WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 16 December 2014

TELUGU PURANA STORY OF MAHARISHI JAMADAGHNI AND THE STORY OF KARTHVEERYUDU AND PARASURAMUDU



రాచ అహంకారానికి జమదగ్ని బలి

కన్ను మూసి తెరిచే లోపు తన ఆజ్ఞను పాటించిన పరశురాముణ్ని ప్రేమగా చూస్తూ దగ్గరకు తీసుకుని చెప్పాడు.

''తండ్రి మాటతో తల్లినే నరికిన పరశురామా! ఎంతటి క్లిష్టమైనవౖౖెనా సరే. నీక్కావలసిన వరాలు కోరుకో. తప్పక నెరవేరుస్తాను'' అన్నాడు.

అందుకు వినమ్రంగా తండ్రికి నమస్కరిస్తూ ''తండ్రీ! ముందుగా నా తల్లిని బతికించు. ఆపై నేను చేసిన మాతృ హత్యాపాతకం నుంచి నన్ను విముక్తుణ్ని చెయ్యండి. మహా బలపరాక్రమాన్ని, దీర్ఘాయుర్దా యాన్నీ ప్రసాదించండి'' అన్నాడు.

జమదగ్ని కుమారుడు అడిగిన వన్నీ ఆనందంగా ఇచ్చాడు. పరశురాముడు తల్లికీ, తండ్రికీ సాష్టాంగ నమస్కారాలు చేశాడు.

* కార్యవీర్యుని కథ

ఆ కాలంలో హైహయ వంశానికి చెందిన భూపతి కార్తవీర్యుడు అనూప దేశాన్ని పాలిస్తున్నాడు. కార్తవీర్యుడు వెయ్యి చేతులు, అపార పరాక్రమం కలవాడు. మహా వీరాధివీరు నిగా కీర్తిని పొందాడు.

సహస్రబాహుడనే పేరుతో విఖ్యాతి చెందిన కార్యవీర్యుడు ఒకరోజు అరణ్యానికి వేటకోసం వచ్చాడు. అక్కడ అనేక క్రూర మృగాలను వేటాడి బాగా అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు.

చతురంగ బలాలతో వచ్చిన కార్యవీర్యునకు తగిన అతిథి మర్యాదలు చెయ్యాలనుకున్నాడు మహర్షి.

అయితే, జమదగ్ని సేవలను నిర్లక్ష్యంగా అందుకుని ఆశ్రంలో ఉన్న వాళ్లతో అవమానపూరితంగా మాట్లాడాడు.

అయినప్పటికీ జమదగ్ని మహర్షి మారు మాట్లాడకుండా మౌనాన్నే వహించాడు.

మహర్షి మౌనాన్ని అలుసుగా తీసుకుని ఆశ్రమంలో పూలచెట్లను, ఫల వృక్షాలను విచక్షణా రహితంగా నరికే శాడు. నేలమట్టం చేశాడు.

ఆశ్రమవాసులకు, అతిథులకు, యజ్ఞవిధులకు అవసర మయ్యే హోమధేనువునూ, దాని లేగదూడను రాజ్యానికి తరలించమని తన సేనలకు చెప్పాడు.

చేయాల్సిన అనాలోచిత కార్యాలన్నీ ఆశ్రమంలో చేసి అనంతరం తన రాజ్యానికి బయలుదేరాడు కార్యవీర్యుడు.

కార్యవీర్యుడు ఆశ్రమంనుంచి వెళ్లిన కొద్దిసేపటికి ఆశ్రమ అవసరాలకోసం అరణ్యానికి వెళ్లిన పరశురాముడు తిరిగి వచ్చాడు.

ఆశ్రమమంతా అల్లకల్లోలంగా ఉంది. జరిగినదంతా తండ్రి ముఖత: విన్నాడు. కార్యవీర్యుడు తీసుకువెళ్లిన గోమాత గూరించి జమదగ్ని చాలా దు:ఖించాడు.

తండ్రి చెప్పినదంతా విన్న పరశురాముడు మహాగ్నిలా మారాడు. వింటినుంచి వెలువడ్డ బాణంలా కార్తవీర్యుని మీదికి వెళ్లాడు.

