షష్ఠి పూర్తి (లేక )ఉగ్రరథ శాంతి
మానవుని జీవితములో అనూహ్య సంఘటనలు , అనుకోని పరిణామాలు ఎదురైనపుడు భీతి చేత స్పందించుట అతి సహజము. అట్టి పరిణామములు సంభవించకుండా అనాదిగా ,మానవాళి ఎన్నో ఉపాయములను , పద్దతులను పాటిస్తున్నది. అయితే ఆయా పద్దతులకు శాస్త్ర ప్రమాణము , వేద ప్రమాణము అందినపుడు , వాటి విలువా , ఆచరణా కూడా పెరుగుతాయి.
మానవ జీవితము లో సగము ఆయుర్దాయము గడచు ఘట్టము చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము , మానవుని పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అంతలోపల అన్ని గ్రహముల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. అరవై సంవత్సరాలు నిండేటప్పటికి , జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకే ఆయా గ్రహాలు వచ్చి చేరుతాయి. జాతకుడు పుట్టిన సంవత్సరమే ( నామ సంవత్సరము ) మరలా పునరావృత్తి అవుతుంది. అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరములో పుట్టి ఉంటే , అరవై యేళ్ళు నిండగనే అరవై ఒకటో సంవత్సరం మరలా ’ ప్రభవ ’ యే వస్తుంది. సగము ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఇక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా అనేకులు ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. అదేకాక , ఆసమయములో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలుగవచ్చు. దానితోపాటుగా, ఏ జన్మలో చేసిన పాపపు ఫలము ఆజన్మములోనే తీరునన్న నమ్మకము గలవారు, గడచిన తమ అరవై సంవత్సరాల లో ( అనగా ఆయుర్దాయపు మొదటి ఆవృత్తము ) చేసిన పాప ఫలము రెండవ ఆవృత్తములో తక్కువ కష్టముతోనో , బాధ తెలియకుండానో తీరవలెనన్న, ఆ పాపముల తీవ్రతను శమింపజేయుటకు శంకరుడైన రుద్రుని ఆరాధించుట అవశ్యము. రుద్రుడు సాధారణముగా సర్వులనూ , సర్వమునూ లయము చేయు కార్యములో ఉంటాడు. ఈ రుద్రులు అనేకులు గలరు. ముఖ్యముగా ఏకాదశ రుద్రులు గణ్యులైననూ నూట ఇరవై మంది రుద్రులు ఉంటారు అని కూడా శాస్త్ర వచనము. వందలకొలదీ రుద్రులున్నట్టు కూడా ప్రమాణమున్నది. వీరిలో , అనేకులు సౌమ్యులు , శాంతులు. కొందరు ఉగ్రులు , మరికొందరు రౌద్రులు. ఉగ్రరథుడు అను రుద్రుడు మానవులను అరవైయవ యేట హింసించును. సంసారము నాశనమగుట , ఆయుష్షు తీరిపోవుట , అప మృత్యువు పాలగుట , శరీరము అనారోగ్యము పాలై అవయవములు శిథిలమగుట మొదలగు పరిణామములు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీనిని తప్పించుటకు , ఉగ్రరథుడు అను ఆ రుద్రుని శాంతింపజేయుటయే తరుణోపాయము. ఈ ఉగ్రరథ శాంతినే షష్ట్యబ్ధ పూర్తి లేదా షష్టి పూర్తి అని వ్యవహరిస్తారు.
( షష్టి అంటే అరవై )
జననకాలము నుండీ అరవైయవ సంవత్సరము వచ్చినపుడు , జన్మ నామ సంవత్సరము , జన్మ మాసము , జన్మ నక్షత్రము , జన్మ దినమందు సర్వారిష్ట పరిహారము కోసము అచరించవలసిన శాంతి క్రమమే ఉగ్రరథ శాంతి.
