WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 1 August 2016

SPECIAL ARTICLE ABOUT PUJAS TO BE PERFORMED IN SRAVANAMASAM - 2016


 శ్రావణమాసం లో చేసుకోవలిసిన పూజలు వాటి ఫలితాలు…

శ్రావణమాసం అనగానే ప్రతీఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నటు అనిపిస్తుంది. అలంటి శ్రావణమాసం వచ్చేస్తుంది. ఈ నెలరోజులు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. 

ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో సుభకర్యాలు పెళ్ళిళ్ళు ,వ్యాపారాలు ,మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు…

* మంగళ గౌరీ వ్రతం..

ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి,ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

* వరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని శుక్రవారములు లక్ష్మీదేవిని పూజించాలి. పెరంటాల్లను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ పూజ వలన సౌభాగ్యం,సంతోషం, ధన దాన్యములతో వర్ధిల్లుతాము. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు.

* శుక్ల పక్ష పౌర్ణమి

ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. అంతేకాకుండా శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం.

* శుక్ల పక్ష ఏకాదశి

శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.

ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు. శివారాధన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా ఈ మాసంలో కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం కూడా వస్తాయి. ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నారు పెద్దలు. మనశక్తి ని బట్టి భక్తిని ఆచరించి, మనసులో మనస్పూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ… వీలైనన్ని పూజలు చేసుకుని సకల సౌభాగ్యాలు పొందుదాము.

IMPORTANCE OF WOMEN - FEMALE IN SRAVANAMASAM


స్త్రీ వైభవాన్ని తెలిపే శ్రావణమాసం!

ఆషాఢమాసం అయిపోయి శ్రావణమాసంలోకి అడుగుపెడుతున్నాం. ఈ ఆగస్టు రెండు నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్నది. ఈ మాసంలో వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు తెలుగు, కర్ణాటక రాష్ర్టాల్లో అధికంగా స్త్రీలు ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహ స్త్రీలు వంశాభివృద్ధి, కుటుంబ క్షేమం కోసం చేస్తుంటారు. ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకం హిందువుల్లో ఉంది. ఈ దేవతను ఆరాధన చేస్తే ఐష్టెశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు.

* లక్ష్మీ కళ..

వాస్తవానికి స్త్రీలలో ఉన్న సహజమైన వైభవాన్ని ఆవిష్కరించేది ఈ వరలక్ష్మీ వ్రతం. మనం సాంప్రదాయ స్త్రీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే బాల్యం నుంచి విశేషమైన లక్షణాలు ఆమెలో కనిపిస్తాయి. స్త్రీ వివాహానికి ముందు ఇంట్లో తల్లికి సాయంగా వంటపని, ఇంటిపనుల్లో సాయం చేస్తూ ఊరటగా ఉంటుంది. అదే అమ్మాయి తండ్రి మనసును అర్థం చేసుకుంటూ ఆయన మానసిక స్థితిగతులను గమనిస్తూ ఆయన ఎదుర్కునే కష్టాల బరువు తెలియకుండా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, శాంతిని సృష్టిస్తుంది. చాలామంది ఇళ్లలో ఒక అనుభవం ఉంటుంది. అమ్మాయికి పెళ్లి చేసి పంపిన తర్వాత ఆ ఇంటికి ఏదో లక్ష్మీ కళ పోయినట్టు తెలుస్తుంది. కొందరికి భౌతికంగా కూడా ఆ విషయం అవగాహనలోకి వస్తుంది. అంటే స్త్రీ సాక్ష్యాత్తు లక్ష్మీదేవి అని మనకు అర్థమవుతుంది.

వివాహతంతులో అమ్మాయిని తామరపువ్వులాంటి బుట్టలో కూర్చోబెట్టి లక్ష్మీదేవిగా ఆవాహన చేసి వరుడిని విష్ణుమూర్తిగా చేసి పాదాలు కడిగి ఈ ఇంటి లక్ష్మీదేవిని ఆ ఇంటికి పంపుతాం. అలాగే లక్ష్మీ స్థానాలుగా చెప్పబడిన ఐదింటిలో స్త్రీ పాపిట కూడా చెప్పబడింది. ఈ పూర్తి విషయాన్ని గమనిస్తే స్త్రీ అంటే సాక్ష్యాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం అవగాహన చేసుకోవచ్చు. మరి తానే సాక్ష్యాత్తు లక్ష్మీ స్వరూపమై ఉండి స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతాలు చేయవలసిన అవసరం ఏంటి? అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

* వ్రత మహాత్మ్యం..

