WORLD FLAG COUNTER

Flag Counter

Sunday, 20 December 2015

BRIEF INFORMATION ABOUT RANAMANDALA VEERANJANEYA SWAMY TEMPLE ALSO KNOWN AS YADAVAGIRI - ADONI - INDIA


రణమండల వీరాంజనేయస్వామి ఆలయం విశిష్టత

మనరాష్ట్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలలో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. చాలామంది, యాదాద్రి, యాదవగిరి అని పిలువబడే ఆ క్షేత్రాన్ని గురించి తెలియకపోవచ్చు. కానీ 'ఆదోని శ్రీ వీరాంజినేయభైరవదేవస్వామి ఆలయం' అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్టణంలో రెండు కొండలపైన వున్న ఈ పుణ్యస్థలం నిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతూంటుంది. ఆ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూంటారు.

విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని, ఆరోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని పిలువబడుతుండేది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. ఆయన కాలంలోనే ఆదోని కోట బాగా అభివృద్ధి చేయబడిందని అంటారు. అనంతరం మొగలాయిల పరిపాలనలో, ఆ తదనంతరం నిజాము నవాబుల పరిపాలనలో నున్న ఆదోని...ఈవిధంగా చారిత్రాత్మకంగా ఎంతో ఘనచరిత్రను కలిగి వుందని తెలుస్తోంది.
సిద్ధిమసూద్ ఖాన్ కాలంలో ఆదోని కళల కాణాచిగా ఖ్యాతికెక్కింది. నవాబు సిద్ది మసూద్ ఖాన్ అన్ని మతాలను సమానముగా ఆదరించేవాడు. ఆవిధంగా నవాబుకు రాఘవేంద్రులు అంటే అమితమైన భక్తి ఏర్పడింది. రాఘవేంద్రులు మహాసమాధిని పొందబోతోన్న తరుణంలో తన కోసం మంచాలా గ్రామాన్ని (ప్రస్తుత మంత్రాలయం) దానం చేయమని అడగడమే ఆలస్యం, నవాబు ఆ గ్రామాన్ని ఇచ్చేసాడు. తానొక ముస్లిం అయినందున హిందూమందిరంలోకి అనుమతి లభించదు. ఈ వేదన కూడా నవాబును పట్టి పీడిస్తున్న విషయాన్ని గ్రహించిన రాఘవేంద్రులు, తాము మహాసమాధి అయిన తర్వాత నిర్మించే బృందావనం వంటి దానిని మందిరం పైనే నిర్మిస్తే, నవాబు మహాసమాధిని చూసినట్లవుతుందని చెప్పగా ఆయన శిష్యులు అలాగే నిర్మించారు. ఇప్పటికీ ఆ కట్టడాన్ని మంత్రాలయంలో దర్శించుకోగలము.
ఈ విధంగా హిందూ ముస్లింల సఖ్యతకు ఆదోని ప్రాంతం ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. నవాబు సిద్ధిమసూద్ ఖాన్ ఎన్నో హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు. రాఘవేంద్రుల వారి పూర్వావతారం అని చెప్పబడుతోన్న శ్రీగురువ్యాసరాయలు ఇక్కడ వశించారని, ఆయన తమ అమృతహస్తాలతో స్వయంభూమూర్తియైన శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి వారికి శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించునట్లుగా ఆధారాలున్నాయి.
అదేవిధంగా భక్త ప్రహ్లాదుని మునిమనుమడు, సాటిలేని దాతగా ఎనలేని కీర్తిప్రతిష్టలనందిన బలి చక్రవర్తికి ఈ పుణ్యప్రాంతంతో సంబంధం ఉందన్నది భక్తజనుల విశ్వాసం. ఒకే కొండపై మూడు కొండశిఖరాలు నెలకొని ఉండటం, ఆ మూడు శిఖరాలపై మూడు ప్రసిద్ధ దేవాలయాలు నెలకొని ఉండటం ఇక్కడి విశేషం. శ్రీరణమండల వీరాంజనేయ ఆలయం, శ్రీవామనతీర్థుల బృందావనం, శివమారుతీ ఆలయం అంటూ ఈ మూడు ఆలయాలు ఆదోని ఆథ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి. 'రణమండల' ఆంజనేయస్వామికి ఈ పేరు రావడం వెనుక ఓ ఉదంతం పెర్కొనబడుతోంది. పూర్వం ఈ ఆంజనేయునికి 'భైరవదేవుడు' అనే పేరు ఉండేదట. అయితే విజయనగర సామ్రాజ్యంలోని వీరభటులు ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరే వేళల్లో "శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి" అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళేవారని నాటి శాసనాల ద్వారాట తెలుస్తోంది.
కొండపైనున్న శ్రీరణమండల వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు సుమారు 600 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లెక్కుతున్నప్పుడు శివలింగానికి ప్రక్కనే నందీశ్వరుని దర్శించుకోగలం. అలా మెట్లెక్కుతూ ఇంకొంచెం దూరం పైకెలితే, ఓ చిన్న ఆలయంలో సంతాన ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు.
