Kotappakonda Thrikoteswara Aalayam
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర ఆలయం
कोटप्पकॊंड त्रिकोटेश्वरालयं
కోటప్పకొండ పుణ్యక్షేత్రం గుంటూరుజిల్లా నరసరావుపేట మండలం లో నరసరావుపేట కు 14 కిలోమీటర్ల దూరం లో ఉంది. దక్షిణకాశి గా ప్రసిద్ధి కెక్కిన ఈ కోటప్పకొండ పైన మహా దేవుడు శ్రీమత్త్రికోటేశ్వరస్వామి గా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దక్షాధ్వర విధ్వంసానంతరం శంకరుడు బ్రహ్మచారిగా మేథాదక్షిణామూర్తి రూపం తో దేవతలకు, మహర్షులకు బ్రహ్మోపదేశంచేసిన పుణ్య ప్రదేశమిది. బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు త్రికూటాలుగా వెలసిన దివ్యక్షేత్రం యిది.
ఘాటు రోడ్డు లోని తోరణ ద్వారం
సర్వసంపదలను, మనశ్శాంతిని, సంతానాన్ని అనుగ్రహించే ఆదిదేవుడిగా త్రికోటేశ్వరస్వామి భక్తుల పూజలందుకుంటున్నాడు.పిలిచిన పలికే ప్రసన్నకోటేశ్వరునిగా, భక్తులకు వరాలనిచ్చే ఎల్లమంద కోటేశ్వరుని గా, కష్టాలను కడదేర్చేకావూరు త్రికోటేశ్వరునిగా, ఆపదలో ఆదుకో కోటయ్య గా, సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే సంతాన కోటేశ్వరుని గా భక్తులు సేవించుకుంటున్నారు.
ప్రధాన ఆలయ దృశ్యం
పవిత్ర కృష్ణానదీ తీర దక్షిణ భాగం లో గుంటూరుజిల్లా నరసరావుపేట మండలం లో ఎల్లమంద, కొండకావూరు గ్రామాల మథ్య గల పర్వత శ్రేష్ఠమే త్రికూటాద్రి. దీనినే కోటప్పకొండ అని పిలుస్తున్నారు. సుమారు 1587 అడుగుల ఎత్తు,1500 ఎకరాల వైశాల్యం తో ,8మైళ్ళ చుట్టుకొలత కలిగిన దివ్యధామం ఈ కోటప్పకొండ. ఆలయం లోని శాసనాల ప్రకారం క్రీ.శ . 1 వ శతాబ్దం నాటికే ఈ ఆలయం ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తోంది.
రాజగోపురం
ఈ పర్వతం ఎటువైపు నుండి చూచినా మూడు శిఖరాలుగా కనిపిస్తుంది. సృష్టి,స్థితి,లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేర ఈ శిఖరాలు పిలువబడుతున్నాయి. త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమే దీనిపై వెలసిన త్రికూటేశ్వరస్వామి.
రుద్రశిఖరం. ;--- దక్షయజ్ఞ విథ్వంసానంతరం లయ కారకుడైన మహాశివుడు శాంతివహించి యోగనిష్ఠ తో 12 సం.ల వటువుగా శ్రీ మేథా దక్షిణామూర్తియై సకలదేవతలతో త్రికూటాద్రి పై రుద్రశిఖరం మీద వెలిశాడు. రుద్రశిఖరం మీద బిల్వవనంలో మహాదేవుడు దక్షిణామూర్తి రూపం తో బ్రహ్మాసనస్థితుడై,విష్ణ్వాది సకలదేవతలకు,సనకసనందనాది మహర్షులకు, నారదాది దేవర్షులకు బ్రహ్మోపదేశమిచ్చిన పరమ పుణ్యథామమే ప్రాచీన కోటేశ్వరాలయం. దీనినే పాత కోటప్పగుడి అని కూడ పిలుస్తారు.