ఈ షష్టి పూర్తిని అనేకులు , షోడశ సంస్కారాలలో ఒకటి అనుకుంటారు. కానీ కాదు, ఇది కేవలము ఒక శాంతి ప్రక్రియ మాత్రమే. అథర్వణ వేదములోను , యజుర్వేద బ్రాహ్మణములోను , ఋగ్వేదములోను ఈ శాంతికి సంబంధించిన కొన్ని మంత్రాలున్నాయి. ఇది కేవలము శాంతి ప్రక్రియ మాత్రమే గనుక , ఇంటిని గోమయముతో అలుక్కోవడమో , గోమూత్రము ప్రోక్షించుకోవడమో , పంచగవ్య ప్రాసనమో చేయవచ్చు. పందిళ్ళ వంటి ఆర్భాటాలు అవసరములేదు. పందిళ్ళు వేయదలుచుకున్నవారు , వాటిని తమకు సౌకర్యముగా వేసుకోవచ్చునే తప్ప , దానికి యే నిబంధనలూ లేవు.
వేదశృతి ప్రకారము , మానవుడి ఆయుర్దాయము ఒక్కొక్క యుగములో ఒక్కో విధము. మొదటిదైన కృతయుగపు మొదటిపాదములో మానవులు వేలకొద్దీ యేళ్ళు జీవించేవారు. రెండో పాదములో ఆయుర్దాయము తక్కువ. ఒక్కో పాదానికీ ఆయుర్దాయం తగ్గుతూ , మనిషికి ఇప్పుడు వందసంవత్సరాలు ఆయుష్షు. అదికూడా పూర్తిగా జీవించలేకపోవుటకు కారణము అనేక జన్మలలో చేసుకున్న పాప ఫలితము అని చెప్పవచ్చును. కృతయుగము నాటి వైశంపాయన మహర్షి , తర్వాత ఎప్పుడో రాబోయే కలియుగపు మానవుల ఆయుర్దాయము తగ్గుటకు చింతిస్తూ , వ్యథ చెందినవాడై , వేద వ్యాస మహర్షిని ఇలాగ ప్రశ్నిస్తాడు.
" ఓ మహర్షీ , దేహమున్న యెడల అన్ని ధర్మములనూ పాటించవచ్చును. మానవుడిగా పుట్టుటయే శరీరము కోసము కదా ! ఆ శరీరము పడిపోయిన , లేదా వ్యాధి గ్రస్తమైనచో కర్మలనెట్లు ఆచరించగలడు ? కాబట్టి కలియుగములో మానవుడు పుత్రపౌత్రులతో సర్వ సంపదలతో కూడి , దుఃఖము లేనివాడై ఉండవలెనన్న , దానికి యే హేతువు కారణమగును ? దానికి యే ధర్మమునాచరించవలెను ? "
వ్యాస మహర్షి , లోక హితమునకై వైసంపాయనులు అడిగిన ప్రశ్నకు హర్షమును పొందినవాడై , ముఖములో ఆ ఆనందము కనపడుచుండగా ఇలా బదులిచ్చినాడు,
" వత్సా , లోకమునకు హితము కలిగించునట్టి , ఆయుర్వృద్ధిని కలిగించునట్టి , దేహపటుత్వమును పెంచునట్టి ఒకానొక రహస్యమైన ప్రక్రియ కలదు. అదే షష్ట్యబ్ధి వ్రతము. కలియుగములో , మానవుడు అరువది యవ సంవత్సరము రాగానే , శ్రద్ధాభక్తులతో ఈ షష్టిపూర్తిని ఆచరించవలెను. వేదవిదులగు బ్రాహ్మణులను పిలిపించి , నదీ తీరమునగానీ , స్వగృహమునగానీ , లేదా తనకనుకూలమైన ఏదైనా ఒక చక్కటి ప్రదేశమున గానీ సంకల్ప పూర్వకముగా స్నానము చేసి , ఈ ప్రక్రియను వేదోక్త విధముగా ఆచరించి పూర్తి చేయవలెను. రాబోవు కాలములలో అనేకులు దీనిని సూత్రములలో వివరింపబోవుచున్నారు. ఆ రీతిన జేసినచో మనుష్యుడు దీర్ఘాయువు కలవాడై , రోగరహితుడై , వంశాభివృద్ధి కలిగి , ఉత్తమ కర్మలను చేయగలడు. "
" దీనిని పూర్వము , నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి చేసినాడు. ఆతడు తన మామగారైన శుక్రుడితో శపింపబడి ముసలివాడైనపుడు , శాప విముక్తికై యయాతి ప్రార్థింపగా , శుక్రుడు , " ఓ రాజా , షష్టి పూర్తి యను ఒక రహస్య వ్రతము కలదు. ఆ వ్రతమును చేసిన , తిరిగి యవ్వనమును పొందగలవు. నీ కుమారులలో ఒకరు తన యవ్వనమును నీకిచ్చిననూ నీకు యవ్వనము కలుగును ." అని పలికెను.