స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేయడంలో పరమాద్భుతమైన రహస్యం దాగి ఉంది. మనం పైన పరిశీలించిన స్త్రీ లక్షణంలో ఎక్కడా ఆమె తన కోసం తాను చేసిన క్రతువు లేదు. బాల్యంలో కుటుంబంలో శాంతిసౌఖ్యాలను ప్రసాదించగా, పెళ్లికి ముందు వేదయుక్తమైన, ధర్మయుతమైన భర్త లభించి ఆయన ద్వారా లోకానికి మేలు చేయాలనే సంకల్పంతోనే వివాహానికి ముందు మంచి భర్త కోసం చేసే నోములు ఉన్నాయి. అలాగే వివాహానంతరం ఆమె చేసే వ్రతాలు, పూజలు అత్తవారింటి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, భర్త, పిల్లల యోగక్షేమాల కోసం ఉంటాయి.

స్త్రీ వల్లే పురుషులు పితృ రుణాన్ని తీర్చుకుని ఆత్మాభివృద్ధిని పొందుతున్నాడు. ఈ పూర్తి ప్రయాణంలో స్త్రీ తన స్వార్థం కోసం చేసిన ఏ క్రతువు మనకు కనబడదు. చాలామంది గమనించని మరో విషయం ఏంటంటే శ్రావణమాసంలో చేస్తున్న వరలక్ష్మీ వ్రతం కూడా కేవలం ఆమె తన కుటుంబం కోసం మాత్రమే కాదు... తను లక్ష్మీ దేవియై ఇతర ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలాది సత్కారాలను చేసి ఎదుటి స్త్రీలలో ఉన్న లక్ష్మీతత్వాన్ని ఆవిష్కరించడమే వరలక్ష్మీ వ్రతం ఉద్దేశం.

ఈ వ్రతం ద్వారా తన ఇల్లే కాదు. సమాజమంతా ఐష్టెశ్వర్యాలతో తులతూగేలా స్త్రీ తన దివ్యత్వాన్ని చాటుకుంటుంది. సమాజంలో మనుష్య ఉపాధిని పొందిన ఎవరైనా కేవలం తన కోసం తాను బతకడమే కాకుండా కుటుంబం కోసం సమాజం కోసం పాటు పడాలని సందేశమిస్తుంది స్త్రీ జీవితం.

శ్రావణ మాసంలో ప్రతీ స్త్రీలోనూ అమ్మవారి సర్వశక్తులు ప్రచండస్థాయిలో దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఆరోజు స్త్రీ కుటుంబం కోసం చేసే ఈ వరలక్ష్మీ వ్రతంలో అష్టలక్ష్ములూ చేరి ఐష్టెశ్వర్యాలను పొందేలా అనుగ్రహిస్తారు. ప్రతి స్త్రీ తన కుటుంబం కోసం ఈ వ్రతం ఆచరించగలిగితే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే కుటుంబమే సమాజం అనే విషయం మనందరికీ తెలిసిందే! సనాతన ధర్మం ఏది చేసిన వ్యక్తిగత, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొనే చేస్తుందనడానికి తార్కాణమే వరలక్ష్మీ వ్రతం.

SRAVANAMASAM - SRI VYBHAVALAKSHMI PUJA VIDHANAM - VARALAKSHMI VRATHAM - PUJA VIDHANAM - FULL ARTICLE ABOUT VARALAKSHMI VRATHAM IN TELUGU


వరలక్ష్మి వ్రతం అచరించిన పార్వతీ దేవి కథ ... వరలక్ష్మీ వ్రతం పూజ ఎలా చేయాలి ..?

01. అష్టయిశ్వర్యాలను ప్రసాధించే శ్రీ వరలక్ష్మీ వ్రతం ...
02. వరలక్ష్మీ వ్రతం పురాణ గాధ .. ఎందుకు ఈ వరలక్ష్మీ వ్రతం చేయాలి..?
03. వరలక్ష్మి వ్రతం అచరించిన పార్వతీ దేవి కథ ... వరలక్ష్మీ వ్రతం పూజ ఎలా చేయాలి ..?
.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

* వరలక్ష్మీ వ్రతం పురాణ గాధ :....

స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది.

ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

* ఎందుకు ఈ వరలక్ష్మీ వ్రతం చేయాలి..?

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

* వరలక్ష్మి వ్రతం అచరించిన పార్వతీ దేవి కథ :.....

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను.

ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం.. శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం.. లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః.. బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం.. వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను.

పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

* వరలక్ష్మీ వ్రతం పూజ ఎలా చేయాలి ..?

మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.

తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి.

ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.

ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.

పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి.

వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.

శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.