విష్ణుశిఖరం. :--- రుద్రశిఖరానికి ఈశాన్య భాగంలో మరొక శిఖరముంది. దీనినే విష్ణు శిఖరమని లేక గద్దలబోడు అని పిలుస్తారు. దక్షాధ్వర వేళ శివరహితం గా తాము భుజించిన హవిర్భాగ దోషనివారణార్థం ఇంద్రాది దేవతలతో కూడి శ్రీ మహావిష్ణువు పరమేశ్వర సాక్షాత్కారానికి తపస్సు చేసిన ప్రదేశమిది. శ్రీమహావిష్ణువు యొక్క కోరికను మన్నించి ప్రత్యక్షమైన సదాశివుడు తన త్రిశూలం తో కొండపై గుచ్చి పాపవినాశన తీర్థాన్ని సృష్టించి. లింగరూపథారియై వెలిశాడు. ఈ తీర్థం లో గ్రుంకులిడి, నన్ను సేవించిన మీ పాపములు నశించునని వరమిచ్చాడు. ఇంద్రాది దేవతలు ఈ తీర్థం లో మునిగి పాపవినాశనులైరి. అందువలన దీనికి పాపవినాశ తీర్థమని, ఈ క్షేత్రానికి పాపవినాశ క్షేత్రమని, ఈ లింగానికి పాపవినాశ లింగమని పేరువచ్చింది. భక్తులు మొదటగా ఈ పుష్కరిణి లో స్నానంచేసి, ఈ పాపపవినాశన లింగాన్ని పూజించిన పిదప కోటేశ్వరుని దర్శనానికి వెళ్ళడం ఆచారం గా ఉంది. కార్తీక, మఘ మాసాల్లో పాపవినాశనం లో స్నానం చేసి, లింగార్చన చేసిన వారికి భోగ మోక్షాలు లభిస్తాయని స్థలపురాణం చెపుతోంది.
బ్రహ్మశిఖరం . :--- రుద్రశిఖరానికి నైరుతిదశలో బ్రహ్మశిఖరం ఉంది .రుద్ర,విష్ణు శిఖరాల పై పూజనీయ లింగరూపులుండి , తన శిఖరం పై లింగము లేకపోవుటకు విచారించిన బ్రహ్మ శంకరుని గురించి తపస్సు చేయగా వెలసిన లింగమే ఇప్పుడు పూజలందుకుంటున్న త్రికూటేశ్వర లింగం. దీనినే నూతనకోటేశ్వరక్షేత్రం గా ఆరాథిస్తున్నారు.
అనగా మథ్యశిఖరం లో ప్రాచీన కోటేశ్వర లింగం ఉంది. నూతన కోటేశ్వరాలయ దక్షిణభాగం లో గణపతి ఆలయం,పశ్చిమం లో సాలంకేశ్వరాలయం, ఉత్తరభాగాన సంతానకోటేశ్వర లింగం, ఎడమభాగాన బిల్వవృక్షం క్రింద మార్కండేశ్వరలింగం, తూర్పు మండపం లో నందీశ్వరుడు మనకు దర్శనమిస్తారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం ప్రారంభం లోనే మల్లిఖార్జున లింగం ఉంది .ఇచ్చట భక్తులు స్వామికి తలనీలాలను సమర్పిస్తారు. దీనినే బొచ్చుకోటయ్య గుడి అని పిలుస్తారు. ఇక్కడే భువనేశ్వరీ సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయం కూడ ఉంది.
ఆలయ ముఖమండపము
ఓంకారనది. :---- ఈ పేరును మనం చేజర్ల వృత్తాంతం చదివేటప్పుడు చెప్పుకున్నాం. ఈ త్రికూటాద్రి కి దక్షిణాన ఓంకారనది లేక ఓగేరు ప్రవహిస్తోంది.చేజర్ల లో శిబి చక్రవర్తి లింగైక్యం చెందిన పిదప కపోతేశ్వర లింగానికి దేవతాదులు ఓంకారం తో అభిషేకించిన జలం ఓంకారనది గా ప్రభవిల్లి, కోటప్పకొండ సమీపం లో ప్రవహించి, సముద్రంలో కలుస్తోంది.