మొదట యయాతి తన కుమారులలో ఒకని యవ్వనమును తీసుకొని తన వార్ధక్యాన్ని అతడికి ఇచ్చినాడు. ఆ తరువాత అది అధర్మమని గుర్తెరిగి , పుత్రుడి యవ్వనమును అతడికే ఇచ్చివేసి , షష్టి పూర్తి వ్రతము చేసి మరలా యవ్వనవంతుడై , భోగభాగ్యాలు అనుభవించి , యజ్ఞయాగాదులు చేసి , చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందినాడు.
ఆపస్తంబ , బోధాయన మరియూ ఇతర గృహ్య సూత్రాలలో షష్టిపూర్తికి సంబంధించిన తంతు క్లుప్తముగా వివరింపబడి ఉంది. అనాదిగా ఈ షష్టి పూర్తిని మనుషులు ఆచరిస్తున్ననూ , దీనికి ఇదమిత్థమని ఒక నిర్దిష్టమైన పద్దతి లేదు. కానీ , షష్టి పూర్తి లో భాగముగా ముఖ్యముగా చేయవలసిన విధానము పురాణములలో లభ్యమగుచున్నది. ఇది ప్రధానముగా మనిషి ఆయురారోగ్యాలకు సంబంధించినది కాబట్టి , రుద్రహోమము , మృత్యుంజయ హోమము , ఆయుష్య హోమము , నవగ్రహ హోమము వంటివి చేయుట అనాదిగా వాడుకలో ఉంది.
కాలము మారుతున్న కొద్దీ ఇందులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆడంబరముగానూ , కొంతమంది వైదీకముగను , మరికొందరు లౌకికముగనూ ఎవరికి తోచినట్లు వారు చేయుచున్నారు. అంతే కాక, దీని చేయించే బ్రాహ్మణుడిపై ఇది ఆధారపడుతున్నది.
ఇక్కడ , షష్టి పూర్తి లోని అంగాలు , అతి ముఖ్యముగా చేయవలసిన తంతు , ఆ తర్వాత వనరులు ఎక్కువగా ఉన్నవారు చేసుకోవాలంటే చేయతగిన అదనపు తంతులు ఇవ్వడ మైనది. అయితే ఈ కాలము వారు చేస్తున్నట్టి ’ దండలు మార్చుకోవడము , మంగళ సూత్రము మరలా కట్టించడము , వివాహము వలెనే చేయు ఇతర తంతులు ఇందులో ఎంతమాత్రమూ భాగం కాదు. అవన్నీ అర్థము లేనివి. అవి చేయాలనుకొనే వారు వాటికి షష్టి పూర్తి అనే పేరు పెట్టకుండా , ఇంకో పేరుతో చేసుకుంటే క్షేమము.
షష్టి పూర్తిలో ముఖ్యమైన విశేషములు --
మగవాడికి అరవైయవ సంవత్సరము రాగానే , దంపతులిద్దరూ కలిసి కూర్చొని ఈ షష్టి పూర్తిని ఆచరించవలెను. ఆడవారికి ప్రత్యేకముగా ఈ ప్రక్రియ లేదు.
