గుండె ఎలా కొట్టుకుంటుంది.
భయం కలిగినప్పుడు దాని వేగం ఎందుకు పెరుగుతుంది? గుండె అనేది ఒక పంపులాంటిది. గుండె శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. దానివల్ల జీవించి వుండగలుగుతాము. ప్రతి ఒక్క కదలికకు సుమారు వంద క్యూబిక్ సెంటీమీటర్ల రక్తాన్ని బయటకు పంపుతుంది. ఒక్కరోజుకు సుమారు 10,000 లీటర్ల రక్తాన్ని రక్తనాళికల ద్వారా వంపుతుంది. మామూలు జీవిత కాలంలో సుమారు 250,000,000 లీటర్ల రక్తాన్ని వంపు చేస్తుంది. 8/10 సెకనుల కొకసారి గుండె కొట్టుకుంటుంది. ఒకరోజులో గుండె సుమారు ఒక లక్షసార్లు కొట్టుకోవడం, అన్నేసార్లు నిలిచివుండటం జరుగుతుంది. దినంలో అది సుమారు ఆరు గంటలు పనిచేయకుండా వూరికే వుంటుంది. గుండె చప్పుడంటే గుండె సంకోచ వ్యాకోచాలకు గురి కావటం అని అర్థం. గుండె సంకోచించి నప్పుడు రక్తాన్ని బయటకు పంపుతుంది. వ్యాకోచించినప్పుడు కొత్త రక్తం లోనికొస్తుంది. ఈ కొట్టుకోవడం దీనికెలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగానే వుండిపోయింది. కోడిగుడ్డును తీసుకుని దాన్ని ఇరవై ఆరుగంటలు ఇంకుటేట్ చేసి, తెరిచి, పరీక్షిస్తే, వాటిలో కోడిపిల్ల గుండెకు సంబంధించిన కణాలుకొట్టుకోవడం గమనించవచ్చు. గుండెగా తయారుకాకమునుపే ఈ కొట్టుకునే గుణం దానికి వచ్చింది. గుండెకు సంకోచమనే అభిలక్షణం అనుకోకుండానే వచ్చిందంటారు. శరీర జీవన విధానంలో ఇదో ప్రత్యేక రహస్యం. అది ఇంకా ఎవ్వరికీ అంతుబట్టలేదు.
మామూలుగా గుండె పెద్దవారిలో 70-72సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. ఆడవారిలో 78-82, పిల్లలలో 90సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. గుండె పేస్‌మేకర్ వల్ల గుండె ఈ విధంగా కొట్టు కుంటుంది. భయపడినపుడు, ఆపద వచ్చినపుడు 140సార్లు నిమిషంలో కొట్టుకుంటుంది. ఈ సందర్భంలో శరీరంలోని ఎడ్రినల్ గ్లాండు ఎడ్రినలైన్ అనే హార్మోనును రక్తంలోనికి పంపుతుంది. దీని వల్ల గుండె కొట్టుకోవడం ఎక్కువౌతుంది. రక్తపీడనం కూడా పెరుగుతుంది. సహజసిద్ధంగా వీటిని తట్టుకునేగుణం గుండెకు వుంది. దానివల్ల మనిషికి అపాయం జరుగకుండా వుంది.
No comments:
Post a Comment