సాలంకేశ్వరస్వామి. :--- సాలంకయ్య వీరశైవభక్తుడు. ఎల్లమంద గ్రామ నివాసి,లింగ బలిజ కులస్థుడు.ఇతనికి ముగ్గురు సోదరులు. ప్రతిరోజు అడవి కెళ్లి,కట్టెలు కొట్టి తెచ్చి, వాటిని అమ్ముకొని జీవిస్తూ, సదా జంగమార్చన చేస్తుండేవాడు. ఒకరోజు పూజాపుష్పాల కోసం తమ్ములతో కలసి విష్ణుశిఖరానికి వెళ్లాడు సాలంకయ్య. ఆనాడు మిన్నువిరిగి మీద పడినంతగా భయంకరమైన వర్షం కురవడంతో ప్రాణభయం తో సాలంకయ్య తమ్ములతో కలసి ఒకగుహ లో తలదాచుకున్నాడు. వర్షం వెలసిన తర్వాత వెలుపలికి వచ్చిన సాలంకయ్య కు ఒక కొండ గుండు మీద ఒక ధనం బిందె కన్పించింది. అది కోటేశ్వరుని అనుగ్రహమేనని భావించి దాన్ని స్వీకరించాడు.
రాజగోపుర దృశ్యం
ఒకనాడు యథావిథి గా రుద్రశిఖరం పై నున్న శివుని పూజిస్తున్న సాలంకయ్య కు ఒక జంగమయ్య ప్రత్యక్ష మయ్యాడు. ఆయనను పరమశివుడు గా ఆరాథించిన సాలంకయ్య తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన జంగమయ్య సాలంకయ్య ఇంటికి చేరాడు. క్షీరాదులు మాత్రమే సేవిస్తూ,కొన్నాళ్లు గడిపిన ఆ జంగమదేవుడు ఒకరోజున కనిపించకుండా అదృశ్యమయ్యాడు.
శ్రీ సాలంకేశ్వర లింగం
అదృశ్యమైన జంగమయ్య కోసం బెంగపడి, నిరాహారుడై కొండలు కోనలు వెతకసాగాడు సాలంకయ్య.చివరకు బ్రహ్మశిఖరం పై నున్న ఒకగుహ లో ఒక తేజోరూపుడు దర్శనమిచ్చాడు. తాను పరమశివుడనని, ఆనాడు జంగమయ్య గా సాలంకయ్య ఇంట విందారగించింది తానే నని,రుద్రశిఖరం మీద గొల్లభామ కు దర్శనమిచ్చి శివైక్యసంథానం చేశానని చెప్పాడు.
శ్రీ త్రికోటేశ్వరుని దివ్యరూపం ముఖమండపం లోని నంది
తాను రుద్రశిఖరం పై ఉండదలచాను.కాబట్టి అక్కడ గుడి కట్టించి, త్రికోటేశ్సరునిగా నన్ను సేవించి, అచిర కాలం లో శివైక్యం పొందగలవని వరమిచ్చాడు. అంతేకాకుండా గొల్లభామ ను దర్శించిన తరువాతే భక్తులు తనను దర్శించాలని, ఒక దేవాలయాన్ని నిర్మించి, అందులో గొల్లభామ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజించమని ఆనతిచ్చాడు. సాలంకయ్య కు శివైక్య సంథానస్థితి నుపదేశించి అదృశ్యమయ్యాడు జంగమయ్య.
ప్రధాన ఆలయం లోకి వెళ్లే మెట్ల మార్గం
సాలంకయ్య ఆ జంగమయ్య ఆదేశానుసారం గుడి కట్టించి.కోటేశ్వరుని ప్రతిష్ఠించి, గొల్లభామ కు వేరుగా కట్టించి పూజించసాగాడు. మిగిలిన శివక్షేత్రాల్లో కళ్యాణోత్సవాలు నిర్వహించడం చూసిన సాలంకయ్య తన స్వామికి కూడ కళ్యాణోత్సవాలు జరపాలనే కోరికతో త్రికూటేశ్వర ఆలయానికి దక్షిణం గా ఒక ఆలయాన్ని కట్టించి. అందులో పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ప్రయత్నం చేశాడు. కాని ఆకాశవాణి సాలంకయ్యా ఈ క్షేత్రం బ్రహ్మచారి యైన దక్షిణామూర్తి వెలసిన ప్రదేశం. కళ్యాణం చేయకూడదని ఆజ్ఞాపించింది. అంతలోనే ఆ పార్వతీ దేవి విగ్రహం అదృశ్యమైంది. విరక్తుడైన సాలంకయ్య శివైక్యసంథానం చేశాడు. అతని తమ్ములు కూడ ఆతని మార్గం లోనే లింగైక్యం పొందారు. అందరూ లింగస్వరూపులై, బ్రహ్మ , విష్ణు , మహేశ్వర లింగాలుగా, సాలంకయ్య సాలంకేశ్వరుడు గాను, సాలంకయ్య ప్రతిష్ఠిత లింగం త్రికోటేశ్వరుడను పేరుతో బ్రహ్మ క్షేత్రాన వెలసి ఈ క్షేత్రం పంచబ్రహ్మస్థానం గా పరిఢవిల్లుతోంది.
