WORLD FLAG COUNTER

Flag Counter

Sunday, 4 September 2016

HEALTH IMPORTANCE OF VINAYAKA CHAVITHI FESTIVAL PUJA PATHRI - 21 MEDICINAL PLANTS


వినాయక పూజ లో ఉపయోగించే పత్రీ వల్ల ఉపయోగాలు ...

నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.

1. మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.
3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
4. దూర్వాయుగ్మం(గరిక) :- ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.
5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.

6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.
7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :- ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
9. చూత పత్రం( మామిడాకు) :- ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.
10. కరవీర పత్రం( గన్నేరు) :- ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.

11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :- ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది.
12. దాడిమీ పత్రం(దానిమ్మ) :- ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
13. దేవదారు పత్రం(దేవదారు) :- ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక పత్రం(మరువం) :- ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.
15. సింధూర పత్రం( వావిలి) :- ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :- ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది.
20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :- ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Friday, 2 September 2016

TREES - GODS - PUJA - IMPORTANCE OF TREES IN HUMAN LIFE



వృక్ష దేవతలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.

నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి

తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది


యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం


మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి

దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:


ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప

వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.


మారేడు

మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.

ఆ శ్లోకం

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌


మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.
జమ్మి

జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది

శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని


శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.

ఉసిరి

ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.


మేడి

మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనది కాక మరేమవుతుంది. అది దేవతా వృక్షమే. ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.


మర్రి

మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.


అశోక

ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షం ఒకటి. పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది. ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది. హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను, ముంబై పశ్చిమ తీర ప్రంతంలోనూ ఇది కనిపిస్తుం ది.అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అనేఅర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.


మామిడి

మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.


కొబ్బరి

కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు. అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.


అరటి

అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.


చందనం

చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో దానిని ఇచ్చే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.


వెదురు

దేవునికి చెందిదేదైనా పవిత్రమైనదనే భావంతో కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా దేవతా వృక్షంగా భావిస్తుంటారు. హిందీలో బన్సూరి అంటే వేణువు. కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.


BIRTH STORY OF LORD VIGNESWARA IN TELUGU ON THE EVE OF GANESH CHATHURDHI FESTIVAL 05-09-2016


వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది.

విఘ్నేశ్వరుని కథ

సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.

కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లు గా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని' వేడు కొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థం.

వినాయక జననము :

కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.

కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.