వెళ్లడమే తరువాయి కార్త వీర్యుని సైన్యంపై మహా ప్రళయ కాలంలో మేఘంలా శరవృష్టి కురిపించాడు.

పరశురాముని భీకరావేశానికి కార్యవీర్యుని సైన్యం గజగజ వణి కింది. చతురంగసేన ఇష్టమొచ్చిన దిశకు పరుగులు పెట్టింది.

దాంతో మహా ఆవేశంతో కార్తవీర్యుడు తన సహస్ర బాహువులతో పరశురాముని మీదకు వచ్చాడు. మహా దుర్వార శౌర్యంతో వచ్చిన కార్తవీర్యుని వెయ్యి చేతులను తన వాడి బాణాలతో కొట్టాడు పరశురాముడు. ఆ ధాటికి భీకర ఆర్తనాదాలు చేసినా కార్తవీర్యుడు మరింత ఉక్రోషంతో పరశురామునితో తలపడ్డాడు.

పరశురాముడు భయంకర సింహనాదం చేసి గండ్రగొడ్డలితో కార్తవీర్యుని తలను ఖండించాడు. విజయ దరహాసంతో ఎత్తిన గొడ్డలిని దించి ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు.

తమ తండ్రి కార్తవీర్యుడు హతమయ్యాడని తెలుసుకున్న అతని పుత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పగతో రగిలిపోయారు.

పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం కోసం వేచి చూసి సమయం రాగానే మహా బలగాలతో ఆశ్రమం మీదికి విరుచుకుపడ్డారు.

ఆశ్రమవాసులను కఠిన పదజాలంతో దూషించారు. తండ్రి నాశనం చెయ్యగా మిగిలిన వృక్షాలు, చెట్లనూ పెకలించి వేశారు. మూకుమ్మడిగా జమదగ్నిని బంధించారు. ఆ మహర్షి భీతిల్లి పరశురాముడిని ఎలుగెత్తి పిలిచాడు. ఆశ్రమంలోని మునులు శోకిస్తూ మహర్షిని ఏం చెయ్యవద్దని వేడుకో సాగారు.

అయినా విచక్షణా జ్ఞానం కోల్పోయిన కార్తవీర్యుని పుత్రులు కర్కశంగా జమదగ్ని మహర్షిని సంహరించారు.

వచ్చిన పని నెరవేరిందని కార్తవీర్యుని పుత్రులు చల్లగా తమ రాజ్యానికి జారుకున్నారు.

విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఆశ్రమాన్ని పాడు చెయ్యడమే కాకుండా, భర్తను హతమార్చిన రాజబిడ్డల అరాచకత్వాన్ని ఆ సమయంలో ఏమీ చెయ్యలేక మరణిం చిన భర్తతలను ఒడిలో పెట్టుకుని రోదిస్తోంది రేణుక.

ఎక్కడో దూరంగా ఉన్న పరశురామునికి తండ్రి ఆర్త నాదం చెవిన పడింది. అంతే! ఏదో జరిగిందనుకుని హఠాత్తుగా అక్కడినుంచి ఎంతో వేగంతో ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు.

అయితే అప్పటికే జరగాల్సిన బీభత్సమంతా జరిగి పోయింది. తండ్రి దుస్థితి చూసి చలించిపోయాడు. తల్లిని ఓదార్చాడు పరశురాముడు.

జరిగిన ఘోరానికి పరశురామునిలో పౌరుషం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఆ నీచాధములపై ఆగ్రహం జ్వలించింది.

''హైహేయులారా! సకల ప్రాణికోటిని ప్రేమించే ఈ పుణ్యాత్ముని చంపేందుకు మీకు చేతులెలా వచ్చాయి? క్షత్రియ వంశమే అటువంటిది.

ఈ భూమిపై అసలు క్షత్రియ వంశమే ఉండకూడదు. మీ జాతి సమస్తాన్నీ నిర్మూలిస్తాను. ఇదే నా శపథం. నేల నాలుగు మూలలా ఉన్న రాజులందరుకూ ఇక రోజులు మూడినట్టే'' అని గట్టిగా ప్రతిజ్ఞ చేసి గండ్రగొడ్డలిని పైకి ఎత్తి క్షత్రియులపై విరుచుకు పడేందుకు బయలుదేరాడు.