ఆనందవల్లి అనెడి గొల్లభామ.:--- త్రికూటాద్రి కి దక్షిణం గా కొండకావూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరిలోని సునందుడు, కుందరి అను యాదవ దంపతుల ముద్దుబిడ్డ ఆనందవల్లి. పుట్టిన నాటి నుండి ఆనందవల్లి శివభక్తురాలై, శివలీలావిశేషాలను వింటూ, వానిని తలచుకొని మరల మరల తలచుకొని మురిసి పోతూ, విభూతి రుద్రాక్షలను థరించి, తోటివారికి ఆథ్యాత్మిక తత్త్వాన్ని ఉపదేశిస్తూ ఉండేది.
ఆనందవల్లి ఆలయం
మహాశివరాత్రి వచ్చిందంటే ఓంకారనది లో స్నానంచేసి,రుద్రశిఖరం పైన వెలసిన త్రికూటేశ్వరుని అభిషేకించి ,అర్చించి, బిల్వవృక్షం క్రింద తపోనిష్ఠ లో నున్న జంగమయ్య పూజించి, ఆవుపాలను ఆరగింపచేసి, భుక్తశేషాన్నిసేవిస్తూ, శివనామస్మరణతో కాలం గడుపుతూ ఉండేది. సాలంకయ్య ఆతిథ్యాన్ని స్వీకరించిన జంగమయ్య హఠాత్తు గా అదృశ్యమవడం తో ఆయనను వెతుకుతూ వచ్చిన సాలంకయ్య తన విన్నపాన్నిజంగమయ్య కు వినిపించమని గొల్లభామ ను కోరాడు.సాలంకయ్య విన్నపాన్ని జంగమయ్య కు చెప్పడానికి సమయం దొరకడం లేదు గొల్లభామ కు.
ఆనందవల్లి దివ్య మంగళ విగ్రహం.
ఇంతలో గ్రీష్మం వచ్చింది. ఎండలు పెరిగాయి. అయినా ఆనందవల్లి పాపవినాశన తీర్థాభిషేకాన్ని, క్షీరనివేదనాన్ని ఏమరక చేస్తుండేది. ఒకరోజున శ్రమపడి,జంగమయ్య ను చేరి క్షీరపాత్రను అక్కడుంచి, బిల్వపత్రాల కోసం వెళ్లగా, ఇంతలో ఒక కాకి వచ్చి క్షీర పాత్ర ను ఒలకపోసింది. కోపించిన ఆనందవల్లి ఈ రోజుతో ఇక్కడకు కాకులుల రాకుండు గాక అని శపించింది. అందుకే ఈనాటికి కోటప్పకొండ మీద కాకులు కనపడవు కాని కోతులు మాత్రం ఎక్కువ గానే ఉంటాయి.
ఆ బాలిక తనకోసం పడుతున్న శ్రమను చూసి జాలి పడిన జంగమయ్య ఆమెను వారింప ప్రయత్నించాడు. బ్రహ్మోపదేశం చేస్తేనైనా సుకం గా ఉంటుందని భావించి బ్రహ్మోపదేశం చేశాడు. కాని ఆ బాలిక గురువుని విడుచుట దోషమని ఇంతకు ముందుకంటే రెట్టింపు కార్యదీక్ష తో సేవించసాగింది. ఆమెను పరీక్షించదలచిన జంగమయ్య యోగమాయ చే ఆనందవల్లి కి గర్భాన్ని కలిగించాడు. గర్భభారాన్ని వహిస్తూ కూడ కొండ ఎక్కుతూ, దిగుతూ తన వ్రతాన్ని సాగిస్తున్న ఆనందవల్లిని చూచి తల్లీ. నీవేల శ్రమించెదవు నేనే వెంట నీ యింటికి వస్తాను. నీవు వెను తిరిగి చూడకుండా నడవమన్నాడు. గర్భభారాలసయైన ఆనందవల్లి ముందు, ఆమె వెనుక దివ్యపురుషుడైన జంగమయ్య రుద్రశిఖరం నుండి బయలుదేరారు. వారి ప్రయాణం మొదలైంది.