ఈ స్వామిని మ్రొక్కుకుంటే సంతానప్రాప్తి లేనివారికి సంతానం కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. ఇంకొంచెము ముందుకు వెళితే ఇటీవలే ప్రతిష్టించబడిన వినాయకుని విగ్రహాన్ని చూడగలం. విఘ్నవినాయకుని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళితే 'శ్రీరణమండల వీరాంజనేయస్వామి' వారి దివ్యదర్శనం లభిస్తుంది. అభయహస్తంతో భక్తులను దీవిస్తోన్న స్వామివారు సింధూరవర్ణంతో మెరిసిపోతూంటారు. స్వామి తులసి, తమలపాకు మాలలను ధరించి ఉత్తరదిశవైపు ముఖం చేసి తూర్పుదిక్కుకు చూస్తున్నట్లు దర్శనమిస్తాడు. స్వామివారికి గోపురముతో కూడిన ఆలయ నిర్మాణం లేదు. ఆకాశమే గోపురం, సూర్యచంద్రులే దీపాలుగా ఆదోని కొండే పీఠంగా ఈ స్వామి గోచరిస్తుంటాడు. స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకై గతంలో ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయట. అయితే తనకు ఒకే ఒకరోజులో ఆలయాన్ని నిర్మించగలిగితే, ఆలయనిర్మానానికి ఒప్పుకుంటానని, అలా కుదరనప్పుడు తనకు అసలు ఆలయమే వద్దని స్వామివారు ఓ భక్తునికలలో కనిపించి చెప్పారట. అప్పట్నుంచి స్వామివారికి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగలేదు. అయితే ప్రస్తుతం స్వామి చుట్టూ చలువరాళ్ళతో గోడలను ఏర్పాటు చేసారు.
ఈ స్వామివారు మరో ప్రత్యేకతతో భక్తజనలను విస్మయపరుస్తూంటాడు. భక్తులు స్వామివారికి సమర్పించుకునే నాణేలను స్వామివారి విగ్రహానికి వెనగ్గా వెళ్ళి వీపుకు అంటిస్తే, ఆ నాణేలు అయస్కాంతానికి అతుక్కుపోయినట్లుగా అతుక్కుపోతుండటం విచిత్రం ! స్వామివారి వెనుక శివాలయం, శ్రీసీతారామలక్ష్మణఆంజనేయసమేత రామాలయం ఇటీవలే నిర్మించబడ్డాయి.
ఇంకొంచెం దూరం వెళితే అమ్మవారి సన్నిధి కనబడుతోంది. త్రినేత్రి అయిన ఈ అమ్మవారిని సంతానం లేనివారు కొలుచుకుంటుంటారు. ఈ తల్లి సన్నిధికి ప్రక్కన గణేశమందిరం ఉంది. అమ్మవారి ముందు రెండు పాదుకలు కనబడుతూంటాయి. అమ్మవారి సన్నిధికి ప్రక్కనున్న వృక్షానికి సంతానం లేనివారు సంతానప్రాప్తికోసం కట్టిన ముడుపులను చూడగలం.
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శ్రీరణమండలవీరాంజనేయస్వామివారికి ఉత్సవాలు జరుగుతూంటాయి. శ్రావణమాసం ప్రారంభమైనది మొదలు మండలకాలంపాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఆకు పూజలు జరుగుతూంటాయి. ప్రతి శనివారం విశేషపూజలు జరుగుతాయి. శ్రావణమాసంలో మూడవ శనివారం నాడు విశేష పూజలతో పాటూ అన్నదాన, రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. మండలం రోజుల తర్వాత భాద్రపద పౌర్ణమినాడు మహాపూజను నిర్వహిస్తూంటారు.
ఎత్తైన కొండపై ప్రకృతి అందాల మధ్య అలరారే ఈ కొండపైకి ఎక్కి, చుట్టుప్రక్కలా కలియజూసినప్పుడు, ప్రక్కనున్న కొండలపై శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, శివమారుతీ ఆలయం, నవ తీర్థ హనుమాన్ ఆలయం అంటూ పలు ఆలయాలు దర్శనమిస్తూంటాయి. వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు మెట్లున్నాయి. కానీ, నవతీర్థ హనుమ ఆలయాన్ని చేరుకోవాలంటే కొండరాళ్ళపై పాక్కుంటూ చేరుకోవాల్సిందే ! ఆ కొండపైకి ఎక్కడం సులభం కాదు. ఆదోనికి అన్ని నగరాల నుంచి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆదోనికి దగ్గరలోనున్న రైల్వేస్టేషన్ మంత్రాలయం రోడ్డు. మంత్రాలయం దర్శించుకునే భక్తులు ఆదోని శ్రీరణమండల వీరాంజనేయస్వామిని దర్శించుకుంటుంటారు.

MUKKOTI EKADASI - NARAYANA STHOTRAM IN TELUGU


నారాయణ స్తోత్రం.
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ
నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ నారాయణ
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ
పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ
వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ
అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ
గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ
సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ
దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ
మాం మురళీకర ధీవర పాలయ శ్రీధర నారాయణ
జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ
తాటకమర్దనరామ నటగుణవివిధధనాఢ్య నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
గౌతమపత్నీపూజన కరుణఘనావలోకన నారాయణ
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ
అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే
ఇతి శ్రీ మత్ శంకరాచార్య విరచిత శ్రీనారాయణస్తోత్రం సంపూర్ణం

IMPORTANCE OF EKADASI IN DHANURMASAM - CALLED AS MUKKOTIEKADASI


ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. 
విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు.
ఈ వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.
ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు.
వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు.
అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్‌శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.