ఇందులో భాగముగా ముందురోజు పుణ్యాహవాచనము , లేదా ఉదకశాంతి మంత్రపూర్వకముగా భూభాండ , జల గృహ శుద్ధిని చేసుకోవలెను. ఏకాదశ రుద్రులకు , ఇతర దేవతలకూ కలశములను స్థాపించి ఆవాహన చేసి ,సాయంకాలము మహాన్యాస పూర్వకముగా రుద్ర క్రమార్చన , అభిషేకము చేయవలెను. నవగ్రహ మంత్ర జపము , మృత్యుంజయ మంత్ర జపము వంటి జపములు ముందే చేసి / చేయించి ఉండవలెను. మరునాడు నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మహా మృత్యుంజయ హోమము చేయవలెను.
కలశములను స్థాపించుటలో భిన్నమైన ఆచారములున్నవి.
రుద్రులకు పదకొండు కలశములు అని కొందరూ , అయిదే చాలని కొందరూ అంటారు. మరికొందరు , నవ గ్రహములకు తొమ్మిది , ఉదకశాంతి ప్రయోగమునకు ఒకటి , మృత్యుంజయునికి ఒకటి , మొత్తము పదహారు కలశములు కావలెనంటారు. ( మరికొందరు ఇతర దేవతలను కలుపుకొని అరవై కలశములనీ , మరికొందరు , కాదు , నూట ఇరవై కలశములనీ అంటారు. ) కేవలము అయిదు కలశములతోనే ఈ శాంతి ప్రక్రియ చేసే పద్దతి ఆచరణలో ఉంది. ఇది శాస్త్రామోదమైనది కూడా ! ఇత్తడివి కానీ , దారుపాత్రలు ( చెక్క తో చేసిన కలశములు.) కానీ వాడవలెను. ఇవి ముఖ్యముగా స్థాపించవలసిన కలశాల వివరాలు.
మరి కొందరు , ఏకాదశ రుద్రులకు పదకొండు , నవగ్రహాలకు తొమ్మిది , ద్వాదశాదిత్యులకు పన్నెండు , సంవత్సరానికి ఒకటి మొత్తం ముప్పై మూడు కలశాలు స్థాపిస్తారు. ఇంకా ఆసక్తి ఉన్నవారు అదనంగా మృత్యుంజయుడికి , ఆయుర్దేవతకూ , ఇంకా అనేక ఇతరదేవతలకు మొత్తం అరవై కలశాలు స్థాపిస్తారు. ఎక్కువ కలశాలు స్థాపిస్తే , వాటిని చివరలో బ్రాహ్మణులకే దానము ఇవ్వవలెను కాబట్టి , ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలవడము , వారికి వేరుగా దక్షిణలు కూడా ఇవ్వవలెను కాబట్టి అదనముగా ధనము ఖర్చు అగును. ఎవరి తాహతు , స్తోమత లను బట్టి వారు కలశములను స్థాపించవచ్చు. కేవలము అయిదే కలశములను స్థాపించి , వాటిలోనే అందరు దేవతలనూ ఆవాహన చేయు పద్దతి ఆమోదయోగ్యమైనది కనుక , కలశముల సంఖ్య కేవలము షష్టి పూర్తి జరిపించుకొను యజమాని ఆర్థిక స్తోమత పైన ఆధారపడును. తగిన పురోహితుడు దొరికితే ఇవన్నీ అతడే చెప్పగలడు. ఏదేమైనా , తమ శక్త్యానుసారము చేయుటకు పురోహితుడితో అన్నీ మాట్లాడుకుంటే మంచిది. శక్తి గలవారు ఏ మాత్రమూ లోభము చేయక ఖర్చు పెట్టవలెను. " విత్త శాఠ్యం న కారయేత్ " అని కదా ప్రమాణము ! శక్తి గలవారు లోభము చూపిన , వారికి కలుగు ఫలితములో కూడా లోభమే ఉంటుంది.