ఇంతలో ప్రళయకాల మేఘ గర్జన వంటి భయంకర శబ్దాలు వినబడసాగాయి. ఆస్చర్య తో ఆనందవల్లి వెనక్కి తిరిగి చూసింది. తల్లీ. నీవు వ్రతం తప్పావు. నేను నీతో రాను. ఇక్కడే సమాథినిష్టుడనౌతానని బ్రహ్మశిఖరాన్ని అథిష్ఠించాడు. అదే నేటి త్రికూటేశ్వర దివ్యలింగం. వ్రతభంగానికి చింతించిన గొల్లభామ, అనంతరం ఇదం తా జంగమయ్య మాయ యని తెలుసుకొని ఆనందించి, ఆ స్వామి అనుగ్రహం తోనే లింగైక్యాన్ని పొందింది. ఆ ఆనందవల్లి యే నేడు గొల్లభామ పేరు కోటప్పకొండ పైన ప్రథమ దర్శభాగ్యాన్ని పొందుతోంది. తొలుత ఈమెను చూసిన తరువాతే భక్తులు త్రికూటేశ్వర దర్శనానికి వెళతారు.
కోటప్ప కొండ సుందరదృశ్యం
శాసనాలు.;---- కోటప్పకొండ క్రీ.శ 1000 పూర్వమే ప్రసిద్ది కెక్కినట్లు ఆలయం లోని దాన శాసనాల వలన తెలుస్తోంది.దక్షిణ భారత శాసన సంపుటి 0.4 లో 915 నుండి 925 వరకు కోటప్పకొండ శాసనాలున్నట్లు పరిశోధకులు వ్రాస్తున్నారు. క్రీ.శ 6 ,7 శతాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనందగోత్రజులు, విష్ణుకుండినులు త్రికూటాథిపతులుగా కీర్తించబడ్డారు. ఇచ్చటి ఆలయశాసనాల్లో వెలనాటి గొంకరాజు, చాళుక్యభీమనాథుడు, కుళోత్తుంగ చోళుడు, వెలనాటి రాజేంద్రుడు మొదలైన వారి పేర్లు కన్పిస్తున్నాయి.
శాసన ప్రతి
ఉత్సవాలు . :-- కోటప్పకొండ తిరునాళ్లు అంటే గుర్తుకొచ్చేవి ప్రభలు. శివారాథనకు అరవై, డెభై కిలోమీటర్ల దూరం నుంచి లక్షలాదిమంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 40 నుండి 100 అడుగుల ఎత్తువరకు ఉండే ప్రభలను విద్యుద్దీపాలతో అలంకరించుకొని రావడం ప్రత్యేకత. కోటి పైన ఒక్క ప్రభ వచ్చినా తాను కొండ దిగి వస్తానని కోటప్ప చెప్పాడని భక్తులు చెపుతుంటారు. మహా శివరాత్రి వేడుకలతో పాటు ప్రతి సంవత్సరం కార్తీక ,మార్గశిర మాసాల్లో భక్తులు సామూహికం గా బిల్వార్చన, మహారుద్రాభిషేకం, రుద్రయాగం మొదలైనవి విశేషంగా నిర్వహిస్తారు.
ఆలయ విశిష్ఠత.;--- భక్తులు తలనీలాలు సమర్పించడం, గిరి ప్రదక్షిణం చేయడం, మెట్లపూజ, ప్రభల మొక్కుబడులు ఇక్కడ ప్రత్యేకతలు. ఈ ఆలయానికి థ్వజస్థంభం లేదు. బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం కావడం వలన కళ్యాణోత్సవం ఉండదు .
కొండ పైన తోరణద్వారం
ప్రయాణం .:----- కోటప్పకొండ కు నర్సరావుపేట నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. ఆటోలు తిరుగుతుంటాయి. కొండ పైకి మెట్ల మార్గమే కాకుండా ఘాట్రోడ్డు సౌకర్యం కూడ ఉంది. కొండమీద హోటల్లో టీ, టిఫిన్లు లభిస్తాయి.

No comments:
Post a Comment