాపసి సానుభూతితో మమ్మల్ని చూస్తూ ‘నేనింతవరకూ ఎగతాళికి కూడా అసత్యం పలుకలేదు. కాబట్టి నా శాపప్రభావంతో పంచతీర్థాల్లో మొసళ్ళుగా పడి ఉండడం తప్పదు. మీరు ఆ తీర్థాల్లో స్నాన మాచరించడానికి వచ్చిన వారిని పట్టి మ్రింగుతుంటారు. మీకు ఆహారం కాకుండా మిమ్మల్ని ఒడ్డుకు లాగ గలిగిన పురుషునివల్ల శాపవిమోచనం కలిగి స్వస్వరూపాలు ధరిస్తారు. కనుక మీరు త్వరగా పంచతీర్థాల వద్దకుపోయి అయిదుగురూ అయిదింటిలో ప్రవేశించండి’అని దయతో పలికాడు. ‘‘అప్పట్నుంచీ మొసళ్ళరూపంలో మేమీ జలాశయాల్లోపడి ఉన్నాం. మహాబలులు నా చెలులు కూడా నాలాగే నాలుగు జలాశయాల్లో ఉన్నారు. దయార్ద్ర హృదయంతో వారికీ యథారూపాన్ని ప్రసాదించు’’ అని వేడుకుందా త్రిలోక సుందరి.

జాలిపడిన అర్జునుడు ఆమె మాట మన్నించి మిగతా నలుగురికీ కూడా శాపవిముక్తి కలిగించాడు. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ, ‘‘మహాభాగా! మీరే గనుక ఇక్కడకు రాకపోతే ఎంత కాలమైనా మేము మొసళ్ళుగానే ఉండిపోయే వాళ్ళం. ఎంతో ధైర్యంగా మాకు శాపవిముక్తి కలిగించిన మీకు సర్వదా కృతజ్ఞులం!’’ అన్నారు ఏక కంఠంతో.
అప్పుడు అర్జునుడు ‘‘దేవకాంతలారా! తపోధనుల సాధుత్వాన్ని బలహీనతగా భావించి, అహంకారంతో వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఇప్పటికైనా గ్రహించండి!’’అని మందలించాడు.వారు బుద్ధిగా తలలూపి అర్జునుడికి నమస్కరించి తమ లోకానికి పోయారు. ఆనాటినుండీ పంచతీర్థాలు నారీ తీర్థాలుగా పేరు పొందాయి. (చిత్రం) సౌభద్ర తీర్థం

No comments:

Post a Comment