భక్తియోగః 1( అథ ద్వాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత
అర్జున ఉవాచ:-
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే,
యే చాప్యక్షర మవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః.
అర్జునుడు చెప్పెను - ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మీయందే మనస్సును నెల్కొల్పినవారై ఏ భక్తులు మిమ్ముపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆయిరు తెగలవారిలో యోగమును బాగుగ నెరిగిన వారెవరు?.
******************************************************************************************* 1
శ్రీ భగవానువాచ:-
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే,
శ్రద్ధయా పరయోపేతా
స్తే మే యుక్తతమా మతాః.
శ్రీ భగవానుడు చెప్పెను: నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై (తదేకనిష్థులై) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా యభిప్రాయము.
******************************************************************************************* 2
యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే,
సర్వత్రగమచింత్యం చ
కూటస్థమచలం ధ్రువమ్.
సంనియ మ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః,
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతాః
ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీన పరచుకొని) ఎల్లడల సమభావముగలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తి గల వారై ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలింపనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.
******************************************************************************************* 3,4
క్లేశోధికతర స్తేషా
మవ్యక్తాసక్త చేతసామ్,
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే.
అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునం దాసక్తి గల మనస్సు గలవారికి (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగునోపాసకుల కంటె) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది.
******************************************************************************************* 5
యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరాః,
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయంత ఉపాసతే.
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్,
భవామి న చిరాత్పార్థ
మయ్యావేశిత చేతసామ్
ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నాయందు సమర్పించి, నన్నే పరమగతిగ దలచినవారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .
******************************************************************************************* 6,7
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః.
నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.
******************************************************************************************* 8
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్,
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ.
ఓ అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము).
******************************************************************************************* 9
అభ్యా సేప్యసమర్థోసి
మత్కర్మపరమో భవ,
మదర్థమపి కర్మాణి
కుర్వన్ సిద్ధి మవాప్స్యసి.
ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ వసమర్థుడవైతివేని నాసంబంధమైన కర్మలజేయుటయందాసక్తి గలవాడవుకమ్ము. అట్లు నా కొరకు కర్మలను జేయుచున్ననుగూడ నీవు మోక్షస్థితిని బడయగలవు.
******************************************************************************************* 10
అథై తదప్యశక్తోసి
కర్తుం మద్యోగమాశ్రితః,
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్.
ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించిన వాడవై దీనినిగుడ నాచరించుటకు శక్తుడవుకానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సుగలవాడవై సమస్త కర్మములయొక్క ఫలములను త్యజించివేయుము.
******************************************************************************************* 11
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానం విశిష్యతే,
ధ్యానాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్ఛాంతిరనంతరమ్.
వివేకముతోగూడని అభ్యాసముకంటె (శాస్త్ర జన్య) జ్ఞానము శ్రేష్ఠమైనదికదా! (శాస్త్రజన్య) జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్ఠమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృత్తి యందును విషయ దోషము లేకుండుట శ్రేష్ఠమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ చిత్త) శాంతి లభించుచున్నది..
******************************************************************************************* 12
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ,
నిర్మమో నిరహంకారః
సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్ట స్సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి
ర్యోమద్భక్తస్స మే ప్రియః
సమస్త ప్రాణులయెడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరకుకొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 13, 14
మస్మాన్నో ద్విజతే లోకో
లోకాన్నో ద్విజతే చ యః,
హర్షామర్ష భయోద్వేగై
ర్ముక్తో యస్స చ మే ప్రియః.
ఎవని వలన ప్రపంచము (జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడొ, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు .
******************************************************************************************* 15
అనపేక్ష శ్శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః,
సర్వారంభ పరిత్యాగీ
యో మద్భక్తస్స మే ప్రియః.
కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతరశుద్ధిగలవాడును, కార్యసమర్థుడు (సమయస్ఫూప్తి గలవాడును) తటస్థుడును, దిగులు (దుఃఖము) లేనివాడును, సమస్త కార్యములందును కర్తృత్వమును వదలినవాడును (లేక సమస్తకామ్యకర్మలను, శాస్త్ర నిషిద్ధకర్మలను త్యజించినవాడును) నాయందు భక్తిగలవాడును, ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 16
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాంక్ష తి,
శుభాశుభ పరిత్యాగీ
భక్తిమాన్ యస్స మే ప్రియః.
ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును బొందడో, ఎవడు శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 17
సమశ్శత్రౌ చ మిత్రే చ
తథా మానావమానయోః,
శీతోష్ణసుఖదుఃఖేషు
సమస్సజ్గవివర్జితః.
తుల్యనిందాస్తుతిర్మౌనీ
సంతుష్టో యేన కేనచిత్,
అని కేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః
శత్రువునందును మిత్రునియందును, మానావమానములందును, శీతోష్ణ సుఖదుఃఖములందును సమముగ నుండువాడును, దేనియందును సంగము (ఆసక్తి, మనస్సంబంధము) లేనివాడును, నిందాస్తుతులందు సమముగ నుండువాడును, మౌనముతో నుండువాడును (లేక మననశీలుడును), దేనిచేతనైనను (దొరికినదానితో) తృప్తిని బోందువాడును, నిర్దిష్టమగు నివాసస్థానము లేనివాడును (లేక గృహాదులందాసక్తి లేనివాడును), నిశ్చయమగు బుద్ధిగలవాడును, భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 18, 19
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే,
శ్రద్ధధానా మత్పరమా
భక్తాస్తేతీవ మే ప్రియాః
ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి (నాయం దాసక్తి గలవారై) ఈ అమృతరూపమగు (మోక్షసాధనమైన) ధర్మమును (ఇప్పుడు చెప్పబడిన ప్రకారము) అనుష్ఠించుదురో అట్టిభక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.
******************************************************************************************* 20
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, భక్తియోగోనామ, ద్వాదశోధ్యాయః