ఈ షష్టి పూర్తి యనేది , పిల్లలు తల్లిదండ్రులకు చేయు కార్యక్రమము ( పెళ్ళి వంటిది ) అని అనేకమంది కి ఒక అపోహ ఉన్నది. ఇది ఎంత మాత్రమూ నిజము కాదు. కానీ ఆచరణలో , అప్పటికి పిల్లలు సంపాదనపరులై , తమ తల్లిదండ్రులకోసము ఇటువంటిది చేయాలనుకుంటే అందులో తప్పు లేదు. దానికి పిల్ల సహాయ సహకారాలు ఉంటే మంచిదే.
విధానము
షష్టి పూర్తి విధానము క్లుప్తముగా ఇవ్వడమైనది. దీనిని పురోహితుడే చేయించ వలెను గనక మంత్రముల వంటివి ఇవ్వడము లేదు.
దీనిని రెండురోజులు ఆచరించ వచ్చును. మొదటిరోజు ఉదయమే పుణ్యాహము చేసి , కలశములు స్థాపించి ఉదకశాంతి ప్రయోగము చేయించవలెను. కొందరు " సర్వతో భద్ర మండలమును" నేలపైన వ్రాసి , రంగవల్లులతో అలంకరించి దానిపై కలశములను స్థాపించి సర్వదేవతలనూ ఆవాహన చేస్తారు. ఆనాటి సాయంకాలము ఈశ్వరుడికి మహాన్యాస పూర్వకముగా ఏకవారమో , ఏకాదశ వారమో లేక అతిరుద్రమో చేయించ వలెను. వీలైన వారు క్రమార్చన చేయించవచ్చు. లేదా షోడశోపచార పూజ చేయవచ్చును.
మరునాడు మరలా పుణ్యాహము చేసి , కలశముల పైన ఆయాదేవతా ప్రతిమలను ఉంచి , ( ప్రతిమలు లేకుండా కూడా కలశ పూజ చేయవచ్చును ) నవగ్రహ పూజ , సప్త చిరంజీవుల పూజ , సంవత్సర పూజ , నక్షత్ర పూజ , నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మృతుంజయ హోమము , చేయవలెను. ఇవి కనీసము చేయవలసిన పూజలు. ఇంకా అదనముగా చేయాలంటే ,
కొందరు అరవై సంవత్సరాలకూ ఆవాహన , పూజ , ఉత్తర దక్షిణాయనాలు , ఋతువులు , మాసములు , పక్షములు , వారములు , నక్షత్రములు , యోగములు , పన్నెండు రాశులు , భూమి , ఆకాశము , అశ్వినీ దేవతలు , ధన్వంతరి --ఇలాగ తమకు తోచిన అందరు దేవుళ్ళకూ పూజలు చేస్తారు. వీటి ఆవాహనలో వేద మంత్రాలు లేవు. కేవలము పౌరాణికముగా , అంటే శ్లోకములతో ఆవాహన , పూజ జరిపిస్తారు. ఇవన్నీ శక్తి ఉన్న వారి విషయము. ఇంకా వీలున్నవారు సప్తశతీ పారాయణము , చండీ హోమము , శ్రీరామ పట్టాభిషేకము , భాగవత సప్తాహము , హరికథలు వంటి అనేకమైనవి కూడా చేయిస్తారు. అవి చేయుటలో పుణ్యమే గానీ , తప్పేమీ లేదు. అయితే షష్టి పూర్తికి అవన్నీ అనవసరము.
పూజలు , హోమములు అయిపోయినతరువాత , ఆ కలశములకు , ప్రతిమలకు పునః పూజ చేసి , ఆయా దేవతలను ఉద్వాసన చేయవలెను. హోమకుండముల ( అగ్నికి ) ఉత్తరాన కానీ , ఈశాన్యాన కానీ , స్నానార్థము కల్పించబడిన మంటపములో పుత్ర పౌత్రాదులతోను , భార్యతోను యజమానుని, అలంకరించబడిన పీటలపైన కూర్చోబెట్టవలెను.