అలా ఆవేశంతో బయలుదేరిన పరశురాముడు దొరికిన క్షత్రియుణ్ని దొరికినట్టుగా సంహరించాడు. పరశురామునికి భయపడి దాక్కున్న వారిని కూడా విడిచిపెట్టకుండా వెతికి మరీ బయటకు లాక్కొచ్చి హతమార్చాడు భార్గవరాముడు.

సమస్త భూమండలాన్నీ తన స్వాధీనం చేసుకున్నాడు. ఆపై అనేక యజ్ఞాలు చేశాడు. ఋత్విజులకు ఇచ్చే సంభావనగా ఐరావతాలు, పుండరీకమూ, వామనమూ, కుముదము, అంజనము, పుష్పదంతమూ, సార్వభౌమమూ, సుప్రతీకాలనే అష్టదిగ్గాలతో మోయబడుతున్న సకల భూమండలాన్నీ కశ్యపునికి దానం చేశాడు.

మనసు వికలమై వైరాగ్యంతో మహేంద్రగిరికి తపస్సుకోసం వెళ్లిపోయాడు.

అదీ ధర్మరాజా పరశురాముని కథ'' అంటూ వివరించాడు ఆకృతవ్రణుడు.

పరశురాముని స్వీయగాథను విన్న ధర్మరాజు పులకరించపోయాడు. ఆపై పరశురాముణ్ని చతుర్దశి నాడు దర్శించి సేవించి ధన్యుడయ్యాడు.

ఆపై దక్షిణదిశగా తన వారితో బయలుదేరి వెళ్లాడు ధర్మరాజు. అలా ఎంతో దూరం పయనించిన అనంతరం త్య్రంబకక్షేత్రాన్ని చేరుకున్నారు వారంతా. తన నీటి ప్రవాహంతో భూమండలాన్ని పునీతం చేసిన గోదావరి నదీమతల్లిని సేవించారంతా. ధర్మరాజు ఆవులను, బంగారాన్నీ విలువైన రతనాలను దానం చేశాడు అక్కడి విప్రులకు.

మరిన్ని దివ్య పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కోరికతో ముందుకు కదిలారు. ద్రవిడ రాజ్యంలోని అగస్త్య తీర్థాన్ని సేవించుకున్నాడు. ఆ పుణ్య తీర్థంలో అర్జునుడు చేసిన వెయ్యి గోవుల దానం గురించి అక్కడి వారివల్ల తెలుసుకుని ధర్మరాజు పరమానందం చెందాడు. సోదరుడైన అర్జునుణ్ని తలచుకుంటూ శూర్పారకమనే తీర్థం చేరుకున్నారు.

శూర్పారక క్షేత్రం వద్ద మహా పర్వతంలా పొడవుగా ఉన్న పరశురాముని వేదికని దర్శించి, అక్కడినుంచి ముందుకు సాగి సాగర తీరంలో ఉన్న దివ్యమైన ప్రభాస తీర్థాన్ని చేరుకున్నారు.

అక్కడ పన్నెండు రోజులపాటు గాలి నీరు ఆహారంగా తీసుకున్న ధర్మరాజు దక్షిణాగ్ని, గార్హపత్యం, ఆవహనీయం, సభ్యం, అవపథ్యం అనే పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు.

ప్రభాస తీర్థం యాదవ రాజ్య పరిధిలోనిది. తమ ప్రాంతానికి పాండవులు వచ్చారని తెలుసుకున్న బలరామ కృష్ణులు, వృష్టి వంశ నాయకులు వచ్చి పాండవులను కలిశారు. ప్రయాణ భారంతో అలసిసొలసి చిక్కిన పాండవులను కుశల ప్రశ్నలను వేశారు.

మహాభరణాలు, పీతాంబరాలతో వెలిగిపోయే పాండవులు జింక చర్మం, నారబట్టలు ధరించి కనపడడంతో మనసులోనే కలత చెందారు.

No comments:

Post a Comment