తరువాత , స్థాపింపబడిన ఆ కలశములలోని నీటితోనే కర్తకు, అతడి భార్యకు , అవభృథ స్నానము పురోహితులు , బ్రాహ్మణులు చేయించెదరు. ఈ స్నానములో భాగముగా , వంద చిల్లులు కల ఒక పెద్ద ఘటమును ( కుంభమును ) కానీ , చిల్లులు కల జల్లెడ వంటి ఒక పళ్ళెములో కానీ నవరత్నములు వేసి కానీ , లేక , నవరత్నములు తాపడము చేసియున్న పళ్ళెములో గానీ కలశముల నీరు పోస్తూ , యజమానుడి తలపైన పడునట్లు స్నానము చేయించవలెను. నవరత్నములు లేకున్ననూ , కలశముల నీటితో అవభృథ స్నానము చేయించుట ముఖ్యము. ఇది అభిషేకము కాదు. అభిషేక మంత్రములు పఠించరు. కేవలము పౌరాణిక మంత్రాలతో స్నానము చేయిస్తారు. అయితే , మరి కొందరి ప్రకారము , మార్జన మంత్రములు , పవమాన మంత్రములు , నవగ్రహ / లేక దిక్పాలక మంత్రములు , వరుణ మంత్రములు మొదలగు అనేక వేద మంత్రములతో స్నానము చేయిస్తారు. ముఖ్య గమనిక : ఈ స్నానములో రుద్రాధ్యాయము పఠించకూడదు. దీనినే అవభృథ స్నానము అంటారు. తర్వాత కంచు పాత్రలో ఉంచిన దీపములతో నీరాజనం ఇస్తారు. తరువాత మంటపానికి నాలుగు దిక్కులా చిత్రాన్నముతో ( పసుపు కలిపిన అన్నం ) బలి ఇస్తారు. తాము ధరించిన వస్త్రములను ఆచార్యునికి కానీ , మరి ఎవరికైనా కానీ దానము చేయవలెను. తాము కొత్త వస్త్రములు ధరించి , గంధము , కుంకుమ ధరించి , పూలమాల ధరించి , రక్ష స్వీకరించి , ఒక కంచుతో చేసిన నేతి పాత్రలో అలక్ష్మీ పరిహారము కోసము తన ముఖపు ప్రతిబింబమును చూసుకోవలెను. దక్షిణ తామ్బూలాలతో ఆ నేతి పాత్రను బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను.
వీటితో కలిపి , బ్రాహ్మణులకు , మొత్తం పదిరకాల దానాలు ఇవ్వవలెను ( దశ దానములు) . ఈ దానాల ఉద్దేశము , తనకు శేషజీవితములో కష్టనష్టాలు రాకూడదని , అంతేకాక , ఈ ప్రపంచములో మనిషికి ఏదీ తనది కాదు , ఏదీ మిగలదు, ఏదీ వెంటరాదు కాబట్టి తనవంతుగా , తనకు బ్రతుకునిచ్చిన ఈ ప్రపంచానికి ప్రతిగా ఇచ్చుటయే ! అది వానప్రస్థాశ్రమమునకు చేరు వయసు కాబట్టి , ధనలోభము వదలి , తమ సంతతి అభ్యున్నతి కొరకై వీలైనంతగా ఎన్ని దానాలు ఎక్కువగా ఇస్తే , అంత సంపద తన సంతతికీ , తన వారసులకూ వచ్చి చేరుతుంది. దాచిపెట్టుకుంటే దొంగలపాలే కాక, తనకు పుణ్యము రాదు కూడా ! తమ శక్తి సామర్థ్యములను బట్టి కొందరు అతి తక్కువ ఖర్చుతోను , కొందరు ఆడంబరముగానూ జరుపుకుంటారు. ఈ శాంతి వలన అందరికీ సమాన ఫలమే వచ్చును. కానీ లోభము చేస్తే , వచ్చు ఫలము కూడా లోభముగా వస్తుంది. షష్టిపూర్తి వైశిష్ట్యాన్ని నమ్మిన వారు దీన్ని కూడా నమ్మి తీరవలెను.
ముఖ్య ఆచార్యుడికి , గోదానమును ప్రత్యేకముగా , ఈ విధముగా ఇవ్వ వలెను.
ఆచార్యుడిని ఒక పీఠముపైన కూర్చోబెట్టి , గంధపుష్ప తామ్బూల వస్త్రములిచ్చి , వేదబ్రాహ్మణులు మంత్రములు చెప్పుచుండగా , గోవును , దూడను , పాలుపితుకుటకు ఒక కంచుపాత్రనూ దానమివ్వవలెను. ( వీటికి బదులుగా కొంత ధనమునిచ్చుట ఇప్పుడు పరిపాటియైఉన్నది. )
తర్వాత కలశములను దానమీయవలెను.
మొదటగా , ప్రధాన ప్రతిమ , అనగా మృత్యుదేవతా ప్రతిమను , తర్వాత మృత్యుంజయ ప్రతిమను , కలశవస్త్రములతో పాటు ఇవ్వవలెను.
ఆ తరువాత , ఇతర బ్రాహ్మణులను ఒక్కొక్కరిని అదే విధముగా కూర్చోబెట్టి , ఇతర కలశ వస్త్ర ప్రతిమలను దానము చేయవలెను. బ్రాహ్మణులెందరు , కలశములెన్ని , ఎవరికి యే దానము వంటి విషయములను ముందే నిర్ణయించుకోవలెను. ఒకవేళ అనుకున్న వారికన్నా ఎక్కువ మంది బ్రాహ్మణులు వస్తే మిగిలిన వారికి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. అనుకున్న వారికన్నా తక్కువ మంది వస్తే , ధనము మిగిలించుకోక , దానినే అందరికీ ఇవ్వవలెను. లోభము పనికి రాదు. ఈ దానములు ఇచ్చునపుడు , తీసుకొనే బ్రాహ్మణుడు కాక మిగిలిన వారు ఆయా మంత్రాలను పలుకుతుంటారు.
ఇది అయిన తర్వాత , పదిరకాల దానములను ( దశ దానములు ) ఇవ్వవలెను.
దశదానాలు ఏవనగా ,
నల్ల నువ్వులు / లేక నువ్వుల నూనె ,
గోఘృతము ( ఆవు నెయ్యి )
భూదానము ( దానికి బదులుగా కొంత ధనము )
గోదానము ( దానికి బదులుగా కొంత ధనము )--( ఇది ముందే ఇచ్చాము )
హిరణ్య ( బంగారం ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
రజత ( వెండి ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
గుడ దానము ( బెల్లము )
వస్త్ర దానము
లవణ దానము
కంబళి దానము
ప్రత్తి దానము
పై పదీ కాక , అయః ఖండదానము ( ఇనప గుండు ) దానము ఇస్తారు.
నువ్వుల నూనెను ఒక కుండలోను , ఉప్పు , ప్రత్తి , బెల్లము వంటివి దోసిలి పట్టే అంత ఇస్తారు. ఇనప గుండు , కనీసము ఇరవైనాలుగు పలముల బరువు ఉండవలెను. ఈ దానాలన్నీ కూడా మంత్ర పూర్వకముగా ఇవ్వవలెను.
దానముల తరువాత మరలా స్నానము చేసి , వేరే వస్త్రములు ధరించవలెను.
ఆ తరువాత వీలైనంతమంది ఎక్కువ బ్రాహ్మణులకు , బంధువులకు భోజనాలు , మిగిలిన బ్రాహ్మణులకు దక్షిణలు ,తర్వాత కానుకలు ఇచ్చుట , వగైరాలు చేయవచ్చును. తరువాత , బ్రాహ్మణాశీర్వాదము పొందవలెను. ఆ తరువాత దగ్గరి బంధువులతో కలసి తాను భోజనము చేయవలెను.
|| శుభం భూయాత్ ||
No comments:
Post a Comment